- సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ధర్నాలు, నినాదాలు
- నిరసన ప్రదర్శనలు ఎదురెదురుగా రావడంతో ఉద్రిక్తత
- బారికేడ్లు ఏర్పాటు చేసి ఇరు వర్గాలకు నచ్చజెప్పిన పోలీసు అధికారులు
- ఎస్పీఫ్ డీఐజీ ఏసురత్నం నేతృత్వంలో భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ధర్నాలతో శనివారం సచివాలయం దద్దరిల్లింది. గంటన్నరపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించాల్సి వచ్చింది. నెలరోజులుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, మూడు రోజులుగా సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నా ఎవరి మార్గంలో వారు వెళ్తుండటంతో అంతా సాఫీగా సాగుతూ వచ్చింది. శనివారం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పది అడుగుల దూరంలోనే ఎదురెదురుగా నిలబడి పోటాపోటీ నినాదాలు చేశారు. నార్త్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, ఎస్పీఎఫ్ డీఐజీ ఏసుదాసు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు వలయంగా ఏర్పడి ఇరు సంఘాల నేతలను ముందుకు రానీకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పోలీసు ఉన్నతాధికారుల చర్చల అనంతరం రెండు సంఘాల వారు వేర్వేరు మార్గాల్లో వెళ్లేందుకు అంగీకరించడంతో ఉత్కంఠకు తెరపడింది.వలయంగా ఏర్పడిన పోలీసులు: ప్రతిరోజులాగే శనివా రం మధ్యాహ్నం ‘కే’ బ్లాకు ఎదుట సచివాలయ తెలంగాణ ఉద్యోగులు, ఎల్ బ్లాకు ఎదుట సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా ప్రారంభించారు. కొద్దిసేపు తర్వాత తెలంగాణ ఉద్యోగులు అక్కడ్నుంచి జే బ్లాకు, ఎల్ బ్లాకు మధ్య రహదారి కూడలిలో ధర్నా చేపట్టారు. ‘ఎవడబ్బ సొత్తు - హైదరాబాద్ మాది’, సీఎం గో బ్యాక్... సీఎం డౌన్ డౌన్, హైదరాబాద్ యూటీ అంటే విశాఖ, తిరుపతిలనూ యూటీ చేయా లి’ అంటూ నినాదాలు చేశారు. నాలుగు రోడ్ల కూడలిలోనే కూర్చుని బతుకమ్మ పాటలు పాడుతూ నినాదాలు చేశారు. ‘ఎల్’ బ్లాకు ఎదుట ధర్నా అనంతరం సీమాంధ్ర ఉద్యోగులు రోజులాగే ప్రదర్శనగా వెళ్లేందుకు ముందుకు కదిలారు.
వా రు ముందుకు రాగానే తెలంగాణ ఉద్యోగులు కూడా వీరికి ఎదురుగా నాలుగడుగులు ముందుకు వచ్చారు. ఇరు సంఘా ల ప్రతినిధులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ఎవరినీ ముందుకు వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ముందు వైపు వలయం గా నిలబడ్డారు. తమకు దారి ఇస్తే ముందుకు వెళ్లిపోతామని సీమాంధ్ర ఉద్యోగులు పోలీసు అధికారులతో అన్నారు. ఈ విషయమై తెలంగాణ ఉద్యోగులతో పోలీసు అధికారులు మాట్లాడగా వారిని ఎల్ బ్లాక్ వెనుకనుంచి పంపించాలని, తాము ఈ మార్గంలో ‘సీ’ బ్లాక్ వైపు వెళ్తామని చెప్పారు. ‘‘మా ప్రదర్శన రోజూ వెళ్లే మార్గంలో రహదారిని బ్లాక్ చేసే లా తెలంగాణ ఉద్యోగుల ధర్నాకు ఎలా అనుమతించారు? వారిని పక్కకు పంపకుండా మమ్మల్ని వెనక్కు వెళ్లమనడం ఎలా న్యాయం? రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఇలా మమ్మ ల్ని అడ్డుకుంటుంటే రేపు తెలంగాణ వస్తే మా హక్కులకు రక్షణ ఎక్కడుంటుంది?’’ అని సీమాంధ్ర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ పోలీసు అధికారులు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు సాగించారు. చివరకు సీమాంధ్ర ఉద్యోగులు ఎల్ బ్లాకు నుంచి కే బ్లాకు, జే బ్లాకు మీదుగా ప్ర దర్శనగా వెళ్లడానికి అంగీకరించారు. వారు అలా వెళ్తే తాము నేరుగా వెళ్లిపోతామని తెలంగాణ ఉద్యోగులు అంగీకరించా రు. దీంతో పోలీసులు వారిని ఆయా మార్గాల్లో పంపించారు.
సంయమనం పాటిద్దాం...:‘‘తెలంగాణ ఉద్యోగులు మన కు చెల్లెళ్లు, తమ్ముళ్లు లాంటి వారే. వారు ఆవేశంలో మనల్ని తిట్టినా మనం సంయమనం కోల్పోవద్దు. కుటుంబ పెద్దగా మనం ఓపికతో సుదీర్ఘకాలం ఉద్యమం సాగించాల్సి ఉంది. తెలంగాణ వారు మనల్ని రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. మనం ఈ విషయాన్ని గుర్తించి ఇప్పటి వరకూ వ్యవహరించినట్లు శాంతియుతంగానే ఉండాలి. ఏమి జరిగినా ఆవేశానికి లోనుకావద్దు’’ అని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ ఉద్యోగులకు సూచించారు.
కొనసాగిన సమ్మెలు, ధర్నాలు..:సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు ప్రభుత్వ కార్యాలయాల్లో చేస్తున్న సమ్మె శనివారం కూడా కొనసాగింది. కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌లో ఏపీఎన్జీవో నగర నాయకులు నరసింహం ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అలాగే అబిడ్స్ తిలక్ రోడ్డులోని బీమా భవన్, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోల ధర్నాలు కొనసాగాయి.