‘మా ఎంపీ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కనిపించడం లేదు..అదృశ్యమైంది’ అంటూ చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో పురోహితుడు రామాంజనేయ శాస్త్రి ఫిర్యాదు చేశారు.
చీరాల, న్యూస్‌లైన్: ‘మా ఎంపీ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కనిపించడం లేదు..అదృశ్యమైంది’ అంటూ చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో పురోహితుడు రామాంజనేయ శాస్త్రి ఫిర్యాదు చేశారు. పనబాక లక్ష్మి కనిపించడం లేదని ప్లకార్డులతో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమైక్యవాదులు నిరసన ర్యాలీలు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు, జేఏసీ నాయకులు ఆమె దిష్టిబొమ్మను దహనం చేసి దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటి నుంచి 45 రోజులుగా అన్ని వర్గాల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఉద్యమబాట పట్టినా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఓట్లేసి పదవులు కట్టబెట్టిన ప్రజలను కనీసం శాంతింపజేసే ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గతంలో ఏవైనా సభలు, సదస్సులకు అప్పుడప్పుడూ వచ్చి మొఖం చూపించి వెళ్లేవారు. ప్రస్తుతం ప్రజల నుంచి నిరసన జ్వాలలు ఎగిసిపడుతుండటంతో నియోజకవర్గ ఛాయలకు కూడా ఆమె రావడం మానేశారు. ఢిల్లీలో కూర్చొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజనకు ఆమె సహకారం కూడా...
రాష్ట్ర విభజన జరుగుతుందని కేంద్ర మంత్రులందరికీ ముందే తెలుసునని సుస్పష్టమైంది. కేంద్ర మంత్రులు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని కలిసినప్పుడు ఆమె పనబాక లక్ష్మిని ఉద్దేశించి ‘మీకు ఎప్పుడో చెప్పాను కదా.. రాష్ట్ర విభజన జరుగుతుందని. అప్పుడు మౌనంగా ఉండి మరలా ఇప్పుడు మాట్లాడటం ఏమిటి’ అని సోనియా అన్నట్లు ప్రచారం జరిగింది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని పనబాకకు ముందే తెలిసినా ఆమె కేవలం పదవి కోసం మిన్నకుండిపోయి విభజనకు సహకరించారని ప్రజలు విమర్శిస్తున్నారు.
రాజ్యసభ వైపు చూపు...
బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గుంటూరు జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పనబాక ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆమె నియోజకవర్గాభివృద్ధికి పాటుపడింది నామమాత్రమే. పార్టీలో ఉన్న క్యాడరే ఆమెకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రకటన వెలువడటం, ఆమె కేంద్ర మంత్రి పదవికి కానీ, ఎంపీ పదవికి కానీ రాజీనామా చేయకపోవడం, పెపైచ్చు అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమని తేల్చి చెప్పడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలానే ఐదు రోజుల క్రితం ఢిల్లీలో బొత్స సత్యనారాయణ... ఎంపీ రాయపాటి సాంబశివరావునుద్దేశించి పార్టీ ఎప్పుడు పెడుతున్నారని అడగ్గా ఆయన ‘మా పార్టీ కన్వీనర్ ఆమే’నంటూ పనబాక లక్ష్మిని ఉద్దేశించి అన్నారు. ఆమె మాత్రం నేను ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. దీన్నిబట్టి సీమాంధ్ర ప్రజలపై ఆమెకున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే ఆమె అనుచరులు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాజయం ఎదురవుతుందని, మేడం ఆశీస్సులు మెండుగా ఉండటంతో రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో పనబాక ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.