'సీమాంధ్ర ప్రజల డిమాండ్ ను ఆంటోని కమిటీకి వివరించాం'
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం అనంతరం చోటుచేసుకున్న పరిస్థితులను వివరించడానికి ఆంటోని కమిటీతో సీమాంధ్ర నేతలు భేటి అయ్యారు. ఈ భేటిలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.
అనంతరం కేంద్రమంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను ఆంటోని కమిటీకి వివరించామని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని.. అదే విషయాన్ని వివరించామన్నారు. మా ప్రాంతంలో నెలకొన్న భావాలు, నెలకొన్న పరిస్థితులను అర్ధం చేసుకోవాలని కోరామని వెల్లడించారు.
సీమాంధ్ర ప్రజల భావాల్ని అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నామన్నారు. ఆంటోని కమిటీపై నమ్మకం ఉంది అని అన్నారు. ఆంటోని కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీమాంధ్ర ప్రజలు అనుకుంటున్నారని తెలిపామన్నారు. రాష్ట్రం విడిపోతే కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని ఆంటోని కమిటీకి తెలిపామని పళ్లం రాజు మీడియాతో అన్నారు. అంతకుముందు ఆంటోని కమిటితో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.