కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కకుండా బాబు పావులు
బీజేపీకి ఇచ్చిన సీట్లలో టీడీపీ నేతలు పోటీకి ఏర్పాట్లు.. దాదాపు అన్ని సీట్లు బీజేపీలోని తన అనుంగులకే దక్కేలా వ్యూహం
సహకరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి!.. ఎక్కడ కుదిరితే అక్కడ పోటీకి సిద్ధమవుతున్న బాబు మనుషులు
రాయలసీమ నాయకులకు ఉత్తరాంధ్రలో సీట్లు
పురందేశ్వరి సహా పలువురు జిల్లాల సరిహద్దులు దాటి పోటీకి యత్నాలు
బాబు ఆటలో జీవీఎల్, సోము వీర్రాజుకు కూడా దక్కని టికెట్లు
తీవ్ర ఆవేదనలో అసలైన బీజేపీ నాయకులు
సాక్షి, అమరావతి : అందరూ ఊహించినట్లుగానే కూటమి పేరుతో చంద్రబాబు అల్లిన సాలెగూటిలో బీజేపీ చిక్కుకుంది. పదేళ్లుగా ఎదురులేకుండా దేశాన్ని ఏలుతున్న బీజేపీ.. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు మాయోపాయంలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. బీజేపీకి రాష్ట్రంలో 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారన్న మాటే కానీ, ఆ స్థానాలేమిటో ఇప్పటికీ ఖరారు కాలేదు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చే సీట్లన్నింటిలో తన మనుషులే ఉండేలా చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారు.
దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న అసలైన బీజేపీ నాయకులకు సీట్లు దక్కే అవకాశం కనిపించడంలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన అయిన పురందేశ్వరి కూడా సహకరిస్తుండటంతో బాబు నేతలకే సీట్లు ఇస్తున్నారని, అభ్యర్థుల ప్రకటనే మిగిలి ఉందని అసలైన బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలు, ప్రాంతాలను కూడా మార్చేసి చంద్రబాబు తన మనుషులను బీజేపీ టికెట్లపై రంగంలోకి దింపుతున్నారు.
బాబు ముందస్తు వ్యూహం
బీజేపీని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చంద్రబాబు గత దశాబ్దకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన వాళ్లు అనుకొన్న వారిని ఆ పార్టీలోకి పంపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం మరికొందరు అనుంగులను బీజేపీలోకి పంపి, కోవర్టు రాజకీయాలు నడిపించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరగానే తన సొంత నాయకులకే ఆ పార్టీ సీట్లు ఇప్పించుకొంటున్నారు. ఈ నాయకులు ప్రాంతం, జిల్లా కూడా చూడకుండా ఎక్కడ వీలైతే అక్కడ వాలిపోతున్నారు.
చంద్రబాబు అనుంగు సీఎం రమేష్ ఏకంగా కడప జిల్లా నుంచి ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయనకు ఈ సీటు దాదాపు ఖరారు అయినట్టేనని కమలం పార్టీలో చర్చ సాగుతుంది. పొత్తు ఖరారు కాకముందు బీజేపీ ఒంటరిగా పోటీగా చేసేందుకు సిద్ధమైన సమయంలో అనకాపల్లి లోక్‌సభ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన్ని కాదని రమే‹Ùకే ఇప్పుడు టికెట్టు ఇస్తున్నారు.
జీవీఎల్‌కు సీటు దక్కకుండా..
విశాఖపట్నం బీజేపీకి రాష్ట్రంలోనే అత్యంత బలమైన ప్రాంతం. బీజేపీ బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల వారు విశాఖ పరిధిలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. విశాఖ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలన్న సంకల్పంతో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రెండేళ్లకు పైగా అక్కడే ఉంటూ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే, జీవీఎల్‌కు ఆ సీటు దక్కకుండా చంద్రబాబు, పురందేశ్వరి వ్యూహాత్మకంగా పక్కనే ఉన్న అనకాపల్లి స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న విమర్శలూ ఉన్నాయి.
సోము వీర్రాజు సీటుకే ఎసరు పెట్టిన పురందేశ్వరి
రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకే పురందేశ్వరి ఎసరు పెట్టారు. రాజమండ్రి వీర్రాజు సొంత నియోజకవర్గం. తొలి నుంచి బీజేపీలో ఉన్న నేత. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి వీర్రాజు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ చంద్రబాబు అండతో పురందేశ్వరి పోటీకి దిగుతున్నట్లు సమాచారం. ఒంగోలుకు చెందిన పురందేశ్వరి 2014 ఎన్నికలకు ముందు వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు. ఆమె మధ్యలో ఏడెనిమిది లోక్‌సభ స్థానాలు దాటుకొని రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.
ఇక్కడ ఆమెకు టికెట్ ఖరారైనట్టేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పోటీ చేసే మరో లోక్‌సభ స్థానం అరకు. ఇక్కడా మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరిన కొత్తపల్లి గీతకు టికెట్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానంలోనూ వైఎస్సార్‌సీపీ తరపున గెలిచి, చంద్రబాబుకు కీలుబొమ్మగా మారిన రఘురామకృష్ణరాజును బీజేపీలో చేర్పించి, ఆయనకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే రాజకీయం
టీడీపీతో పొత్తు లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీకి కూడా నిరాకరించిన కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ పొత్తు కుదరగానే కైకలూరు అసెంబ్లీ నుంచి కమలం గుర్తుపైనే పోటీకి సిద్ధపడుతూ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కామినేని శ్రీనివాస్ కూడా బాబుకు దగ్గరైన నాయకుడే. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ ఆ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిపోయారు. ఆయన కోసమే జమ్మలమడుగు స్థానాన్ని బాబు బీజేపీకి కేటాయిస్తున్నట్లు సమాచారం.
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి ఆ ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీలో చేరారు. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందు ఆయన మళ్లీ ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు సూరి కోసం ధర్మవరం సీటును బీజేపీకి చంద్రబాబు కేటాయిస్తున్నట్లు సమాచారం.
బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళా నేతకు బద్వేలు అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం బద్వేలును బీజేపీకి కేటాయించారు. సీఎం రమేష్ సూచించిన అభ్యర్థితో సహా బద్వేలు సీటు కోసం పురందేశ్వరి ప్రతిపాదించిన ముగ్గురు ఇప్పటికీ బీజేపీలో చేరలేదు. ఆమె ప్రతిపాదించిన వారిలో ఒకరికి అవకాశం ఇస్తే.. వారు పార్టీలో చేరి, పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా బద్వేలు అసెంబ్లీ సీటు కూడా పరోక్షంగా టీడీపీకి ఇచ్చినట్లేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment