స్పష్టత ఇచ్చిన తర్వాతే విభజన: సీఎం కిరణ్
రాష్ట్ర విభజనపై అభ్యంతరాలుంటే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని ఉన్నతస్థాయికి చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏకే ఆంటోనీ కమిటీని హైదరాబాద్కు ఆహ్వానించి అభ్యంతరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన హామీయిచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత తొలిసారిగా సీఎం కిరణ్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.
సమ్మెకు దిగొద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేపడితే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో జాతీయ నాయకుల విగ్రహాల కూల్చివేతను సీఎం ఖండించారు. రాజకీయ లబ్ది కోసమే విగ్రహాల ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. విధ్వంసాలకు పాల్పడే వారిపై కఠిన వైఖరి అవలంభిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కచ్చితంగా, కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రం కలిసివుండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటనను వ్యతిరేకించడం లేదు, స్వాగతించడం లేదన్నారు. పార్టీ వరకు మాత్రమే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. విభజన నిర్ణయం ఇంకా కాంగ్రెస్ పార్టీ వద్దే ఉందన్నారు. రాష్ట్ర విభజనపై మిగతా పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సీపీఎం, ఎంఐఎం మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయని వెల్లడించారు. విభజిస్తే జలవివాదాలు పెరుగుతాయన్నారు. ఉద్యమాల కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు విద్యుత్ సమస్య ఎదురవుతుందని తెలిపారు. 610 జీవో విషయంలో అస్యతాలు ప్రచారం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయం తీసుకుందని అన్ని అంశాలను చర్చించాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు. ఆ తర్వాతే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం అభిప్రాయపడ్డారు.