సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని హైదరాబాద్‌లో వరుసగా సీమాంధ్ర ఉద్యోగులపై జరుగు తున్న దాడులను అరికట్టాలని ఆంటోనీ కమిటీని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కోరారు. తెలంగాణలోని సీమాంధ్రులకు ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని తెలంగాణ నేతలు చేస్తున్న ప్రకటనలు కేవలం మాటల్లోనే తప్ప చేతల్లో కన్పించడం లేదన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో సోమవారం రాత్రి వారు గంటకు పైగా భేటీ అయ్యారు. సమైక్యవాదంతో ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగులు నాలుగు రోజులుగా దాడులకు దిగుతున్నా వాటి కట్టడికి ప్రభుత్వపరంగా, తెలంగాణ నేతల పరంగా ఎలాంటి చర్యలూ లేవని ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం తక్షణం జోక్యం చేసుకొని దాడులను కట్టడి చేయాలని కోరారు. దాంతో దిగ్విజయ్ వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డిలతో ఫోన్ మాట్లాడారు. అందరితో మాట్లాడి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని వారాయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, జి.వి.హర్షకుమార్ తదితరులు కమిటీ ముందు గంటకు పైగా వాదనలు విన్పించారు. హైద్రాబాద్ లో చోటుచేసుకొంటున్న హింసాత్మక సంఘటనలు, అభద్రతా భావం నెలకొన్న సీమాంధ్ర ఉద్యోగులకు, ప్రజలకు రక్షణ క ల్పించేందుకు కేంద్రం తీసుకోవాల్సిన తక్షణ చర్యలపైనే కమిటీతో వారు మాట్లాడినట్టు సమాచారం.
తెలంగాణవాదులను అదుపు చేయలేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు మరింతగా విషమిస్తాయన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య ఇటీవల వరుసగా జరుగుతున్న ఘర్షణలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ‘‘రెండు రోజుల కింద ఎపీఎన్జీవో కార్యాయంలో తెలంగాణ ప్రాంత న్యాయవాదులు దాడికి ఇగారు. , సోమవారం జలసౌధ, దేవాదాయ శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులపై దాడులకు దిగారు. తెలంగాణ నేతలు, ముఖ్యంగా టీఆర్‌ఎస్ నేతలు ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టజూస్తున్నారు. ఘర్షణ జరుగుతున్న చోట్లకు వెళ్లి ఉద్రిక్తత సృష్టిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న తలపెట్టిన బహిరంగ సభ విషయంలోనూ తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థుల ధోరణి పూర్తి రెచ్చగొట్టేలా ఉంది’’ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా తామెలాంటి మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని ఎంపీలు పునరుద్ఘాటించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కూడా వచ్చి పలు అంశాలపై వపర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉన్నా లోక్‌సభలో ఆహార భద్రతపై చర్చ, ఓటింగ్‌తో రాలేకపోయారు. మరోవైపు ఏపీ ఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు కూడా విభజనను వ్యతిరేకిస్తూ మంగళ, బుధవారాల్లో ఆంటోనీ కమిటీని, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలను ఢిల్లీలో కలవనున్నారు.
దౌర్జన్యం చేస్తే ఫలితం అనుభవిస్తారు: ఉండవ ల్లి
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశామని అనంతరం విలేకరులకు ఉండవల్లి వివరించారు. ‘హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై జరుగుతున్న దాడులను కమిటీకి వివరించాం. వారు స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. హైదరాబాద్‌లో తెలంగాణ వారికి నిరసన తెలిపే హక్కు ఎంతుందో, సీమాంధ్రులకూ అంతే ఉంది. రౌడీయిజం, గూండాగిరీ చేస్తామంటే రాజ్యాంగం దాని పని అది చేస్తుంది. సీమాంధ్రల ప్రదర్శనలను దౌర్జన్యం చేసి అపగలమనుకుంటే దాని దుష్ఫలితాలను అనుభవిస్తారు’’ అని హెచ్చరించారు.
దాడులను అరికట్టండి
Published Tue, Aug 27 2013 3:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement