సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను చేసిన రాజీనామాలపై తొందరవద్దని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సూచించినట్లు కేంద్ర మంత్రి పళ్లంరాజు తెలిపారు. అయితే రాజీనామాలపై వెనక్కితగ్గారా, దాన్ని ఉపసంహరించుకుంటారా? అన్న ప్రశ్నకు ఆయన జవాబివ్వలేదు. సీమాంధ్ర ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించే అంశాన్ని కేంద్రం ఏర్పాటు చేసే మంత్రుల బృందం పరిశీలిస్తుందని సోనియా హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో పళ్లంరాజు సోనియాతో భేటీ అయ్యారు. శుక్రవారమే సోనియాతో భేటీ అయిన పళ్లంరాజు తన రాజీనామాపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా శనివారం ఆమెతో మరోమారు సమావేశమై రాజీనామాలు, సీమాంధ్రలోని పరిస్థితులపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కేబినెట్ నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేశానని మేడమ్‌కు తెలిపా. అయితే రాజీనామాలపై తొందరవద్దని మేడమ్ చెప్పారు. సీమాంధ్ర ప్రజల సమస్యలన్నింటినీ పరిశీలించి, పరిష్కరించేందుకు మంత్రుల బృందం కృషి చేస్తుందని చెప్పారు. మంత్రుల బృందంలో సభ్యునిగా, వారితో కలిసి పనిచేయాలని సూచించారు’’ అని పళ్లంరాజు పేర్కొన్నారు.