తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో ప్రతిసారి ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది. ఆ సెగ్మెంట్లో అన్ని పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నువ్వా..నేనా అన్నట్టు సాగే అవకాశం ఉంది.
2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పాత టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆరోపణ ఉంది. నియోజకవర్గం కేంద్రంలోని మున్సిపాలిటీని సైతం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ చిట్టెం సోదరి డీకే అరుణ ప్రభావం ఉండటంతో ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయి. చిట్టెం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఒక్కటి కూడ నిర్మాణం చేయలేదు. సంగంబండ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.
నేరేడుగాం,ఉజ్జెల్లి,సంగంబండ పునరావాస గ్రామాల పరిస్దితి గురించి ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణ ఎమ్మెల్యే అండదండలతోనే చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.150 పడకల ఆస్పత్రి, హామీ ఇంకా నేరవేరలేదు ఇటీవల మంజూరీ వచ్చినా పనులు ప్రారంభించలేదనే మైనస్ ఉంది.రాజకీయాల్లో తన భార్య జోక్యం కొంత ఇబ్బందిగా మారవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం ఆసక్తి కనబరుస్తున్నారు. వర్కటం జగన్నాథం కరోనా సమయంలో అనేక సేవకార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య,పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్లు,పదవ తరగతి విద్యార్దులకు స్టడీమెటీరియల్ ఇప్పించారు.మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్రెడ్డి సైతం బీఆర్ఎస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
తనకే సీటువస్తుందనే ధీమాలు ఉన్నారు.అయితే సిట్టింగ్లకే సీట్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎమ్మెల్యే చిట్టెంకు ఊరటనిస్తుంది.ఇక్కడ సీటు విషయంలో పోటీ నెలకొనటం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. బీజేపీకి ఇక్కడ మొదట నుంచి మంచి క్యాడర్ ఉంది.మున్సిపల్ చైర్మన్ పీఠం కూడ ఆ పార్టీకే దక్కింది. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు ఎమ్మెల్యే వ్యవహారశైలి తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. డీకే అరుణ ప్రభావం కూడ ఇక్కడ ఉండే అవకాశం ఉండటంతో మరింత ప్లస్ కానుంది.అయితే ఇక్కడ కూడ మొదటి నుంచి పార్టీలో ఉండి రెండు సార్లు పోటీ చేసిన కొండయ్యకు,కొత్తగా పార్టీలో చేరిన జలంధర్రెడ్డికి మద్య పొసగటం లేదు.ప్రజాసంగ్రామయాత్రలో కూడ పోటాపోటీగా తమ బలప్రదర్శన చేశారు. జలంధర్రెడ్డి గత 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి రెండవ స్దానంలో నిలిచిచారు.
ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన తర్వాత జలంధర్‌రెడ్డి నియోజవర్గానికి చుట్టపుచూపుగా మారారు. సీటు విషయంలో కొండయ్య,జలంధర్రెడ్డి మద్య ఏకాభిప్రాయం కుదిరితే పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే అధికార బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందిగానే ఉంది. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరాక పార్టీకి సరైన నాయకత్వమే కరువయ్యింది. ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం ఇక్కడి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాం నింపింది. మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్రెడ్డి, నాగరాజు గౌడ్, ఎన్నారై పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డిలు సీటు కోసం ఆశిస్తున్నారు. వీరారెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అది దేవరకద్ర నియోజకవర్గంగా పునర్విభజనలో మారింది.
కానీ ఆత్మకూరు, నర్వ, అమరచింత మండలాలు ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో ఉండటంతో పాటు, రాహుల్ జోడో యాత్రలో కీలకంగా పనిచేయటం తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. బీసీ గౌడ్ సామాజికవర్గానికి చెందిన నాగరాజు గౌడ్ గతంలో ఎన్ఎస్యూఐలో పనిచేశాడు. రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న ఇతను రాహుల్ల్గాం గాంధీ జోడోయాత్రలో హుషారుగా పనిచేసి పార్టీ నేతల దృష్టిని ఆకర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సీటు రాకుంటే మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్రెడ్డి కూడ కాంగ్రేస్ లో చేరుతారనే ప్రచారం జోరుగాసాగుతుంది.కాంగ్రేస్ అభ్యర్ది అవుతారని ఆయన వర్గీయులు అంటున్నారు.2018లో మక్తల్లో టీడీపీ నుంచిపోటీ చేసిన సీతమ్మ భర్త దయాకర్రెడ్డి మూడోస్దానంలో నిలువగా 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై భరోసాపెట్టుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు:
ఆత్మకూర్ అమరచింత మండలాలు వనపర్తి జిల్లాలో, మదనాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలు దేవరకద్ర నియోజకవర్గములో, ధన్వాడ మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు నారాయణపేట నియోజకవర్గములో అనుసంధానమై ఉన్నాయి.ఈ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది.
నదులు: కృష్ణా, భీమా నదులు వర్షాకాలంలో పుష్కలంగా ప్రవహిస్తాయి రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది,చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది.
ఆలయాలు: కృష్ణానది తీరాన దత్తపీఠ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ముడుమాల నిలువు రాళ్లు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.కృష్ణాలో మొట్టమొదట రైల్వేస్టేషన్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment