మా చేతిలో లేదు | No Rethinking on Telangana: Digvijay Singh | Sakshi
Sakshi News home page

మా చేతిలో లేదు

Published Wed, Aug 21 2013 1:50 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

మీడియాతో మాట్లాడుతున్న దిగ్విజయ్‌సింగ్. చిత్రంలో సీమాంధ్ర నేతలు - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న దిగ్విజయ్‌సింగ్. చిత్రంలో సీమాంధ్ర నేతలు

విభజనపై పునఃపరిశీలన మా పరిధిలోకి రాదు
సీఎం, సీమాంధ్ర నేతలకు ఆంటోనీ కమిటీ స్పష్టీకరణ
విభజనలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు సూచించడమే మా పని
సీఎం, సీమాంధ్ర బృందంతో విడిగా భేటీ
విభజన తదనంతర పరిణామాలపై కమిటీకి రెండు నివేదికలిచ్చిన కిరణ్
రాష్ట్రాన్ని విడదీస్తే ప్రమాదకరమేనన్న సీమాంధ్ర నేతలు
రెండో ఎస్సార్సీ వేసి అందరికీ న్యాయం చేయాలని వినతి
రాయల తెలంగాణకు జేసీ బృందం విజ్ఞప్తి
26 నుంచి 3 రోజులు భేటీలు: దిగ్విజయ్
 
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల బృందానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. విభజన నిర్ణయం అమలులో ఎదురుకాగల సమస్యలను పరిశీలించి వాటికి తగిన పరిష్కారమార్గాలను సూచించటమే తమ కర్తవ్యమని కమిటీ స్పష్టంచేసినట్లు తెలిసింది. సీఎం కిరణ్, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మంగళవారం రాత్రి ఢిల్లీలో ఆంటోని కమిటీతో విడివిడిగా భేటీ అయ్యారు.

విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను వివరిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. అయితే.. విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అంశం తమ అజెండాలో లేదని స్పష్టంచేసిన కమిటీ సభ్యులు.. రాష్ట్ర విభజన అమలులో ఎదురుకాగల సమస్యలు, వాటికి పరిష్కారాలను సూచించాల్సిందిగా వారికి నిర్దేశించినట్లు చెప్తున్నారు.

ఈ భేటీ అనంతరం కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నేతల అభిప్రాయాలను, ఆందోళనలను కమిటీ తెలుసుకొందని, సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించామని చెప్పారు. పరిపాలనా పరంగా సీఎం, మంత్రులు ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఉవ్వెత్తున సాగిన ఉద్యమాలను చూశామని, పరిస్థితులు క్రమంగా చక్కబడతాయన్న ధీమా వ్యక్తం చేశారు. ఆంటోని కమిటీ  26-28 తేదీల్లో మూడు రోజుల పాటు సమావేశమై మరికొంత మంది పార్టీ నాయకుల, ఇతరుల అభిప్రాయాలను సేకరిస్తుందని దిగ్విజయ్ చెప్పారు.

ఇదిలావుంటే.. ఆంటోని కమిటీతో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల బృందం భేటీ ముగిసిన తర్వాత.. జె.సి.దివాకర్‌రెడ్డి, మధుసూదన్‌గుప్తా, తిప్పేస్వామి ముగ్గురూ విడిగా వెళ్లి కమిటీ సభ్యులను కలిశారు. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని వారు కోరినట్లు  చెప్తున్నారు.

కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతుంది...
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంపై మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం ముందుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో అరగంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఆంటోనీ కమిటీ సభ్యులతో ముందుగా సీఎం సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీతో పాటు సభ్యులు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్ పటేల్‌లు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనతో ఉత్పన్నమయ్యే పలు కీలక సమస్యలను వివరిస్తూ సీఎం రెండు నివేదికలను కమిటీ సభ్యులకు సమర్పించినట్లు తెలిసింది. రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని వాదించినట్లు సమాచారం. రాజధాని నగరం కావటంతో దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతమైనందున.. విభజనానంతరం చాలా కాలం పాటు సీమాంధ్ర రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోలేని దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం పేర్కొనట్లు తెలిసింది.

హైదరాబాద్ నగరం నుండే రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45 శాతం లభిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం కూడా పలు ఇతర అంశాలలో నష్టపోయే అవకాశం ఉందని ఆయన వాదించినట్లు చెప్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపిణీ పలు చిక్కుముడులతో కూడుకొని ఉన్న అంశం కావడంతో భవిష్యత్తులో మరిన్ని వివాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పినట్లు సమాచారం. సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం భారీగా ఆర్థిక సహాయాన్ని అందించగలుగుతుందా అన్న సందేహాన్ని కూడా ముఖ్యమంత్రి లేవనెత్తినట్లు చెప్తున్నారు.

రెండో ఎస్సార్సీ వేయాలి...
అనంతరం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కమిటీతో భేటీ అయినపుడు.. దిగ్విజయ్ మాట్లాడుతూ విభజన నిర్ణయం ఏ పరిస్థితుల్లో తీసుకున్నామో వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 2001లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ద్వారా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నోట్ అందిందని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని అమలు చేయటానికి వీలుగా సూచనలు, పరిష్కారాలు సూచించాలని ఆయన చెప్పినట్లు తెలిసింది.

తొలుత మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తున్నారని.. దాని వెనుక ఎవరి ప్రోద్బలమూ లేదని పేర్కొన్నట్లు తెలిసింది. విభజన రెండు ప్రాంతాల ప్రగతి మీదే కాకుండా, దేశ ప్రగతి మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా సమావేశమై రెండుసార్లు తీర్మానాలు చేశామంటూ ఆ తీర్మాన పత్రాలను కమిటీకి అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆ తర్వాత మరో మంత్రి గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు కోస్తాంధ్ర, రాయలసీమగా చెప్తున్న ప్రాంతాలు కూడా ఒకప్పుడు నిజాం సంస్థానంలోనివేనని.. ఆ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించిన నిజాం అక్కడి నుంచి వచ్చిన డబ్బులతోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని పేర్కొన్నట్లు తెలిసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూడు ప్రాంతాల ప్రజల ఉమ్మడి కృషితో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆయన వాదించినట్లు పార్టీ వర్గాలు వివరించాయి. అలాగే.. రెండు ప్రాంతాలు కలిసి ఉంటేనే కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందని ఆయన వాదించారు.

ఇప్పుడు విభజనతో నదీ జలాల విషయంలో భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిణామాలు సంభవిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిసింది. 1969, 1972 ల్లో తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చినప్పటికీ.. రాష్ట్ర అభివృద్ధి, దేశ సమగ్రత దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం, ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ విభజనకు తిరస్కరించారని ఆయన వివరించినట్లు సమాచారం. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర విభజన నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంటులో కూడా చర్చించలేదని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం.

ఆ నివేదికలో అత్యుత్తమ మార్గంగా రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని ఆరో ప్రత్యామ్నాయంలో పేర్కొన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసినట్లు తెలిసింది. అందరికీ న్యాయం చేసేందుకు 2001లో సీడబ్ల్యూసీ తీర్మానం చేసినట్లు రెండో ఎస్సార్సీ వేయాలని.. ఒక్క తెలంగాణ విషయంలోనే కాక మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక డిమాండ్లపై రెండో ఎస్సార్సీ ఎలా చెప్తే అలా చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. సి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా జలాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయని.. లక్షలాది ఎకరాల సాగుభూమి ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిసింది.

రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విడదీయలేని అనుబంధముందని.. రాత్రికి రాత్రే హైదరాబాద్ సీమాంధ్రులది కాదన్న ప్రకటన చూసి వారంతా నిశ్చేష్టులైపోయారని పేర్కొన్నట్లు సమాచారం. సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని ఎంతగానో ఆదరించే సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అంతే దారుణంగా మారిందని.. ఇది చేజేతులా చేసుకున్నదేనని వివరించినట్లు తెలిసింది.
 
సమైక్యంగానే ఉంచాలని కోరాం: మంత్రులు
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల ప్రజానీకం కూడా గట్టిగా కోరుకొంటున్న విషయాన్ని ఆంటోని కమిటీ దృష్టికి తీసుకెళ్లామని, విభజనతో ఏ సమస్యా పరిష్కారం కాకపోగా మరిన్ని కొత్త, తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమౌతాయని స్పష్టం చేశామని కమిటీతో చర్చల అనంతరం శైలజానాథ్ మీడియాకు తెలిపారు.

రాష్ట్రాన్ని విడగొడితే మావోయిస్టు తీవ్రవాదుల ప్రాబల్యం పెరగడంతో పాటు మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదంతో జతకలిస్తే ఊహించలేని విపత్కర పరిణామాలు నెలకొంటాయని కమిటీకి చెప్పినట్లు సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మూడున్నరేళ్ల క్రితం ప్రభుత్వపరంగా చేసిన ప్రకటనను ఇప్పటికే వెనక్కు తీసుకొన్నందున ప్రస్తుతం తాజాగా పార్టీ పరంగా తీసుకొన్న విభజన నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కోరామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారటం ఖాయమన్న మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తమ ప్రాంత సమస్యలను ఎలా పరిష్కరించదలిచారో వెల్లడించాలని కమిటీని కోరినట్లు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement