13న ఢిల్లీకి సీఎం కిరణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 13న ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోని కమిటీతో ఆయన భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం ఆరోజు ఆంటోని కమిటీతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం బొత్స ఢిల్లీలోనే ఉన్నారు.
ఈనెల 13న ఇరువురు నేతలు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని హైకమాండ్ ఆదేశించిన నేపథ్యంలో ఏకే ఆంటోని కమిటీతో సమావేశమై సీమాంధ్రలో తలెత్తిన పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీఎం, పీసీసీ చీఫ్‌లతో సమావేశమైన తరువాతే ఆంటోని కమిటీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. సీమాంధ్ర నేతలు, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను ముందే తెలుసుకోవడంతోపాటు వాటిని ఏ విధంగా అధిగమించాలనే అంశంపై చర్చించేందుకే వీరిద్దరితో ఆంటోనీ కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. ఆంటోని కమిటీతో భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఇతర పెద్దలను కూడా సీఎం కలవనున్నారు. అపాయింట్‌మెంట్ లభిస్తే సోనియాగాంధీని కూడా కలిసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి.
మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒకరోజు ముందే అంటే 12న ఢిల్లీకి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. 13న రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ధర్నా అనంతరం వీరంతా సీఎం, పీసీసీ చీఫ్‌లతో కలిసి హైకమాండ్ పెద్దల వద్దకు వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వినతి పత్రం అందజేయనున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.బాలరాజు, విశ్వరూప్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళీమోహన్, సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు శనివారం సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఢిల్లీ యాత్రపై నిర్ణయానికి రావడంతో పాటు ఆ సమాచారాన్ని ఇతర నేతలకు చేరవేశారు. 12న సాయంత్రానికే అంతా ఢిల్లీ చేరుకోవాలని చెప్పారు. గంటా, ఏరాసు, విశ్వరూప్ శనివారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.