'ఓటమిపై ఆంటోనీ కమిటీకి నివేదిక ఇచ్చా'
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తాను ఇన్ఛార్జ్గా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆంటోనీ కమిటీకి నివేదిక ఇచ్చినట్లు ఆపార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దిగ్విజయ్ ఇన్ఛార్జ్గా వ్యవహరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై వేటు పడుతుందని దిగ్విజయ్ స్పష్టం చేశారు. కాగా దిగ్విజయ్ సింగ్ ఏ రాష్ట్రంలో కాలు పెడితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ఆపార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఈ కమిటీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి బతికించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా రఘువీరా ఇంతకు ముందే సోనియాకు నివేదిక ఇచ్చారు. దానిపై ఆంటోనీ కమిటీ ఇప్పుడు భేటీ అయ్యింది.