seemandra Employees
-
అంధకారంలో గ్రామాలు
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె కారణంగా సీమాంధ్ర జిల్లాలోని అనేకగ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అనంతపురం జిల్లాలోని 1200 గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 24 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో 150 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఈ గ్రామాల ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 250 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. వాటిలో 80 గ్రామాలు 36 గంటలకు పైగా అంధకారంలోనే ఉన్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఈ జిల్లాల పరిధిలో 12,500 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. చాలా మటుకు విద్యుత్ ఫీడర్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని మరమ్మతు చేసే దిక్కులేక వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఒక్క కృష్ణాజిల్లాలో 120కి పైగా బ్రేక్ డౌన్ (అంతరాయం) ఏర్పడి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 90 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరు జిల్లాల్లోని డిస్కంలకు మరో రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వైఎస్సార్ జిల్లా కడపలో 220 కేవీ ప్రధాన సబ్‌స్టేషన్ దెబ్బతినడంతో విద్యుత్‌ను పునరుద్ధరించలేక పోయినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని యూనిట్లు పునరద్దరణకు నోచుకోలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయం సబ్‌స్టేషన్ నుంచి చీలకలడోణకు వెళ్లే 33/11కేవీ ఫీడర్ లైనులో బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తింది. దీంతో పలు గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. జిల్లాలోని ఆరు ఫీ డర్లలో 60 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ సత్యనారాయణతెలిపారు. ఆదివారం సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడతామన్నారు. అంధకారంలో శ్రీశైలం జెన్కో, ట్రాన్స్‌కో ఉద్యోగులు మూడు గంటల పాటు విధులు బహిష్కరించడంతో శ్రీశైలంలో అంధకారం నెలకొంది. శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి 9గంటల వరకు శ్రీ శైలం క్షేత్రం, ప్రాజెక్టు కాలనీలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వారంతపు రోజులు కావడంతో శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
జనంతో ఏం పనిలే..!
చీరాల, న్యూస్‌లైన్: ‘మా ఎంపీ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కనిపించడం లేదు..అదృశ్యమైంది’ అంటూ చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పురోహితుడు రామాంజనేయ శాస్త్రి ఫిర్యాదు చేశారు. పనబాక లక్ష్మి కనిపించడం లేదని ప్లకార్డులతో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమైక్యవాదులు నిరసన ర్యాలీలు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు, జేఏసీ నాయకులు ఆమె దిష్టిబొమ్మను దహనం చేసి దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటి నుంచి 45 రోజులుగా అన్ని వర్గాల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఉద్యమబాట పట్టినా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఓట్లేసి పదవులు కట్టబెట్టిన ప్రజలను కనీసం శాంతింపజేసే ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గతంలో ఏవైనా సభలు, సదస్సులకు అప్పుడప్పుడూ వచ్చి మొఖం చూపించి వెళ్లేవారు. ప్రస్తుతం ప్రజల నుంచి నిరసన జ్వాలలు ఎగిసిపడుతుండటంతో నియోజకవర్గ ఛాయలకు కూడా ఆమె రావడం మానేశారు. ఢిల్లీలో కూర్చొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ఆమె సహకారం కూడా... రాష్ట్ర విభజన జరుగుతుందని కేంద్ర మంత్రులందరికీ ముందే తెలుసునని సుస్పష్టమైంది. కేంద్ర మంత్రులు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిసినప్పుడు ఆమె పనబాక లక్ష్మిని ఉద్దేశించి ‘మీకు ఎప్పుడో చెప్పాను కదా.. రాష్ట్ర విభజన జరుగుతుందని. అప్పుడు మౌనంగా ఉండి మరలా ఇప్పుడు మాట్లాడటం ఏమిటి’ అని సోనియా అన్నట్లు ప్రచారం జరిగింది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని పనబాకకు ముందే తెలిసినా ఆమె కేవలం పదవి కోసం మిన్నకుండిపోయి విభజనకు సహకరించారని ప్రజలు విమర్శిస్తున్నారు. రాజ్యసభ వైపు చూపు... బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గుంటూరు జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పనబాక ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆమె నియోజకవర్గాభివృద్ధికి పాటుపడింది నామమాత్రమే. పార్టీలో ఉన్న క్యాడరే ఆమెకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రకటన వెలువడటం, ఆమె కేంద్ర మంత్రి పదవికి కానీ, ఎంపీ పదవికి కానీ రాజీనామా చేయకపోవడం, పెపైచ్చు అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమని తేల్చి చెప్పడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలానే ఐదు రోజుల క్రితం ఢిల్లీలో బొత్స సత్యనారాయణ... ఎంపీ రాయపాటి సాంబశివరావునుద్దేశించి పార్టీ ఎప్పుడు పెడుతున్నారని అడగ్గా ఆయన ‘మా పార్టీ కన్వీనర్ ఆమే’నంటూ పనబాక లక్ష్మిని ఉద్దేశించి అన్నారు. ఆమె మాత్రం నేను ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. దీన్నిబట్టి సీమాంధ్ర ప్రజలపై ఆమెకున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే ఆమె అనుచరులు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాజయం ఎదురవుతుందని, మేడం ఆశీస్సులు మెండుగా ఉండటంతో రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో పనబాక ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. -
పండుగరోజూ ఆగని పోరు
సాక్షి నెట్వర్క్: గణేశ చతుర్ధి వేడుకల్లోనూ సమైక్యనినాదం మార్మోగుతోంది. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చూడాలంటూ ఆ దేవదేవుడికి సమైక్యవాదులు మంగళవారం పూజలు చేశారు. విభిన్నరూపాల్లో ఉద్యమాన్ని హోరెత్తించారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, మానవహారాలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు వరుసగా 42వరోజూ దద్దరిల్లాయి. విశాఖ జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర అక్షరాలతో కూడిన గణేశ్ ప్రతిమల్ని ప్రతిష్ఠించగా, మరికొన్ని చోట్ల వినాయకుడి బ్యాక్‌డ్రాప్‌లో సమైక్య రోడ్‌మ్యాప్‌ను డిజైన్ చేశారు. గాజువాకలో సమైక్యాంధ్ర బాలగణపతి పేరిట 77అడుగుల వినాయకుడ్ని ఏర్పాటు చేశారు. కాగా, సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దిష్టిబొమ్మను ఏయూ మెయిన్ గేట్ వద్ద ఆ సమితి కార్యకర్తలే దహనం చేశారు.విజయనగరంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద నిర్వహించిన మాక్ కోర్డులో న్యాయమూర్తుల వేషధారణలో ఉన్న వ్యక్తులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్పునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని చర్చి సెంటర్లో నాయీ బ్రాహ్మణులు బాజాభజంత్రీలతో నిరసనకు దిగారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని తీర ప్రాంతవాసులు, షార్ కాంట్రాక్ట్ కార్మికులు సూళ్లూరుపేట-శ్రీహరికోట రోడ్డులో అటకానితిప్ప వద్ద షార్కు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. నెల్లూరులో నీటిపారుదల శాఖ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్‌లో సమైక్య శంఖారావం పేరుతో బలిజ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వేలాది మంది చేనేత కార్మికులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. పులివెందుల పట్టణంలో జీపుల ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదుల ఆధ్వర్యంలో రోడ్డుపై చాకిరేవు పెట్టి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో న్యాయవాదులు కోర్టు వద్ద యజ్ఞం చేశారు. పుంగనూరులో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ వినాయకుని విగ్రహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తిరుపతిలో దీక్షాశిబిరాల్లో వినాయకుని విగ్రహాలు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ప్రార్థించారు. రాష్ట్ర విభజన ఆపాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, సోనియాలకు లక్ష ఉత్తరాలు రాసే బృహత్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో క్రైస్తవులు ఉదయం పది నుంచి సాయంత్రం వరకూ సమైక్య గీతాలు ఆలపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ‘అనంత’ అన్యాయమైపోతుందని అనంతపురం జిల్లా బుక్కపట్నంలో ఉపాధ్యాయులు ఉరితాళ్లు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లలో రైతులు ఎడ్లబండ్లతో ప్రదర్శన చేపట్టి రోడ్డుపై అరకలుదున్ని నిరసన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా జేఏసీ బుధవారం నుంచి 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. -
విభజన కలతతో మరో ఆరుగురి మృత్యువాత
సాక్షి నెట్వర్క్: విభజన భయంతో గుండెఆగి మరణిస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. శనివారం ఒక్కరోజే ఆరుగురు మృత్యువాతపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్తున్న వాహనాలపై రాళ్లతో దాడులు చేయడం వంటి దశ్యాలను టీవీల్లో చూస్తూ ఉద్వేగానికి గురై వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలంలోని మారెళ్లమడకకు చెందిన బొజ్జా భాస్కర్‌రెడ్డి(48), అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కల్లిటి శ్రీనివాసులు (49), శ్రీకాకుళం జిల్లా హిరమండలం పాడలి పంచాయతీకి చెందిన మీసాల తులసమ్మ(53), కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పి.లింగాపురానికి చెందిన కురవపెద్దవెంకటస్వామి (45) గుండెపోటుతో మృతిచెందారు. ఇక రాష్ర్ట విభజన భయంతో తూర్పుగోదావరి జిల్లాకాకినాడ రూరల్ మండలం తూరంగిపేటకు చెందిన టైలర్ కొఠాని దుర్గారావు (38), అమలాపురం గండు వీధికి చెందిన రిటైర్డ్ ఏపీఎస్ఈబీ ఉద్యోగి గుర్రాల జయరాందాసు(59) గుండెఆగి మృతి చెందారు. -
ఉద్యోగుల సమస్యలను నివృత్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళనలు, అనుమానాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కోరారు. వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్థాయి అధికారి ఇరు ప్రాంతాల ఉద్యోగులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరెన్ని చెప్పినా విభజన నిర్ణయం జరిగిపోయిందని, ఇక వెనక్కు తిరిగే పరిస్థితి లేనేలేదని ఉద్ఘాటించారు. విభజన ఆగుతుందని ఎవరైనా అనుకుంటే పగటి కల కన్నట్లేనని చెప్పారు. ఆయన మంగళవారం సాయంత్రం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈనెల 7న ఏపీఎన్జీవోలు ఎల్బీస్టేడియంలో సభ పెడతామని నోటీస్ ఇచ్చారు. దానికి ఎదురుగా నిజాం కళాశాల మైదానంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని టీఎన్జీవోలు చెబుతున్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని వాళ్ల ఆందోళనలో నిజమెంత? వాటిని అధిగమించేందుకు చేపట్టే చర్యలను వివరించాల్సిన అవసరం ఉంది’’అని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి రాష్ట్ర విభజన అంశం ఏ వర్గాలకు సంబంధించిన అంశమే కాదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కొంతవరకు దీనితో సంబంధం ఉందన్నారు. విడిపోతే నిబంధనల మేరకు సీమాంధ్ర ఉద్యోగులు కొత్త రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుందని, అయితే పదేళ్లు ఉమ్మడి రాజధానిలోనే కొనసాగే అవకాశమున్నందున అప్పటికి చాలా మంది రిటైర్ అవుతారని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనలను నివృత్తి చేసేందుకు హోంశాఖ జోక్యం చేసుకుంటేనే మేలని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు, వర్గాలతో మాట్లాడిన తరువాతే హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఇతర పార్టీలు లేఖలు ఉపసంహరించుకున్నా విభజన ఆగే ప్రసక్తే లేదని చెప్పారు. విభజన నిర్ణయం జరిగినప్పటికీ సోనియాగాంధీ, కాంగ్రె స్ పార్టీ పెద్దలు సీమాంధ్ర ప్రాంతానికి చాలా గొప్ప ప్యాకేజీ ఇస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం, పీసీసీ చీఫ్ విభజనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందా? అని ప్రశ్నించగా... ‘‘విభజన నిర్ణయం అమలులో ఎక్కడైనా ఆటంకం కలిగిందా? ఇక రాష్ట్రపతి పాలనకు ఆస్కారమెక్కడిది? ఒకవేళ మీరు చె ప్పినవాళ్లకు బాధ్యతను అప్పగిస్తే... దానిని అమలు చేయనప్పుడు కదా, మనం మాట్లాడుకోవాల్సింది. కేంద్రం క్లియర్‌గా ఉంది. రోడ్‌మ్యాప్‌ను అమలు చేస్తోంది. ఎక్కడా ఆటంకం లేదు’’అని తెలిపారు. -
సీమాంధ్రలో సిబ్బందికి రేపు జీతాలు రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సమ్మె జరుగుతున్న సీమాంధ్ర జిల్ల్లాల్లోని మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ 2వ తేదీన జీతాలు రావు. చిరుద్యోగులు వినాయక చవితికి ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సీమాంధ్ర జిల్లాల్లో అటెండర్ల నుంచి అధికారుల స్థాయి వరకు సమ్మెలో ఉన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి అధికారులే పనిచేస్తున్నారు. జీతాలకు సంబంధించి, ఖజానా కార్యాలయాలకు బిల్లులు రాలేదు. ఖజానా కార్యాలయాలు, 92 ఉప ఖజానా కార్యాలయాలు ఆగస్టు 13 నుంచి మూతబడడంతో ఈ పరిస్థితి నెలకొంది. జీతాలకోసం ఒకవేళ ఎవరైనా బిల్లులు సమర్పించినా వాటిని పాస్ చేసి బ్యాంకులకు పంపించే వారు కూడా లేరు. సమ్మె కారణంగా, ఆగస్టు 13 నుంచి -నో వర్క్ నో పే- నిబంధన అమలవుతున్నా, 13వ తేదీకంటే ముందు పనిచేసిన 12 రోజుల కాలానికి కూడా ఉద్యోగులకు జీతాలు అందే పరిస్థితి లేదు. అయితే ఈ జిల్లాల్లో పెన్షనర్లకు మాత్రం ఎప్పటిలా నెలసరి పెన్షన్ అందనుంది. గత నెలలో ఇచ్చినంత పెన్షన్‌ను, పెన్షనర్ల అకౌంట్లకు జమ చేయాలని, ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులను ఆదేశించింది. ఇక సీమాంధ్ర జిల్లాల్లో పోలీసులకు, న్యాయ విభాగాల సిబ్బందికి, అధికారులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సోమవారం జీతాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఖజానా ప్రధాన కార్యాలయం ద్వారా బిల్లులు పాస్ చేయించి సోమవారం అకౌంట్లలో జీతాలు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. -
దద్దరిల్లిన సచివాలయం
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ధర్నాలు, నినాదాలు నిరసన ప్రదర్శనలు ఎదురెదురుగా రావడంతో ఉద్రిక్తత బారికేడ్లు ఏర్పాటు చేసి ఇరు వర్గాలకు నచ్చజెప్పిన పోలీసు అధికారులు ఎస్పీఫ్ డీఐజీ ఏసురత్నం నేతృత్వంలో భారీ బందోబస్తు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ధర్నాలతో శనివారం సచివాలయం దద్దరిల్లింది. గంటన్నరపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించాల్సి వచ్చింది. నెలరోజులుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, మూడు రోజులుగా సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నా ఎవరి మార్గంలో వారు వెళ్తుండటంతో అంతా సాఫీగా సాగుతూ వచ్చింది. శనివారం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పది అడుగుల దూరంలోనే ఎదురెదురుగా నిలబడి పోటాపోటీ నినాదాలు చేశారు. నార్త్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, ఎస్పీఎఫ్ డీఐజీ ఏసుదాసు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు వలయంగా ఏర్పడి ఇరు సంఘాల నేతలను ముందుకు రానీకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల చర్చల అనంతరం రెండు సంఘాల వారు వేర్వేరు మార్గాల్లో వెళ్లేందుకు అంగీకరించడంతో ఉత్కంఠకు తెరపడింది.వలయంగా ఏర్పడిన పోలీసులు: ప్రతిరోజులాగే శనివా రం మధ్యాహ్నం ‘కే’ బ్లాకు ఎదుట సచివాలయ తెలంగాణ ఉద్యోగులు, ఎల్ బ్లాకు ఎదుట సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా ప్రారంభించారు. కొద్దిసేపు తర్వాత తెలంగాణ ఉద్యోగులు అక్కడ్నుంచి జే బ్లాకు, ఎల్ బ్లాకు మధ్య రహదారి కూడలిలో ధర్నా చేపట్టారు. ‘ఎవడబ్బ సొత్తు - హైదరాబాద్ మాది’, సీఎం గో బ్యాక్... సీఎం డౌన్ డౌన్, హైదరాబాద్ యూటీ అంటే విశాఖ, తిరుపతిలనూ యూటీ చేయా లి’ అంటూ నినాదాలు చేశారు. నాలుగు రోడ్ల కూడలిలోనే కూర్చుని బతుకమ్మ పాటలు పాడుతూ నినాదాలు చేశారు. ‘ఎల్’ బ్లాకు ఎదుట ధర్నా అనంతరం సీమాంధ్ర ఉద్యోగులు రోజులాగే ప్రదర్శనగా వెళ్లేందుకు ముందుకు కదిలారు. వా రు ముందుకు రాగానే తెలంగాణ ఉద్యోగులు కూడా వీరికి ఎదురుగా నాలుగడుగులు ముందుకు వచ్చారు. ఇరు సంఘా ల ప్రతినిధులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ఎవరినీ ముందుకు వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ముందు వైపు వలయం గా నిలబడ్డారు. తమకు దారి ఇస్తే ముందుకు వెళ్లిపోతామని సీమాంధ్ర ఉద్యోగులు పోలీసు అధికారులతో అన్నారు. ఈ విషయమై తెలంగాణ ఉద్యోగులతో పోలీసు అధికారులు మాట్లాడగా వారిని ఎల్ బ్లాక్ వెనుకనుంచి పంపించాలని, తాము ఈ మార్గంలో ‘సీ’ బ్లాక్ వైపు వెళ్తామని చెప్పారు. ‘‘మా ప్రదర్శన రోజూ వెళ్లే మార్గంలో రహదారిని బ్లాక్ చేసే లా తెలంగాణ ఉద్యోగుల ధర్నాకు ఎలా అనుమతించారు? వారిని పక్కకు పంపకుండా మమ్మల్ని వెనక్కు వెళ్లమనడం ఎలా న్యాయం? రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఇలా మమ్మ ల్ని అడ్డుకుంటుంటే రేపు తెలంగాణ వస్తే మా హక్కులకు రక్షణ ఎక్కడుంటుంది?’’ అని సీమాంధ్ర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ పోలీసు అధికారులు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు సాగించారు. చివరకు సీమాంధ్ర ఉద్యోగులు ఎల్ బ్లాకు నుంచి కే బ్లాకు, జే బ్లాకు మీదుగా ప్ర దర్శనగా వెళ్లడానికి అంగీకరించారు. వారు అలా వెళ్తే తాము నేరుగా వెళ్లిపోతామని తెలంగాణ ఉద్యోగులు అంగీకరించా రు. దీంతో పోలీసులు వారిని ఆయా మార్గాల్లో పంపించారు. సంయమనం పాటిద్దాం...:‘‘తెలంగాణ ఉద్యోగులు మన కు చెల్లెళ్లు, తమ్ముళ్లు లాంటి వారే. వారు ఆవేశంలో మనల్ని తిట్టినా మనం సంయమనం కోల్పోవద్దు. కుటుంబ పెద్దగా మనం ఓపికతో సుదీర్ఘకాలం ఉద్యమం సాగించాల్సి ఉంది. తెలంగాణ వారు మనల్ని రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. మనం ఈ విషయాన్ని గుర్తించి ఇప్పటి వరకూ వ్యవహరించినట్లు శాంతియుతంగానే ఉండాలి. ఏమి జరిగినా ఆవేశానికి లోనుకావద్దు’’ అని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ ఉద్యోగులకు సూచించారు. కొనసాగిన సమ్మెలు, ధర్నాలు..:సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు ప్రభుత్వ కార్యాలయాల్లో చేస్తున్న సమ్మె శనివారం కూడా కొనసాగింది. కోఠిలోని డీఎంహెచ్ఎస్లో ఏపీఎన్జీవో నగర నాయకులు నరసింహం ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అలాగే అబిడ్స్ తిలక్ రోడ్డులోని బీమా భవన్, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోల ధర్నాలు కొనసాగాయి. -
విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత
ఇద్దరు సీమాంధ్ర అధికారుల అరెస్ట్.. బెయిల్ తెలంగాణ ఉద్యోగిపై దాడి చేశారంటూ డీఈలపై ఫిర్యాదు అరెస్ట్ చేసిన పోలీసులు.. సీమాంధ్ర ఉద్యోగుల నిరసన కోర్టులో హాజరుపరిచాక బెయిల్‌పై విడుదలైన డీఈలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని సచివాలయం, విద్యుత్‌సౌధలు సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు శుక్రవారం కూడా పోటాపోటీగా నిరసనలు కొనసాగించారు. విద్యుత్‌సౌధలో ఇద్దరు సీమాంధ్ర అధికారులను అరెస్ట్ చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. జెన్కో డీఈలు సోమశేఖర్, ప్రభాకర్ తెలంగాణ ఉద్యోగిపై దాడి చేశారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిద్దరినీ శుక్రవారం అరెస్ట్ చేశారు. జెన్కో ఎండీ విజయానంద్‌తో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఎండీ అనుమతి లేకుండా కార్యాలయంలో ఉన్నప్పుడే అరెస్టు చేయటం ఏమిటని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. వారిద్దరి అరెస్ట్‌ను నిరసిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగటంతో విద్యుత్‌సౌధలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరెస్ట్ చేసిన ఇరువురిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్‌పై విడుదలై తిరిగి విద్యుత్‌సౌధకు చేరుకున్నారు. తాము నిరసన తెలిపే ప్రదేశానికి తెలంగాణ ఉద్యోగులు వచ్చి రెచ్చగొడుతున్నారని విద్యుత్‌సౌధ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ అనురాధ ఆరోపించారు. వారం కిందట ఇద్దరు వ్యక్తుల మధ్య ఘటన జరిగితే ఇరు ప్రాంతాల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారని తప్పుపట్టారు. సచివాలయంలో పోటాపోటీ నిరసనలు: సచివాలయంలో శుక్రవారం కూడా సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. సీమాంధ్ర ఉద్యోగులు వరుసగా 30వ రోజూ నిరసన ప్రదర్శన చేపట్టారు. వచ్చే నెల 2 నుంచి సమ్మె తథ్యమని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యోగులు కూడా ఎల్ బ్లాక్ వద్ద ధర్నా చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దని కోరారు. ఆర్ అండ్ బీ కార్యాలయంలో: ఎర్రమంజిల్ కాలనీలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు 30 మంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో జై తెలంగాణ నినాదాలతో నిరసన తెలిపారు. పంచాయితీరాజ్ కార్యాలయంలో పంచాయితీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. -
సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు
తెలంగాణ ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం ఘర్షణ వాతావరణానికి తెలంగాణ ఎంపీలు, మంత్రుల వ్యాఖ్యలే కారణమని భావన పార్టీ వార్‌రూమ్‌లో టీ కాంగ్రెస్ నేతలతో ఆంటోనీ కమిటీ భేటీ తెలంగాణ ఉద్యమకారులు సంయమనం పాటించేలా చూడాలని సూచన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఉద్యమాన్ని ఎక్కువ చేసి చూపుతున్నారన్న తెలంగాణ ఎంపీలు, మంత్రులు వారి మాటలు నమ్మవద్దని వినతి.. విభజన త్వరగా పూర్తయితే గొడవలే ఉండవని స్పష్టీకరణ తెలంగాణ నేతల మాటలతో ఏకీభవించని అధిష్టానం.. రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని మరోసారి ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోనున్నామని విశ్వసిస్తున్న సీమాంధ్ర ప్రజలను మరింత భయభ్రాంతులను చేసేలా వ్యవహరించవద్దని, వారిని రెచ్చగొట్టే విధంగా ఎలాంటి ప్రకటనలూ చేయవద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులను పార్టీ అధిష్టానం ఆదేశించింది. విభజన నిర్ణయం వెలువడిన తర్వాత గత కొద్దిరోజులుగా రాజధాని హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో చోటుచేసుకొన్న హింసాయుత సంఘటనలు, నెలకొంటున్న ఘర్షణ వాతావరణానికి తెలంగాణ నేతల రెచ్చగొట్టే ప్రకటనలే కారణమని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను మంగళవారం ఆంటోనీ కమిటీతో సమావేశానికి ఆహ్వానించింది. పార్టీ వార్ రూమ్‌లో జరిగిన ఈ సమావేశంలో.. తెలంగాణ ఉద్యమకారులంతా సంయమనం పాటించేలా చూడాల్సిన బాధ్యతను అధిష్టానం ఆ ప్రాంత నాయకులపై పెట్టింది. ఇప్పటికే ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంతో ప్రజాజీవనం దాదాపుగా స్తంభించిపోయిన నేపథ్యంలో సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి అధిష్టానం ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియకు రాజధానిలో నెలకొంటున్న ఘర్షణ వాతావరణం అవరోధంగా నిలిచే ప్రమాదముందని కమిటీ సభ్యులు తెలంగాణ నేతలను హెచ్చరించినట్లు సమాచారం. ఇలాగైతే ఎలా? సోమవారంనాడు కమిటీతో సమావేశమైన సీమాంధ్ర కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు తమ దృష్టికి తెచ్చిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ ఆంటోనీ కమిటీ ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ పూర్తి సంయమనంతో వ్యవహరించాలని తెలంగాణ నేతలకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో చోటుచేసుకొన్న సంఘటనలు, దేవాదాయ శాఖ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఘర్షణ, సీమాంధ్ర న్యాయవాదుల సమావేశంపై తెలంగాణ న్యాయవాదుల దాడి, తిరుపతి పర్యటనలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై దాడికి దారితీసేలా ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మంగళవారంనాటి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే, సీమాంధ్ర నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమైనవని, సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను కూడా వారు భూతద్దంలో చూపుతున్నారంటూ తెలంగాణ నేతలు వాటిని తిరస్కరించినట్లు తెలియవచ్చింది. హైదరాబాద్‌లో తమకు భద్రత లేదంటూ లేనిపోని ఆరోపణలు చేసేందుకే అక్కడి సంఘటనలను వారు అతిగా చిత్రిస్తూ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారని సీమాంధ్ర నేతలపై ప్రత్యారోపణలు చేసినట్లు సమాచారం. తిరుపతిలో వీహెచ్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వెనకేసుకురాగా, హైదరాబాద్‌లో సీమాంధ్ర సోదరులకు ఎలాంటి రక్షణ సమస్యలు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకొనే బాధ్యతను తాము తీసుకొంటామని మరో మంత్రి సర్వే సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సత్వరమే ప్రక్రియ పూర్తి చేయండి.. సీమాంధ్ర నేతల నుంచి ఇలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధికారిక ంగా ప్రభుత్వ స్థాయిలో సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ శాంతి నెలకొంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకొన్నా ప్రభుత్వపరంగా విభజన ప్రక్రియ ఇంతవరకూ ప్రారంభం కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో కూడా అనుమానాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నిర్ణయం చేయాలని కోరారు. కమిటీ చైర్మన్ , రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, సభ్యులు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, పార్టీ అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పాల్గొన్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణలతో పాటు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్, వి.హనుమంతరావు, సురేష్ షేట్కర్ హాజరయ్యారు. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల వాదనలతో ఏకీభవించని ఆంటోనీ కమిటీ సభ్యులు ఇకపై కాంగ్రెస్ నేతలెవరైనా కవ్వింపు ధోరణితో ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. సోనియాకు పవర్ ఆఫ్ అటార్నీ:సర్వే రాష్ట్ర విభజన తర్వాత తమకు భద్రత ఉండదని రాజధానిలోని సీమాంధ్రవాసులు భయపడనవసరం లేదని, వారి భయాందోళనలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలలోగా తెలంగాణ రాాష్ట్రం ఏర్పడడం ఖాయమని, వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు రాష్ట్రాలలో విడివిడిగానే జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమకు పూర్తి న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉందన్న ఆయన తమ ప్రాంత ప్రజల భవిష్యత్తును ఆమె చేతుల్లో పెడుతూ పూర్తి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చామని అన్నారు. కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రజానీకానికే కాకుండా సోనియా గాంధీ దేశ ప్రజలందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. ఆలస్యమైతే సమస్యలు పెరుగుతాయి: కోమటిరెడ్డి హైదరాబాద్‌లో, తెలంగాణలో సీమాంధ్ర ప్రజలకు రక్షణ లేదనే ఆరోపణ ల్లో ఎలాంటి వాస్తవం లేదని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు రాజధానిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని ప్రశాంతంగా జీవిస్తుండగా సీమాంధ్ర ప్రజలకు మాత్రమే ముప్పు ఎందుకు ఎదురవుతుందని ఎంపీ కోమటిరెడి రాజగోపాలరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ అమలు ఆలస్యమైనకొద్దీ ఇలాంటి అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులు క వ్వించినా రెచ్చిపోవద్దు: పొన్నం సీమాంధ్ర ప్రజలు, ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర న్యాయవాదులు అంతా తమకు పెద్దన్నల వంటి వారేనని, వారు హైదరాబాద్‌లో శాంతి, భద్రతలకు విఘాతం కలుగకుండా పరిమితులకు లోబడి తమ ఆకాంక్షలను వ్యక్తం చేసుకొంటే అభ్యంతరం లేదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే, సీమాంధ్రులు కవ్వించినా, తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఓడిస్తామన్నా నమ్మవద్దని, విడిపోవాల్సి వస్తున్నదన్న బాధతో వారు చేసే ప్రకటనలు, చర్యలను సద్భావంతో అర్థం చేసుకొని ఓపికగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ ప్రాంత జేఏసీలు, ప్రజా సంఘాలను కోరారు. ఒంగోలులో కరీంనగర్ జిల్లాకు చెందిన డీఈఓపై జరిగిన దాడి, ఏపీఎస్ఈబీలో సంతోష్ అనే కాంట్రాక్టు కార్మికునిపై జరిగిన దాడిని కమిటీ దృష్టికి తీసుకెళ్లామని, అలాగే, సీమాంధ్ర నేతల ఫిర్యాదులను ప్రస్తావిస్తూ కమిటీ సభ్యులు తమకు చెప్పిన అంశాలను కూడా తెలంగాణ జేఏసీ, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలకు చేరవేస్తామని ప్రభాకర్ తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలు సామరస్యంగా విడిపోవడం అందరికీ మంచిదన్న ఆయన సీమాంధ్ర నేతలు తమ ప్రాంతాలలో పార్టీని కాపాడుకొనేందుకు చేసే ప్రయత్నాలకు తాము కూడా సహకరిస్తామని అన్నారు. అయితే, సీమాంధ్ర ఉద్యమంలో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినా అక్కడి కాంగ్రెస్ నేతలు క నీసం ఖండించలేదని ఆయన తప్పుబట్టారు. -
‘విభజన’ సమస్యలు వినేందుకే ఉన్నాం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన నిర్ణయానంతరం హైద్రాబాద్‌లో చోటుచేసుకొంటున్న సంఘటనలు దురదష్టకరమైనవని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో, బహిరంగ ప్రదేశాల్లో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పారు. దీనిపై తానిప్పటికే కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదరలతో మాట్లాడానని చెప్పారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకుండా సంయమనం పాటించాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో భేటీ అనంతరం దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు ఆంటోనీ కమిటీ ప్రయత్నిస్తోందని చెప్పారు. విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నందున సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను విరమించుకోవాలని కోరారు. విభజన అనంతర సమస్యలు వినేందుకే ఆంటోనీ కమిటీ ఉందని, సమస్యలను దానికి చెప్పుకోవాలని సూచించారు. సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని, కమిటీతో చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. విభజన బిల్లు, తీర్మానాల్లో పొందుపరచాల్సిన అంశాలు తదితరాలను తమకు చెప్పాలన్నారు. -
దాడులను అరికట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని హైదరాబాద్‌లో వరుసగా సీమాంధ్ర ఉద్యోగులపై జరుగు తున్న దాడులను అరికట్టాలని ఆంటోనీ కమిటీని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కోరారు. తెలంగాణలోని సీమాంధ్రులకు ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని తెలంగాణ నేతలు చేస్తున్న ప్రకటనలు కేవలం మాటల్లోనే తప్ప చేతల్లో కన్పించడం లేదన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో సోమవారం రాత్రి వారు గంటకు పైగా భేటీ అయ్యారు. సమైక్యవాదంతో ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగులు నాలుగు రోజులుగా దాడులకు దిగుతున్నా వాటి కట్టడికి ప్రభుత్వపరంగా, తెలంగాణ నేతల పరంగా ఎలాంటి చర్యలూ లేవని ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం తక్షణం జోక్యం చేసుకొని దాడులను కట్టడి చేయాలని కోరారు. దాంతో దిగ్విజయ్ వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డిలతో ఫోన్ మాట్లాడారు. అందరితో మాట్లాడి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని వారాయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, జి.వి.హర్షకుమార్ తదితరులు కమిటీ ముందు గంటకు పైగా వాదనలు విన్పించారు. హైద్రాబాద్ లో చోటుచేసుకొంటున్న హింసాత్మక సంఘటనలు, అభద్రతా భావం నెలకొన్న సీమాంధ్ర ఉద్యోగులకు, ప్రజలకు రక్షణ క ల్పించేందుకు కేంద్రం తీసుకోవాల్సిన తక్షణ చర్యలపైనే కమిటీతో వారు మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణవాదులను అదుపు చేయలేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు మరింతగా విషమిస్తాయన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య ఇటీవల వరుసగా జరుగుతున్న ఘర్షణలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ‘‘రెండు రోజుల కింద ఎపీఎన్జీవో కార్యాయంలో తెలంగాణ ప్రాంత న్యాయవాదులు దాడికి ఇగారు. , సోమవారం జలసౌధ, దేవాదాయ శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులపై దాడులకు దిగారు. తెలంగాణ నేతలు, ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టజూస్తున్నారు. ఘర్షణ జరుగుతున్న చోట్లకు వెళ్లి ఉద్రిక్తత సృష్టిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న తలపెట్టిన బహిరంగ సభ విషయంలోనూ తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థుల ధోరణి పూర్తి రెచ్చగొట్టేలా ఉంది’’ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా తామెలాంటి మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని ఎంపీలు పునరుద్ఘాటించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కూడా వచ్చి పలు అంశాలపై వపర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉన్నా లోక్‌సభలో ఆహార భద్రతపై చర్చ, ఓటింగ్‌తో రాలేకపోయారు. మరోవైపు ఏపీ ఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు కూడా విభజనను వ్యతిరేకిస్తూ మంగళ, బుధవారాల్లో ఆంటోనీ కమిటీని, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలను ఢిల్లీలో కలవనున్నారు. దౌర్జన్యం చేస్తే ఫలితం అనుభవిస్తారు: ఉండవ ల్లి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశామని అనంతరం విలేకరులకు ఉండవల్లి వివరించారు. ‘హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై జరుగుతున్న దాడులను కమిటీకి వివరించాం. వారు స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. హైదరాబాద్‌లో తెలంగాణ వారికి నిరసన తెలిపే హక్కు ఎంతుందో, సీమాంధ్రులకూ అంతే ఉంది. రౌడీయిజం, గూండాగిరీ చేస్తామంటే రాజ్యాంగం దాని పని అది చేస్తుంది. సీమాంధ్రల ప్రదర్శనలను దౌర్జన్యం చేసి అపగలమనుకుంటే దాని దుష్ఫలితాలను అనుభవిస్తారు’’ అని హెచ్చరించారు. -
రాజధానిలో మళ్లీ పోటాపోటీ ఆందోళనలు
సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలతో సోమవారం రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలు దద్దరిల్లాయి. తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు సోమవారం మధ్యాహ్నం విద్యుత్‌సౌధకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావులను పోలీసులు గేట్ బయటే అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఒక్కసారిగా జెతైలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు కూడా జై సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో విద్యుత్ సౌధ మార్మోగింది. అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ బైఠాయించడంతో అట్టుడికిపోయింది. పరిస్థితి చేయిదాటిపోతుండడంతో పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. సీమాంధ్రులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణవాదులను అణచివేయాలని చూస్తున్నారని హరీశ్‌రావు పోలీసులపై మండిపడ్డారు. విద్యుత్‌సౌధలో సీమాంధ్ర ఉద్యోగుల దాడిలో గాయపడ్డ సంతోష్‌కుమార్ అనే ఉద్యోగిని పరామర్శించడానికి వస్తే లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆయన దుయ్యబట్టారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడిచేసిన వారిపై కేసులు పెట్టలేదు కానీ, ఉద్యోగులకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తారా? అని హరీష్‌రావు పోలీసులను నిలదీశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సమైక్యాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు సోమవారం ఏపీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు సత్యనారాయణ రావడం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ఉద్యోగులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. పోలీ సులు శాంతింపజేసేందుకు యత్నించినా వారు వినలేదు. దీంతో సత్యనారాయణను బయటకు తీసుకువెళ్లడంతో తెలంగాణ ఉద్యోగులు శాంతించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సమైక్యాంధ్ర ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి కృపావరం అధ్యక్షతన సీమాంధ్ర ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన, వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీఎన్జీవోస్ ఇచ్చిన పిలుపు మేరకు గన్‌ఫౌండ్రీలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కొనసాగింది.