సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు
- తెలంగాణ ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం
- ఘర్షణ వాతావరణానికి తెలంగాణ ఎంపీలు, మంత్రుల వ్యాఖ్యలే కారణమని భావన
- పార్టీ వార్‌రూమ్‌లో టీ కాంగ్రెస్ నేతలతో ఆంటోనీ కమిటీ భేటీ
- తెలంగాణ ఉద్యమకారులు సంయమనం పాటించేలా చూడాలని సూచన
- సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఉద్యమాన్ని ఎక్కువ చేసి చూపుతున్నారన్న తెలంగాణ ఎంపీలు, మంత్రులు
- వారి మాటలు నమ్మవద్దని వినతి.. విభజన త్వరగా పూర్తయితే గొడవలే ఉండవని స్పష్టీకరణ
- తెలంగాణ నేతల మాటలతో ఏకీభవించని అధిష్టానం.. రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని మరోసారి ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోనున్నామని విశ్వసిస్తున్న సీమాంధ్ర ప్రజలను మరింత భయభ్రాంతులను చేసేలా వ్యవహరించవద్దని, వారిని రెచ్చగొట్టే విధంగా ఎలాంటి ప్రకటనలూ చేయవద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులను పార్టీ అధిష్టానం ఆదేశించింది. విభజన నిర్ణయం వెలువడిన తర్వాత గత కొద్దిరోజులుగా రాజధాని హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో చోటుచేసుకొన్న హింసాయుత సంఘటనలు, నెలకొంటున్న ఘర్షణ వాతావరణానికి తెలంగాణ నేతల రెచ్చగొట్టే ప్రకటనలే కారణమని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను మంగళవారం ఆంటోనీ కమిటీతో సమావేశానికి ఆహ్వానించింది.
పార్టీ వార్ రూమ్‌లో జరిగిన ఈ సమావేశంలో.. తెలంగాణ ఉద్యమకారులంతా సంయమనం పాటించేలా చూడాల్సిన బాధ్యతను అధిష్టానం ఆ ప్రాంత నాయకులపై పెట్టింది. ఇప్పటికే ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంతో ప్రజాజీవనం దాదాపుగా స్తంభించిపోయిన నేపథ్యంలో సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి అధిష్టానం ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియకు రాజధానిలో నెలకొంటున్న ఘర్షణ వాతావరణం అవరోధంగా నిలిచే ప్రమాదముందని కమిటీ సభ్యులు తెలంగాణ నేతలను హెచ్చరించినట్లు సమాచారం.
ఇలాగైతే ఎలా?
సోమవారంనాడు కమిటీతో సమావేశమైన సీమాంధ్ర కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు తమ దృష్టికి తెచ్చిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ ఆంటోనీ కమిటీ ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ పూర్తి సంయమనంతో వ్యవహరించాలని తెలంగాణ నేతలకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో చోటుచేసుకొన్న సంఘటనలు, దేవాదాయ శాఖ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఘర్షణ, సీమాంధ్ర న్యాయవాదుల సమావేశంపై తెలంగాణ న్యాయవాదుల దాడి, తిరుపతి పర్యటనలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై దాడికి దారితీసేలా ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మంగళవారంనాటి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
అయితే, సీమాంధ్ర నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమైనవని, సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను కూడా వారు భూతద్దంలో చూపుతున్నారంటూ తెలంగాణ నేతలు వాటిని తిరస్కరించినట్లు తెలియవచ్చింది. హైదరాబాద్‌లో తమకు భద్రత లేదంటూ లేనిపోని ఆరోపణలు చేసేందుకే అక్కడి సంఘటనలను వారు అతిగా చిత్రిస్తూ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారని సీమాంధ్ర నేతలపై ప్రత్యారోపణలు చేసినట్లు సమాచారం. తిరుపతిలో వీహెచ్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వెనకేసుకురాగా, హైదరాబాద్‌లో సీమాంధ్ర సోదరులకు ఎలాంటి రక్షణ సమస్యలు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకొనే బాధ్యతను తాము తీసుకొంటామని మరో మంత్రి సర్వే సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
సత్వరమే ప్రక్రియ పూర్తి చేయండి..
సీమాంధ్ర నేతల నుంచి ఇలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధికారిక ంగా ప్రభుత్వ స్థాయిలో సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ శాంతి నెలకొంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకొన్నా ప్రభుత్వపరంగా విభజన ప్రక్రియ ఇంతవరకూ ప్రారంభం కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో కూడా అనుమానాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నిర్ణయం చేయాలని కోరారు. కమిటీ చైర్మన్ , రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, సభ్యులు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పార్టీ అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పాల్గొన్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణలతో పాటు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్, వి.హనుమంతరావు, సురేష్ షేట్కర్ హాజరయ్యారు. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల వాదనలతో ఏకీభవించని ఆంటోనీ కమిటీ సభ్యులు ఇకపై కాంగ్రెస్ నేతలెవరైనా కవ్వింపు ధోరణితో ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.
సోనియాకు పవర్ ఆఫ్ అటార్నీ:సర్వే
రాష్ట్ర విభజన తర్వాత తమకు భద్రత ఉండదని రాజధానిలోని సీమాంధ్రవాసులు భయపడనవసరం లేదని, వారి భయాందోళనలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలలోగా తెలంగాణ రాాష్ట్రం ఏర్పడడం ఖాయమని, వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు రాష్ట్రాలలో విడివిడిగానే జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమకు పూర్తి న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉందన్న ఆయన తమ ప్రాంత ప్రజల భవిష్యత్తును ఆమె చేతుల్లో పెడుతూ పూర్తి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చామని అన్నారు. కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రజానీకానికే కాకుండా సోనియా గాంధీ దేశ ప్రజలందరికీ న్యాయం చేస్తారని చెప్పారు.
ఆలస్యమైతే సమస్యలు పెరుగుతాయి: కోమటిరెడ్డి
హైదరాబాద్‌లో, తెలంగాణలో సీమాంధ్ర ప్రజలకు రక్షణ లేదనే ఆరోపణ ల్లో ఎలాంటి వాస్తవం లేదని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు రాజధానిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని ప్రశాంతంగా జీవిస్తుండగా సీమాంధ్ర ప్రజలకు మాత్రమే ముప్పు ఎందుకు ఎదురవుతుందని ఎంపీ కోమటిరెడి రాజగోపాలరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ అమలు ఆలస్యమైనకొద్దీ ఇలాంటి అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సీమాంధ్రులు క వ్వించినా రెచ్చిపోవద్దు: పొన్నం
సీమాంధ్ర ప్రజలు, ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర న్యాయవాదులు అంతా తమకు పెద్దన్నల వంటి వారేనని, వారు హైదరాబాద్‌లో శాంతి, భద్రతలకు విఘాతం కలుగకుండా పరిమితులకు లోబడి తమ ఆకాంక్షలను వ్యక్తం చేసుకొంటే అభ్యంతరం లేదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే, సీమాంధ్రులు కవ్వించినా, తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ఓడిస్తామన్నా నమ్మవద్దని, విడిపోవాల్సి వస్తున్నదన్న బాధతో వారు చేసే ప్రకటనలు, చర్యలను సద్భావంతో అర్థం చేసుకొని ఓపికగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ ప్రాంత జేఏసీలు, ప్రజా సంఘాలను కోరారు. ఒంగోలులో కరీంనగర్ జిల్లాకు చెందిన డీఈఓపై జరిగిన దాడి, ఏపీఎస్‌ఈబీలో సంతోష్ అనే కాంట్రాక్టు కార్మికునిపై జరిగిన దాడిని కమిటీ దృష్టికి తీసుకెళ్లామని, అలాగే, సీమాంధ్ర నేతల ఫిర్యాదులను ప్రస్తావిస్తూ కమిటీ సభ్యులు తమకు చెప్పిన అంశాలను కూడా తెలంగాణ జేఏసీ, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలకు చేరవేస్తామని ప్రభాకర్ తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలు సామరస్యంగా విడిపోవడం అందరికీ మంచిదన్న ఆయన సీమాంధ్ర నేతలు తమ ప్రాంతాలలో పార్టీని కాపాడుకొనేందుకు చేసే ప్రయత్నాలకు తాము కూడా సహకరిస్తామని అన్నారు. అయితే, సీమాంధ్ర ఉద్యమంలో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినా అక్కడి కాంగ్రెస్ నేతలు క నీసం ఖండించలేదని ఆయన తప్పుబట్టారు.