ప్రధాని వారించినా.. రాజీనామాకే పళ్లం రాజు మొగ్గు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పలువురు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, మంత్రులు రాజీనామాలు సమర్పించారు. కేబినెట్ నిర్ణయానికి నిరసనగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పళ్లం రాజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయవద్దని.. పదవిలో కొనసాగాలని పళ్లం రాజును కోరినట్టు సమాచారం. అయితే సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పళ్లం రాజు రాజీనామాకే మొగ్దు చూపినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావులు రాజీనామా చేయగా, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజంపేట ఎంపీ సాయి ప్రతాప్ లు తమ రాజీనామాలను ప్రకటించారు. రాష్ట్ర విభజనకు కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు అని అమలాపురం ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు.