
మంద కృష్ణ మాదిగతో సీఎం రేవంత్
సమస్యలను మంత్రివర్గ ఉపసంఘం, కమిషన్‌కు వివరించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించి, మంత్రివర్గ ఉపసంఘం వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్‌లో చర్చించి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఎలాంటి న్యాయపర చిక్కులు రావని సీఎం తెలిపారు.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సీఎం చిత్తశుద్ధిని ఈ సందర్భంగా మంద కృష్ణ అభినందించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించగా, వాటిని మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌తో భేటీ
ఎస్సీ వర్గీకరణ ఉపసంఘం చైర్మన్, నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మందకృష్ణ మాదిగ సమావేశం అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సూచన మేరకు ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. మాదిగలకు 9 శాతం కాకుండా 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే వర్గీకరణలో మాదిగల్లోని కొన్ని ఉపకులాలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.