పండుగరోజూ ఆగని పోరు
Published Wed, Sep 11 2013 4:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
సాక్షి నెట్‌వర్క్: గణేశ చతుర్ధి వేడుకల్లోనూ సమైక్యనినాదం మార్మోగుతోంది. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చూడాలంటూ ఆ దేవదేవుడికి సమైక్యవాదులు మంగళవారం పూజలు చేశారు. విభిన్నరూపాల్లో ఉద్యమాన్ని హోరెత్తించారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, మానవహారాలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు వరుసగా 42వరోజూ దద్దరిల్లాయి. విశాఖ జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర అక్షరాలతో కూడిన గణేశ్ ప్రతిమల్ని ప్రతిష్ఠించగా, మరికొన్ని చోట్ల వినాయకుడి బ్యాక్‌డ్రాప్‌లో సమైక్య రోడ్‌మ్యాప్‌ను డిజైన్ చేశారు. గాజువాకలో సమైక్యాంధ్ర బాలగణపతి పేరిట 77అడుగుల వినాయకుడ్ని ఏర్పాటు చేశారు.
కాగా, సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దిష్టిబొమ్మను ఏయూ మెయిన్ గేట్ వద్ద ఆ సమితి కార్యకర్తలే దహనం చేశారు.విజయనగరంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద నిర్వహించిన మాక్ కోర్డులో న్యాయమూర్తుల వేషధారణలో ఉన్న వ్యక్తులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్పునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని చర్చి సెంటర్‌లో నాయీ బ్రాహ్మణులు బాజాభజంత్రీలతో నిరసనకు దిగారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని తీర ప్రాంతవాసులు, షార్ కాంట్రాక్ట్ కార్మికులు సూళ్లూరుపేట-శ్రీహరికోట రోడ్డులో అటకానితిప్ప వద్ద షార్‌కు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. నెల్లూరులో నీటిపారుదల శాఖ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్‌లో సమైక్య శంఖారావం పేరుతో బలిజ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వేలాది మంది చేనేత కార్మికులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. పులివెందుల పట్టణంలో జీపుల ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదుల ఆధ్వర్యంలో రోడ్డుపై చాకిరేవు పెట్టి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో న్యాయవాదులు కోర్టు వద్ద యజ్ఞం చేశారు.
పుంగనూరులో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ వినాయకుని విగ్రహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తిరుపతిలో దీక్షాశిబిరాల్లో వినాయకుని విగ్రహాలు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ప్రార్థించారు. రాష్ట్ర విభజన ఆపాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, సోనియాలకు లక్ష ఉత్తరాలు రాసే బృహత్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో క్రైస్తవులు ఉదయం పది నుంచి సాయంత్రం వరకూ సమైక్య గీతాలు ఆలపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ‘అనంత’ అన్యాయమైపోతుందని అనంతపురం జిల్లా బుక్కపట్నంలో ఉపాధ్యాయులు ఉరితాళ్లు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లలో రైతులు ఎడ్లబండ్లతో ప్రదర్శన చేపట్టి రోడ్డుపై అరకలుదున్ని నిరసన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా జేఏసీ బుధవారం నుంచి 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
Advertisement