సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రచారం చేసే నేతలూ కరువయ్యారు. అగ్రనేతలైన సోనియా, రాహుల్, చిరంజీవిలను నమ్ముకొనే స్థితిలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు లేరు. సోనియా, రాహుల్‌గాంధీలతో ప్రచారానికి పీసీసీ ఏర్పాట్లు చేస్తున్నా, వారిపై నేతలకు అంతగా ఆశ కలగడంలేదు. ఈ నెలాఖరున విశాఖ, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో సోనియా సభలు ఉంటాయని, తరువాత రాహుల్ కూడా పర్యటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావే శాలున్న తరుణంలో అసలు వారు వస్తారో రారో తెలియదని, ఒకవేళ వచ్చినా, వారి వల్ల పార్టీకి ప్రయోజనం చేకూరడం మాట అటుంచి చేటు తెస్తుందేమోనన్న భయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది. పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలపై పొరుగు రాష్ట్ర ఎంపీలతో దాడులు చేయించి మరీ విభజన బిల్లును ఆమోదించిన వైనాన్ని ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. సోనియా ఈ ప్రాంతంలో అడుగుపెడితే గాయం మరింత రేగి వ్యతిరేకతను పెంచుతుందని భయపడుతున్నారు. పైగా, ఇటీవల సోనియాగాంధీ కరీంనగర్‌లో ప్రచారానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ ఒక్కటే తెలంగాణ ఇచ్చిందని, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీలు అడ్డుపడ్డాయని చెప్పారు. ఈ తరుణంలో ఆమె ఇక్కడికి వస్తే వ్యతిరేకతే తప్ప ప్రయోజనం ఉండదని నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సోనియా, రాహుల్‌పై ఆశలు వదులుకున్నా, ప్రజల మధ్యకు వెళ్తేందుకు రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ ఉన్న నేతలు కూడా కనిపించడం లేదు. పార్టీ ప్రచార బాధ్యతలను చేపట్టిన కేంద్ర మంత్రి చిరంజీవిపైనా అభ్యర్థుల్లో నమ్మకం కుదరడంలేదు. విభజన సమయంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి రాజ్యసభలో చేసిన ప్రసంగం కాంగ్రెస్‌కు అనుకూలంగానే సాగింది తప్ప సీమాంధ్రకు జరిగే నష్టం గురించి ఒక్క ముక్కా చెప్పలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది.
ఇటీవల శ్రీకాకుళం నుంచి చిరంజీవి నేతృత్వంలో సాగిన బస్సుయాత్రకు కూడా స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సాగే చిరంజీవి ప్రచారం అంతగా ఫలితాన్నివ్వకపోవచ్చని పార్టీ నేతలే చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ఈసారి సొంత నియోజకవర్గాల్లోనే గడ్డు పరిస్థితులు ఎదురవుతుండటంతో ఈసారికి తాము గట్టెక్కితే చాలనుకొనే స్థితిలో ఉన్నారు. ఒక్క పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రమే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మిగతా వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
అగ్రనేతలొస్తే అసలుకే మోసం!
Published Mon, Apr 21 2014 2:16 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement