‘విభజన’ సమస్యలు వినేందుకే ఉన్నాం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన నిర్ణయానంతరం హైద్రాబాద్‌లో చోటుచేసుకొంటున్న సంఘటనలు దురదష్టకరమైనవని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో, బహిరంగ ప్రదేశాల్లో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పారు. దీనిపై తానిప్పటికే కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదరలతో మాట్లాడానని చెప్పారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకుండా సంయమనం పాటించాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో భేటీ అనంతరం దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు ఆంటోనీ కమిటీ ప్రయత్నిస్తోందని చెప్పారు.
విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నందున సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను విరమించుకోవాలని కోరారు. విభజన అనంతర సమస్యలు వినేందుకే ఆంటోనీ కమిటీ ఉందని, సమస్యలను దానికి చెప్పుకోవాలని సూచించారు. సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని, కమిటీతో చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. విభజన బిల్లు, తీర్మానాల్లో పొందుపరచాల్సిన అంశాలు తదితరాలను తమకు చెప్పాలన్నారు.