వైఎస్ 1999 లోనే రాష్ట్ర విభజనకు చొరవ చూపారు
సీఎం కిరణ్ ‘సమస్యలు’ చెప్పారంతే.. ధిక్కారం కాదు
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోలేదని.. రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. విభజనతో ముప్పు ఉందని ఏ ఒక్కరూ భావించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో సీమాంధ్ర ప్రజల ఆందోళనలన్నిటినీ పరిశీలించేందుకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని నేతృత్వంలోని కమిటీ మంగళవారం నుంచి పని చేస్తుందని చెప్పారు. విభజనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌జీవోలు, విద్యార్థులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దిగ్విజయ్ శనివారం రాత్రి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. అందరినీ సంప్రందించి, అన్ని పార్టీలతో విస్తృత సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం వచ్చాకే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, యూపీఏ నిర్ణయం తీసుకున్నాయని పేర్కొన్నారు. దానికి కట్టుబడే ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు. విభజన ప్రక్రియ ఆగిందన్న ప్రచారం జరుగుతోంది అని విలేకరులు ప్రస్తావించగా.. ‘‘విభజన ప్రక్రియ ఆగలేదు. ప్రక్రియ కొనసాగుతోంది. అధిష్టానం ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీ మంగళవారం సాయంత్రం నుంచి తన పని ప్రారంభిస్తుంది. అందరి వాదనలు వింటుంది’’ అని బదులిచ్చారు.
రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తున్నాం...
అన్ని పార్టీలతో మాట్లాడి, అందరినీ సంప్రదించాకే విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్‌జీవోలు అర్ధం చేసుకోవాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సైతం సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాల విషయాన్ని గుర్తించి, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెను విరమించుకోండి. అన్ని అంశాలను, అన్ని సమస్యలను పరిశీలించేందుకు ఆంటోనీ కమిటీ ఉంది. మీ అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని, రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. రాష్ట్ర విభజనతో ముప్పుందని ఎవరూ భావించాల్సిన అవసరం లేదు. మూడు ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనమంతా కలిసి పనిచేయాలని కోరుతున్నా. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి న్యాయం జరుగుతుంది’’ అని చెప్పారు. ‘‘అన్ని ప్రాంతాల విద్యార్థులు ఢిల్లీలో చదువుతున్నారు. అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల వారు హైదరాబాద్, ముంబైలలో చదువుతున్నారు. భారత్ వంటి ప్రజాస్వామిక దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కుంది.. ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు లేఖ ఇచ్చారు
‘ఆంటోని కమిటీ కేవలం పార్టీ కమిటీయే.. ప్రభుత్వ కమిటీ కాదని చంద్రబాబు అంటున్నారు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట తప్పినట్లుగా తమ పార్టీ మాట తప్పబోదని దిగ్విజయ్ స్పందించా రు. ‘‘తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ చంద్రబాబు లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటపై వెనక్కి వెళ్లారు. మేము మాత్రం మాట తప్పం’’ అని స్పష్టంచేశారు. తెలంగాణ పక్రియపై ఓ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ బాధ్యత కేంద్రానిదే. విభజన ప్రక్రియ కొనసాగుతుంది’’ అని ఉద్ఘాటించారు. ‘తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అటు ప్రభుత్వం, ఇటు ఆంటోని కమిటీ రెండు ఒకదానితో ఒకటి కలిసి సాగుతాయా?’ అని ప్రశ్నించగా.. ‘‘అలాంటి ప్రశ్నే తలెత్తదు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. యూపీఏ ప్రభుత్వం ఏకగ్రీవంగా తెలంగాణపై వైఖరి చెప్పింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అనేది కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంది’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు.
నాడు వైఎస్ చొరవ చూపారు...
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మలు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘1999లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేతగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజనకు చొరవ చూపారు. 2004లో పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వైఎస్ భాగస్వామిగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయంలోనూ భాగస్వామిగా ఉన్నారు. అసెంబ్లీ ఫ్లోర్ తీర్మానంలోనూ ఆయన భాగస్వామి. తెలంగాణపై కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో దానికి.. కొత్తగా ఎంపికైన ఫ్లోర్ లీడర్‌గా వైఎస్ ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నారు. వైఎస్ ఉన్నతికి కాంగ్రెస్ అన్ని విధాలా సాయపడింది. ఆయనొక డైనమిక్ లీడర్ అయ్యారు. అయితే దేశం ఓ డైనమిక్ లీడర్‌ను కోల్పోయింది. ఎవరైతే తెలంగాణ అంశానికి పరిష్కారం కావాలని ప్రయత్నించారో, ఆ ప్రయత్నంలో భాగంగానే విభజన జరిగింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు గమనించాలి’’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.
సీఎం కిరణ్‌పై చర్యలుండవ్...
‘రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు కదా?’ అన్న ప్రశ్నకు.. ఆయన ఎక్కడా ధిక్కార ధోరణితో మాట్లాడలేదని దిగ్విజయ్‌సింగ్ బదులిచ్చారు. విభజనతో తలెత్తే సమస్యలను సీఎం ప్రస్తావించారని.. వాటిపై ఆయనతో మాట్లాడానని, ఆయన వివరణ సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు. ముఖ్యమంత్రి పత్రికా సమావేశం నేను చూశాను. విభజనతో ఎలాంటి సమస్యలు వస్తాయో మాత్రమే ఆయన చెప్పారు. సీఎం తన తార్కిక వైఖరిని చెప్పారు. దీనిపై ఆయన్నుంచి ఎలాంటి వివరణలు కోరము. ఆయనపై ఎలాంటి చర్యలు ఉండవు’’ అని స్పష్టంచేశారు.