‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగ, న్యాయ పరిధికి లోబడే ఉంటుంది... కొంత కాలం ఉమ్మడి రాజధాని చేయవచ్చనే వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన అన్ని అంశాలపై జీవోఎం కసరత్తు బుధవారం పూర్తవుతుందని.. త్వరలోనే అసెంబ్లీకి విభజన బిల్లును పంపటంతో పాటు శీతాకాల సమావేశాల్లోనే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెకమాండ్‌ను ధిక్కరిస్తున్నారనే వాదనను దిగ్విజయ్ నవ్వుతూ కొట్టిపారేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పార్టీకి విబేధాల్లేవు. ఆయన కాంగ్రెస్‌కు విధేయుడు. విభజన విషయంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తున్నారు. ఈ విషయంలో తన అభిప్రాయం చెప్తున్నారే తప్ప అధిష్టానాన్ని ధిక్కరించటం లేదు’’ అని పేర్కొన్నారు. విభజనపై ఆంటోనీ కమిటీ నివేదిక గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆ కమిటీ సోనియాగాంధీ ఏర్పాటు చేసినదే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.