
జంగారెడ్డిపల్లె పోలింగ్ స్టేషన్ సెన్సిటివ్ ప్రాంతమని, తగిన భద్రత ఏర్పాటు చేయాలని ...
హైదరాబాద్: జంగా రెడ్డిపల్లె పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించడానికి వెళ్లినప్పుడు బీజేపీ కార్యకర్తలే తనపై దాడికి ప్రయత్నించారని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాక్షి మీడియాతో మాట్లాడారు. తాను అక్కడి నుంచి వాహనంలో బయలుదేరినా రాళ్లతో దాడి చేశారని వెల్లడించారు. వాళ్లు విసిరిన రాళ్లు తగిలడంతో తాను తీవ్రంగా గాయపడ్డానని, దీంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కై దాడికి పాల్పడ్డారని చెప్పారు.
జంగారెడ్డిపల్లె పోలింగ్ స్టేషన్ సెన్సిటివ్ ప్రాంతమని, తగిన భద్రత ఏర్పాటు చేయాలని తాను ముందే కోరినట్లు చెప్పారు. కానీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే తనపై దాడి జరిగిందన్నారు. ఆ సమయంలో భద్రతా వైఫల్యం కూడా తనకు స్పష్టంగా కనిపించిందని వివరించారు. తాను సానుభూతి కోసం పథకం రచిస్తే, బీజేపీ వాళ్లు ఎందుకు దాడి చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఏదిఏమైనా కల్వకుర్తి ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.