సాక్షి, మహబూబ్‌నగర్: ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో కులగణన.. వార్డుల పునర్విభజన పూర్తయిన నేపథ్యంలో ఆయా పురాల్లో పాగా వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి అదనంగా కొత్తగా కొలువుదీరిన మరో తొమ్మిది మున్సిపాలిటీల పీఠాల కైవసం కోసం అన్ని పార్టీలు పావులు కదుపుతున్నారు. గత ఎన్నికలకు ఈసారి జరగనున్న ఎన్నికలకు పాత మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెరగడం.. అదనంగా కొత్తగా మరో తొమ్మిది మున్సిపాలిటీలు కొలువుదీరడం అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, బాదేపల్లి, నారాయణపేట, గద్వాల, అయిజ, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ పాత మున్సిపాలిటీలు ఉన్నాయి. గతేడాది ఆగస్టు 2న కొత్తగా ఏర్పడిన అమరచింత, పెబ్బేరు, కోస్గి, మక్తల్, అలంపూర్, వడ్డేపల్లి, కొత్తకోట, ఆత్మకూరు, భూత్పూర్ మున్సిపాలిటీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా అచ్చంపేట మున్సిపాలిటీకి 2016 మార్చి 6న ఎన్నికలు జరగగా.. ఆ పాలకవర్గం పదవీ కాలం 2021 మార్చి వరకు ఉంది.
ఎదురులేని శక్తిగా టీఆర్‌ఎస్
గత ఆరు నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో గెలుపు ధీమా నింపుతున్నాయి. అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ.. ప్రాదేశిక ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక స్ధానాలు కైవలం చేసుకుని ఎదురులేని శక్తిగా అవతరించింది. ఇదే స్పూర్తితో ‘పుర’ ఫలితాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లందరూ అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పట్టణ ప్రజలూ మళ్లీ తమనే ఆశీర్వదిస్తారనే ధీమాతో నేతలున్నారు.
ప్రభుత్వ పథకాల ప్రచారంతో పాటు పట్టణ సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను ప్రధాన అజెండాగా చేసుకుని ప్రచారం చేయాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇదిలాఉండగా అధిష్టానం ఈసారి కొత్తగా ఏర్పడిన తొమ్మిది మున్సిపాలిటీల్లో గెలుపు బాధ్యతలు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకే అప్పగించింది. దీంతో వారు ఆయా పుర పీఠాల కైవసానికి యత్నాలు మొదలుపెట్టారు.
ఉనికి కోసం కాంగ్రెస్ పాకులాట
వరుస ఓటములతో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనైనా అత్యధిక స్ధానాలు గెలుచుకుని ఉనికి కాపాడుకునే యత్నం చేస్తోంది. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్‌లో విశ్వాసం నింపడం ద్వారా పని చేసేవారికే టిక్కెట్టు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు పార్టీని పట్టణాల్లో బలోపేతం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే సీనియర్లు పలువురు పార్టీని వీడి నాయకత్వలోపంతో ఉన్న ‘హస్తా’నికి చేయూతనిచ్చే వారు కరువయ్యారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేసిన మల్లు రవి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంశీచంద్‌రెడ్డి మాత్రం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలూ చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణులు పట్టణ ఓటర్లను మచ్చిక ఎలా చేసుకుంటారోననే చర్చ జరుగుతోంది.
బీజేపీలో బలమైన క్యాడర్
లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పటి సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి, డి.కె.అరుణలతో పాటు పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకోవడంతో బీజేపీ క్యాడర్‌లో గెలుపు ధీమా పెరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో కాస్త సత్తా చాటినా ప్రాదేశిక ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించని ఆ పార్టీ తమకు గ్రామాల కంటే పట్టణాల్లోనే బలమైన క్యాడర్ ఉందని భావిస్తోంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో ఈసారి గెలుపు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
మిగిలిన మున్సిపాలిటీల్లోనూ గెలుపును ప్రభావితం చేసే అంశాలపై ఆ పార్టీ నేతలు దృష్టి సారించారు. ఇక ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసిన డి.కె.అరుణ తన సొంత ఇలాకా గద్వాల మున్సిపాలిటీలో ఎలాంటి చక్రం తిప్పుతారు? అక్కడ బలమైన శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్‌ను ఎలా ఢీ కొంటారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంటు పరిధిలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆ మున్సిపాలిటీల్లో కాషాయ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుందో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment