‘ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లలో కొన్ని లోపాలున్నాయి’ | Manda Krishna Meets CM Revanth Reddy On SC Reservation Classification | Sakshi
Sakshi News home page

‘ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లలో కొన్ని లోపాలున్నాయి’

Published Tue, Feb 11 2025 5:09 PM | Last Updated on Tue, Feb 11 2025 6:56 PM

Manda Krishna Meets CM Revanth Reddy On SC Reservation Classification

హైదరాబాద్‌:  ఎస్సీ వర్గీకరణ; రిజర్వేషన్లలో కొన్ని లోపాలున్నాయన్నారు  ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. దీనిలో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో సమావేశమైనట్లు మందకృష్ణ తెలిపారు. సీఎం రేవంత్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సబ్‌ కమిటీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కలిసినట్లు మీడియాకు తెలిపారు..

‘గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా  తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ లో తీర్మానం చేసిన సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు. వర్గీకరణను స్వాగతిస్తున్నాం...కానీ వర్గీకరణ, రిజర్వేషన్లలో కొన్ని లోపాలు ఉన్నాయి. వెనకబడిన కులాలను ఏ గ్రూప్ లో కలపాలి అనేదానిపై సీఎం రేవంత్‌తో చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఏ,బీ,సీలుగా వర్గీకరణ చేసింది. దీనివల్ల  కొన్ని కులాలకు అన్యాయం జరుగుతోంది.  

ఎస్సీలలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు.ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం ఆమోదించిన నివేదికలో లోపాలను సవరించి అన్ని కులాలకు న్యాయం చేయాలని కోరుతున్నాం.కొన్ని కులాలు జనాభా లేక పోయినా వారిని మొదటి గ్రూప్‌లో  ఒక శాతం రిజర్వేషన్ల ఇచ్చారు. వెనకబడిన మాదిగ కులానికి రిజర్వేషన్లు అన్యాయం జరిగింది.

ఎక్కువ జనాభా ఉన్న నేతకానీలను మాలలు ఉన్న సి గ్రూప్ లో వేయడంతో వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న మాదిగలే మాలలతోని తట్టుకోలేక పోయారు.  ఎక్కువ జనాభా ఉన్న బేడ బుడగ జంగాలను అత్యధికంగా వెనుకబడిన ‘ఏ’ గ్రూపులో వేశారు. అధిక జనాభా ఉన్న మాదిగలకు గ్రూప్ B లో 9 శాతం రిజర్వేషన్ల ఇచ్చారు. దాన్ని 11 శాతానికి పెంచాలని సీఎంను కోరాం.

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మాలలకు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించారు.గతంలో బి అండ్ సి గ్రూప్ లో ఉన్న మన్నే కొలుపులవాండ్లు పంబాడ, పంబాల, పంపండ  కులాలను  గ్రూప్ సి లో ఉంచాలి.ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీకి విజ్ఞప్తులు చెప్పాం. ఎస్సీ వర్గీకరణలో అన్ని కులాలకు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం.డిప్యూటీ సీఎం మల్లు భట్టి ివిక్రమార్కను కూడా కలుస్తాం’ అని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement