అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడిన దాఖలాలు లేవని యూత్ కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడిన దాఖలాలు లేవని యూత్ కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ ఏ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగింది, త్వరలోనే తదుపరి చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన జరుగుతుందన్నారు.
ఇదే కార్యక్రమంలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా ఓ స్పష్టత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి చవిచూడనున్న కాంగ్రెస్ కఠిన నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆంటోనీ కమిటీని వేసిందని ప్రభాకర్ విమర్శించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన యూపీఏ సమిష్టి నిర్ణయమన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమని ఆయన ఆరోపించారు. ఏపీఎన్జీవోలను కొంతమంది పెట్టుబడిదారులు పోషిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకే కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాజయ్య అన్నారు.