
ఆంటోని కమిటీకి కాలపరిమితి లేదు: దిగ్విజయ్
వచ్చే సోమవారం నుంచి ఏకే ఆంటోనీ కమిటీ తన పని ప్రారంభించే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆంటోనీ కమిటీని కలిసేవారి జాబితాను సీఎం, పీసీసీ చీఫ్ ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. ఆంటోనీ కమిటీ హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆంటోనీ కమిటీకి ఎలాంటి కాలపరిమితి లేదని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన ప్రక్రియకు, ఆంటోనీ కమిటీకి సంబంధం ఉందని స్పష్టం చేశారు. అన్ని విజ్ఞాపనలు పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కమిటీ చర్చిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల అభ్యంతరాలను తెలుసుకునేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.