డబ్బుతో రండి.. అధికారంలోకి వస్తే దండుకోండి
బడాబాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్
రూ.కోట్లు ఇచ్చే ఎన్నారైలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకే టికెట్లలో పెద్దపీట
పెమ్మసాని, వెనిగండ్ల రాము, అమిలినేని సురేంద్రబాబు, కాకర్ల సురేష్ లకు రెడ్‌కార్పెట్
అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకునే వెసులుబాటు కల్పిస్తానంటూ బాబు భరోసా
మరింతమందికి గాలం వేసేందుకు బాబు, చినబాబు రకరకాల పన్నాగాలు.. రాయ‘బేరాలు’
‘సిద్ధం’ సభలు సూపర్ హిట్.. టీడీపీ– జనసేన సభ అట్టర్ ఫ్లాప్‌తో వెనుకంజ
వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని టైమ్స్ నౌ, జీన్యూస్ వంటి డజనుకు పైగా సంస్థల సర్వేల్లో వెల్లడి
ఓటమి భయంతో ముందుకురాని ‘పెట్టుబడి’దారులు
వారిలో ఉత్సాహం నింపేందుకే వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు పోయినవారితో చేరికల తతంగం
2014లో భారీగా పెట్టుబడి పెట్టిన పొంగూరు నారాయణ.. ప్రతిఫలంగా ఎమ్మెల్సీని చేసి కేబినెట్లో కీలక మంత్రి పదవి కట్టబెట్టిన బాబు
ఈసారి రూ.900 కోట్లు సమకూర్చిన వైనం
సాక్షి, అమరావతి: రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి.. ఓటుకు నోటు అలవాటు చేసిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు సొమ్ములున్న బడాబాబులకు రకరకాల ఆఫర్లతో సీట్లు ఎరవేస్తున్నారు. వందల కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చుకో.. అన్నీ కుదిరి అధికారంలోకి వస్తే దొరికినంత దోచుకో.. ఇదీ ‘పెట్టుబడి’దారులకు చంద్రబాబు ఓపెన్ ఆఫర్. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నేతలను పక్కనపెట్టి.. సొమ్ములు సమకూర్చడానికి అంగీకరించిన ఎన్నారైలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకు అభ్యర్థుల ఎంపికలో పెద్దపీట వేస్తున్నారు.
అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుని కీలక మంత్రిత్వ శాఖను అప్పగిస్తానని కొందరికి.. భారీ ఎత్తున లాభాలు వచ్చే కాంట్రాక్టు పనులు, గనులు అప్పగిస్తానంటూ మరికొందరికి భరోసా కల్పిస్తున్నారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో భారీగా నిధులు సమకూర్చిన నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఎమ్మెల్సీని చేసి, రాజధాని నిర్మాణంతో ముడిపడిన కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అప్పగించానని గుర్తు చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన భారీ ఎత్తున భూములు కాజేసిన నారాయణ.. ఇన్నర్ రింగ్ అలైన్‌మెంట్ మార్చేసి, రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలతోపాటు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు, శాశ్వత నిర్మాణల పనుల టెండర్లు, టిడ్కో గృహాల టెండర్లలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడి వేలాది కోట్ల రూపాయాలను కొల్లగొట్టాడు.. అవన్నీ ఇపుడు కేసులై మెడకు చుట్టుకున్నాయనుకోండి.. అది వేరే సంగతి...
పెమ్మసాని నుంచి అమిలినేని దాకా..
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నేత, ట్రాన్స్‌ట్రాయ్ అధినేత రాయపాటి సాంబశివరావు ఆసక్తి చూపారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులను 2013లో దక్కించుకున్న రాయపాటి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ప్రభుత్వం నుంచి తీసుకున్న సొమ్ములో రూ.150 కోట్లు 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఇవ్వడం వల్లే నరసరావుపేట లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని రాయపాటి తనయుడు రాయపాటి రంగరావు ఇటీవల అంగీకరించారు.
ట్రాన్స్‌ట్రాయ్ దివాలా తీయడం, రాయపాటి ఆర్థికంగా కుదేలవడంతో ఈసారి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు కుండ బద్దలు కొట్టేశారట. తెనాలికి చెందిన ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఎత్తున పెట్టుబడి పెడుతుండడంతో ఆయనను గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇదే రీతిలో పెట్టుబడి పెట్టడంతో గుడివాడ నియోజకవర్గంలో సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రామును.. విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా కేశినేని చిన్నిలను చంద్రబాబు ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును పక్కన పెట్టి.. పెట్టుబడి పెట్టిన ఎన్నారై కాకర్ల సురేష్ను చంద్రబాబు ఎంపిక చేశారు.
రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు హంద్రీ–నీవా రెండో దశ పనుల్లో పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద తొలగించి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టిన చంద్రబాబు.. భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు పెట్టుబడి పెట్టడంతో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరికి మొండి చేయిచూపారు. అమిలినేని సురేంద్రబాబును అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఓటమి భయంతో పెట్టుబడిదారులు వెనుకంజ..
ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి జనవరి 27న భీమిలి.. గత నెల 3న దెందులూరు.. గత నెల 18న రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభ అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. సార్వత్రిక ఎన్నికలక ముందే వైఎస్సార్‌సీపీ సునామీ సృష్టించడం ఖాయమని రాప్తాడు ‘సిద్ధం’ సభతో తేలిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టైమ్స్ నౌ, జీన్యూస్, రిపబ్లిక్ టీవీ, జన్‌మత్, జనాధార్ ఇండియా వంటి జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని.. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యమని వెల్లడించాయి. టీడీపీ–జనసేన పొత్తులో సీట్ల పంపకాల ‘లెక్క’ తేలాక ఇరు పక్షాలు తొలి సారిగా ఉమ్మడిగా పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో గత నెల 28న ‘తెలుగుజన విజయకేతన జెండా’ సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది.
అవకాశవాదంతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆ రెండు పక్షాలు ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభలోనే జనం ఛీకొట్టారని.. ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి ఘోరంగా ఓడిపోతుందనడానికి ఇది సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వాస్తవ పరిస్థితిని పసిగట్టిన పెట్టుబడిదారులు ఓటమి భయంతో టీడీపీలో చేరేందుకు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు.
వైఎస్సార్సీపీలో సీట్లు దక్కని వారితో చేరికల డ్రామాలు..
వ్యక్తిగత కారణాలతో.. టికెట్లు దక్కక వైఎస్సార్‌సీపీని వీడిన వారిని చేర్చుకోవడం ద్వారా టీడీపీకి క్రేజ్ ఉందని చూపి పెట్టుబడిదారులను సమ్మెహనపరిచేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత కారణాలతో.. టిక్కెట్లు దక్కక వైఎస్సార్‌సీపీని వీడిన లావు కృష్ణదేవరాయలు, వసంత కృష్ణప్రసాద్, జంగా కృష్ణమూర్తి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిలకు చంద్రబాబు టీడీపీ తీర్థం ఇచ్చారు.
ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా, ఆయన భార్య ప్రశాంతిని కోవూరు అభ్యర్థిగా.. లావు కృష్ణదేవరాయలును నరసరరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా.. వసంత కృష్ణప్రసాద్‌ను మైలవరం అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్‌లో మకాం వేసి రాయ‘భేరాలు’..
హైదరాబాద్‌లో మకాం వేసిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడిదారులతో రాయబారాలు.. భేరసారాలు జరుపుతున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టండి.. కోరుకున్న స్థానం నుంచి పోటీ చేయండి.. అధికారంలోకి వస్తే దొరికినంత దోచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తా అంటూ ఎన్నారైలు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులతో చంద్రబాబు రాయబారాలు నడుపుతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఫర్వాలేదు.. పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున దోచుకోవడానికి అవకాశం కల్పిస్తానంటూ రాజకీయాల నుంచి నిష్క్రమించిన ఆపార్టీ ప్రజాప్రతినిధితోనూ చంద్రబాబు బేరసారాలు జరిపినా ఫలితం రాలేదని టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
ఈసారి నారాయణ వాటా రూ.900 కోట్లు..
నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ 2014 వరకూ చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను పరోక్షంగా చూశారు.. ఆ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. భారీ ఎత్తున ధనం వెదజల్లడంతో 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గంలో నారాయణకు కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖను కేటాయించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారు. ఐదేళ్లపాటు ఆకాశమే హద్దుగా చెలరేగిన నారాయణ భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాను.. ప్రజల ఆస్తులను దోచేశారు.
గత ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన నారాయణ.. వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీకి ఎన్నికల ఖర్చుల కోసం ఇప్పటికే ప్రజల నుంచి మార్వాడీలు, వ్యాపారుల నుంచి రూ.650 కోట్లను సమీకరించిన నారాయణ చేర్చాల్సిన చోటకు చేర్చారు. వారం క్రితం మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో వ్యాపారుల నుంచి రూ.2 నుంచి రూ.3ల వడ్డీకి మరో రూ.250 కోట్లను సమీకరించిన నారాయణ టీడీపీకి ఎన్నికల నిధి కింద అందజేశారు. మొత్తమ్మీద ఈసారి తన వాటాగా నారాయణ రూ.900 కోట్లు సమకూర్చారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment