
మీట్ ది ప్రెస్‌లో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి మారుతోందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నాలుగున్నర నెలలు గడిచినా.. ఇప్పటికీ వర్గీకరణ జరగలేదని ఆవేదన వ్యకం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో మందకృష్ణతో సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఘాటుగా స్పందించారు. ‘వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన తర్వాత మొదటగా స్పందించిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి. వర్గీకరణ అమలులో తెలంగాణ మొదటి రాష్ట్రం అవుతుందని, గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పింది ఆయనే.
కానీ మాట మార్చి నియామకాలు చేపడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్–4 పూర్తి చేయడంతోపాటు వివిధ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. గ్రూప్–1,2,3 కూడా త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలతో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏదో ఒక రకమైన సాకుతో వర్గీకరణను ఆపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. సీఎం రేవంత్ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు, కుమారుడు ఈ ప్రక్రియను అడ్డుకోవాలని నిర్ణయించారు.
అందుకే అధిష్టానంపైన ఒత్తిడి చేసి వర్గీకరణకు బ్రేకులు వేస్తున్నారు. వర్గీకరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో ‘లక్ష డప్పులు, వేల గొంతుకలు’కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేవలం దళితులే కాకుండా అన్ని కులాలకు చెందినవారు ఈ కార్యక్రమానికి మద్దతుగా ఉన్నారు’అని చెప్పారు. వర్గీకరణ సాధించిన తర్వాత ప్రజాసమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తానని, ఏ పార్టీ జెండా వేసుకోనన్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలులో లోపాలున్నాయని, జనాభా కంటే రిజర్వేషన్లు ఎక్కువగా ఉండడం ఇతర వర్గాలకు నష్టం కలిగించడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అన్ని సమస్యలపైనా ఉద్యమాలు కొనసాగిస్తానన్నారు.