మాజీ మంత్రి పీతల సుజాతకు సీటు ఇవ్వకపోగా అవమానం
ఓడిపోయే తిరుపతి ఉప ఎన్నికలో పనబాకను పోటీ చేయించిన బాబు
ఈ ఎన్నికల్లో ఎంపీ సీటు, ఆమె భర్తకు ఎమ్మెల్యే సీటిస్తానని హామీ
ఎన్నికలు వచ్చేసరికి ఒక్క సీటూ ఇవ్వకుండా మోసం
మాజీ స్పీకర్ ప్రతిభా భారతికీ మొండిచేయి
మహానాడులో తొడగొట్టిన ఆమె కుమార్తె గ్రీష్మకు సీటు నిరాకరణ
ఆది నుంచి అండగా ఉన్న గుండా లక్ష్మీదేవికీ నో టికెట్టు
గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలకూ టికెట్లు లేవు
ఫిరాయింపు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మొండిచేయి
సాక్షి, అమరావతి : చంద్రబాబు అంటేనే మోసం అన్న విషయం తెలుగుదేశం పార్టీలోని మహిళా నేతలకూ అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహిస్తానని, వారి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందంటూ చంద్రబాబు చెప్పే మాటలన్నీ వంచనపూరితమేనని స్పష్టమైంది. టీడీపీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు మహిళలకు ఆయన అవమానకర రీతిలో సీట్లు నిరాకరించారు.
గత టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతను అవమానకర రీతిలో పక్కన పెట్టారు. పార్టీ కోసం ఆమె సేవలను ఉపయోగించుకుని చింతలపూడి సీటు ఇవ్వకపోగా, ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ అవమానించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు వంటి నేతల అహంకారానికి దళిత మహిళనైన తాను బలైనట్లు ఆమె వాపోతున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోలేదనే కారణంతోనే చంద్రబా బు సీటు తిరస్కరించారన్న వాదన పార్టీలో ఉంది.
పనబాకను మోసం చేసిన బాబు
టీడీపీలో మరో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి చంద్రబాబు మొండిచేయి చూపారు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెను తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయించారు. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు మాట విని పార్టీ కోసం ఓటమికి సిద్ధమయ్యే పోటీకి దిగారు. వాస్తవంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రాలేదు.
ఉప ఎన్నికలో పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటుతోపాటు ఆమె భర్త కృష్ణయ్యకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తానని చంద్రబాబు మభ్యపెట్టి పనబాకను పోటీకి దింపారు. అసలు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఆమెను వంచించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా పక్కనపెట్టేశారు. బాపట్ల, తిరుపతి ఎంపీ స్థానాల్లో ఏదో ఒక చోట అవకాశమివ్వాలని కోరినా పట్టించుకోలేదు. కష్టకాలంలో పార్టీ వెంట నిలబడ్డ తనను చంద్రబాబు మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిభా భారతికి మొండిచేయి
టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికీ బాబు సీటు నిరాకరించారు. ఆమె తన కుమార్తె గ్రీష్మకు శ్రీకాకుళం జిల్లా రాజాం సీటు ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. గ్రీష్మ టీడీపీ మహానాడులో తొడకొట్టి మరీ వైఎస్సార్‌సీపీ నేతలపై విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అలాంటి నేతలకు పార్టీలో అవకాశాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
కానీ చివరికి రాజాం సీటును కొండ్రు మురళీమోహన్‌కి ఇచ్చారు. తన తండ్రి హయాం నుంచి టీడీపీని నమ్ముకున్న ఆమె కుటుంబానికి టీడీపీలో న్యాయం జరగలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. శ్రీకాకుళంలోనూ ఆది నుంచి పార్టీకి దన్నుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్థానంలో ధనబలం ఉన్న గొండు శంకర్‌కు సీటిచ్చారు.
అప్పుడు మభ్యపెట్టారు.. ఇప్పుడు మోసగించారు
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పాడేరు, రంపచోడవరం, పామర్రు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలను మభ్యపెట్టి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆ ముగ్గురూ ఓడిపోయినా నియోజకవర్గాల్లో తిరుగుతూ పనిచేశారు. కానీ సమీకరణలు, ధన బలం లేదనే కారణంతో ఈ ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వకుండా అవమానించారు.
చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకుని ఇప్పుడు సీటు లేకుండా చేశారు. చంద్రబాబు మోసం చేశారనే ఉద్ధేశంతో రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు ఇప్పుడు అర్థమైందంటూ ఆమె ఎక్స్(ట్విటర్)లో వాపోయారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఈసారి సీటు లేకుండా చేశారు. భవానీ బదులు ఆమె భర్తకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మకు కూడా హ్యాండిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment