sarvey
-
ఇచ్చుకో.. దండుకో
సాక్షి, అమరావతి: రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి.. ఓటుకు నోటు అలవాటు చేసిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు సొమ్ములున్న బడాబాబులకు రకరకాల ఆఫర్లతో సీట్లు ఎరవేస్తున్నారు. వందల కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చుకో.. అన్నీ కుదిరి అధికారంలోకి వస్తే దొరికినంత దోచుకో.. ఇదీ ‘పెట్టుబడి’దారులకు చంద్రబాబు ఓపెన్ ఆఫర్. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నేతలను పక్కనపెట్టి.. సొమ్ములు సమకూర్చడానికి అంగీకరించిన ఎన్నారైలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకు అభ్యర్థుల ఎంపికలో పెద్దపీట వేస్తున్నారు. అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుని కీలక మంత్రిత్వ శాఖను అప్పగిస్తానని కొందరికి.. భారీ ఎత్తున లాభాలు వచ్చే కాంట్రాక్టు పనులు, గనులు అప్పగిస్తానంటూ మరికొందరికి భరోసా కల్పిస్తున్నారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో భారీగా నిధులు సమకూర్చిన నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఎమ్మెల్సీని చేసి, రాజధాని నిర్మాణంతో ముడిపడిన కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అప్పగించానని గుర్తు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన భారీ ఎత్తున భూములు కాజేసిన నారాయణ.. ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ మార్చేసి, రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలతోపాటు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు, శాశ్వత నిర్మాణల పనుల టెండర్లు, టిడ్కో గృహాల టెండర్లలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడి వేలాది కోట్ల రూపాయాలను కొల్లగొట్టాడు.. అవన్నీ ఇపుడు కేసులై మెడకు చుట్టుకున్నాయనుకోండి.. అది వేరే సంగతి... పెమ్మసాని నుంచి అమిలినేని దాకా.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నేత, ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి సాంబశివరావు ఆసక్తి చూపారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులను 2013లో దక్కించుకున్న రాయపాటి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ప్రభుత్వం నుంచి తీసుకున్న సొమ్ములో రూ.150 కోట్లు 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఇవ్వడం వల్లే నరసరావుపేట లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని రాయపాటి తనయుడు రాయపాటి రంగరావు ఇటీవల అంగీకరించారు. ట్రాన్స్ట్రాయ్ దివాలా తీయడం, రాయపాటి ఆర్థికంగా కుదేలవడంతో ఈసారి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు కుండ బద్దలు కొట్టేశారట. తెనాలికి చెందిన ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఎత్తున పెట్టుబడి పెడుతుండడంతో ఆయనను గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇదే రీతిలో పెట్టుబడి పెట్టడంతో గుడివాడ నియోజకవర్గంలో సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రామును.. విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా కేశినేని చిన్నిలను చంద్రబాబు ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును పక్కన పెట్టి.. పెట్టుబడి పెట్టిన ఎన్నారై కాకర్ల సురేష్‌ను చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు హంద్రీ–నీవా రెండో దశ పనుల్లో పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద తొలగించి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టిన చంద్రబాబు.. భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు పెట్టుబడి పెట్టడంతో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరికి మొండి చేయిచూపారు. అమిలినేని సురేంద్రబాబును అభ్యర్థిగా ఖరారు చేశారు. ఓటమి భయంతో పెట్టుబడిదారులు వెనుకంజ.. ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి జనవరి 27న భీమిలి.. గత నెల 3న దెందులూరు.. గత నెల 18న రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభ అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. సార్వత్రిక ఎన్నికలక ముందే వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని రాప్తాడు ‘సిద్ధం’ సభతో తేలిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైమ్స్ నౌ, జీన్యూస్, రిపబ్లిక్ టీవీ, జన్మత్, జనాధార్ ఇండియా వంటి జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని.. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యమని వెల్లడించాయి. టీడీపీ–జనసేన పొత్తులో సీట్ల పంపకాల ‘లెక్క’ తేలాక ఇరు పక్షాలు తొలి సారిగా ఉమ్మడిగా పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో గత నెల 28న ‘తెలుగుజన విజయకేతన జెండా’ సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది. అవకాశవాదంతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆ రెండు పక్షాలు ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభలోనే జనం ఛీకొట్టారని.. ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి ఘోరంగా ఓడిపోతుందనడానికి ఇది సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వాస్తవ పరిస్థితిని పసిగట్టిన పెట్టుబడిదారులు ఓటమి భయంతో టీడీపీలో చేరేందుకు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. వైఎస్సార్సీపీలో సీట్లు దక్కని వారితో చేరికల డ్రామాలు.. వ్యక్తిగత కారణాలతో.. టికెట్లు దక్కక వైఎస్సార్సీపీని వీడిన వారిని చేర్చుకోవడం ద్వారా టీడీపీకి క్రేజ్ ఉందని చూపి పెట్టుబడిదారులను సమ్మెహనపరిచేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత కారణాలతో.. టిక్కెట్లు దక్కక వైఎస్సార్సీపీని వీడిన లావు కృష్ణదేవరాయలు, వసంత కృష్ణప్రసాద్, జంగా కృష్ణమూర్తి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిలకు చంద్రబాబు టీడీపీ తీర్థం ఇచ్చారు. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా, ఆయన భార్య ప్రశాంతిని కోవూరు అభ్యర్థిగా.. లావు కృష్ణదేవరాయలును నరసరరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా.. వసంత కృష్ణప్రసాద్‌ను మైలవరం అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో మకాం వేసి రాయ‘భేరాలు’.. హైదరాబాద్‌లో మకాం వేసిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌లు పెట్టుబడిదారులతో రాయబారాలు.. భేరసారాలు జరుపుతున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టండి.. కోరుకున్న స్థానం నుంచి పోటీ చేయండి.. అధికారంలోకి వస్తే దొరికినంత దోచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తా అంటూ ఎన్నారైలు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులతో చంద్రబాబు రాయబారాలు నడుపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఫర్వాలేదు.. పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున దోచుకోవడానికి అవకాశం కల్పిస్తానంటూ రాజకీయాల నుంచి నిష్క్రమించిన ఆపార్టీ ప్రజాప్రతినిధితోనూ చంద్రబాబు బేరసారాలు జరిపినా ఫలితం రాలేదని టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈసారి నారాయణ వాటా రూ.900 కోట్లు.. నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ 2014 వరకూ చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను పరోక్షంగా చూశారు.. ఆ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. భారీ ఎత్తున ధనం వెదజల్లడంతో 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గంలో నారాయణకు కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖను కేటాయించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారు. ఐదేళ్లపాటు ఆకాశమే హద్దుగా చెలరేగిన నారాయణ భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాను.. ప్రజల ఆస్తులను దోచేశారు. గత ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన నారాయణ.. వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీకి ఎన్నికల ఖర్చుల కోసం ఇప్పటికే ప్రజల నుంచి మార్వాడీలు, వ్యాపారుల నుంచి రూ.650 కోట్లను సమీకరించిన నారాయణ చేర్చాల్సిన చోటకు చేర్చారు. వారం క్రితం మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో వ్యాపారుల నుంచి రూ.2 నుంచి రూ.3ల వడ్డీకి మరో రూ.250 కోట్లను సమీకరించిన నారాయణ టీడీపీకి ఎన్నికల నిధి కింద అందజేశారు. మొత్తమ్మీద ఈసారి తన వాటాగా నారాయణ రూ.900 కోట్లు సమకూర్చారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
బైడెన్‌కే భారతీయుల బాసట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌కే ఇండియన్ అమెరికన్లు జై కొడతారని ఇండియాస్పొరా అండ్ ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐల్యాండర్స్ (ఏఏపీఐ) డేటా సర్వేలో తేలింది. 77 ఏళ్ల వయసున్న బైడెన్ ఇండియన్ అమెరికన్ ఓటర్లతో గత కొన్నేళ్లుగా మంచి సంబంధ బా«ంధవ్యాలు కలిగి ఉన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడం కూడా ఆయనకి కొంత వరకు కలిసి వచ్చినట్టుగా మంగళవారం విడుదలైన సర్వే నివేదిక పేర్కొంది. ఏఏపీఐ డేటా సర్వే ప్రకారం బైడెన్‌కు 66 శాతం మంది ఇండియన్ అమెరికన్లు మద్దతుగా ఉంటే, ట్రంప్‌కి 28శాతంఅనుకూలంగా ఉన్నారు. మరో 6 శాతం మంది ఎవరికి ఓటు వెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయినప్పటికీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే ట్రంప్ మద్దతుదారులు పెరగడం డెమోక్రాట్లలో ఆందోళన పెంచుతోంది. పట్టు పెంచుకుంటున్న ట్రంప్ ఏఏపీఐ డేటా సర్వేకి నేతృత్వం వహించిన డాక్టర్ కార్తీక్ రామకృష్ణన్ ఎన్నికల సమయానికి ఓటర్ల మూడ్ మారి ట్రంప్‌కి 30 శాతం మంది వరకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో ట్రంప్‌కి ఇండియన్ అమెరికన్లు 16శాతం మంది ఓటు వేశారు. ఈ సారి 30 శాతం మంది మద్దతిస్తే భారీ పెరుగుదలగానే చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రవాస భారతీయుల్ని ఆకర్షించే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, దక్షిణాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ మిలాన్ వైష్ణవ్ అన్నారు. జో బైడెన్‌కే ఇండియన్ అమెరికన్లు అత్యధికులు అండగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 77శాతం మంది హిల్లరీ క్లింటన్‌కి అనుకూలంగా ఓటు వేస్తే, అంతకు ముందు 2012 ఎన్నికల్లో బరాక్ ఒబామాకు 84శాతం మంది ఇండియన్ అమెరికన్లు ఓట్లు వేశారు. వారితో పోల్చి చూస్తే బైడెన్ వెనుకబడి ఉండడం డెమొక్రాట్లలో కాస్త ఆందోళన పెంచుతోంది. స్వింగ్ స్టేట్స్లో ప్రతీ ఓటు అత్యంత కీలకం కాబట్టి డెమొక్రాట్లు వివిధ ప్రవాస భారతీయ సంస్థల్ని తమ వైపు తిప్పుకునేలా చర్యలు చేపట్టాలని సర్వే నివేదిక రచయిత డా. కార్తీక్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తారో చివరి నిముషం వరకు తేల్చుకోలేని స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిషిగావ్, ఫ్లోరిడా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. -
అక్కడ హంగ్ తప్పదు.. బీజేపీకి చాలా కష్టం!
సాక్షి, షిల్లాంగ్ : మేఘాలయ హంగ్ ఏర్పడనుందా? ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదా? అటు ప్రాంతీయ పార్టీలుగానీ, జాతీయ పార్టీలుగానీ, మొత్తం ఓటు బ్యాంకును తమ ఖాతాల్లోకి వేసుకోలేకపోయాయా? ఈ విషయంలో కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ మేఘాలయలో వెనుకబడుతుందా? గతంలోకంటే కాంగ్రెస్ పార్టీ తన స్థానాలను పెంచుకోని మరోసారి అక్కడ అతిపెద్ద పార్టీగా మారనుందా? అంటే ఓ సర్వే ఫలితాలు అవునని చెబుతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయలో మంగళవారం ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో కచ్చితంగా హంగ్ పరిస్థితి ఏర్పడుతుందని, సంకీర్ణాలతో కలిసి మెజార్టీ స్థానాలు లభించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొని ఐదేళ్లపాటు నడిపించాల్సిందేనని హైదరాబాద్‌కు చెందిన సర్వే సంస్థ 'పీపుల్స్ పల్స్' వెల్లడించింది. ఈ సంస్థ తెలిపిన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 19 నుంచి 24 సీట్లు లభించి అతిపెద్ద పార్టీగా మారనుందట. ఇక ఎన్పీపీ 10 నుంచి 13 సీట్లు పొందుతుందని, యూడీపీకి 6 నుంచి 9 మాత్రం వస్తాయని, ఇక బీజేపీకి మాత్రం అతి తక్కువగా 2 నుంచి 5సీట్లు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చింది. ఇక ఇతరులు మాత్రం 7 నుంచి 12 సీట్లు పొందుతారని పేర్కొంది. తాము ఈ ప్రీపోల్ సర్వేను ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నిర్వహించామని, 20 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజక వర్గంలో మూడు పోలింగ్ కేంద్రాల ప్రాతిపదికన 1200 మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకొని సర్వే నిర్వహించినట్లు పీపుల్స్ పల్స్ వెల్లడించింది. తాము చెప్పిన అంచనాల్లో మూడుస్థానాలు పెరగడమో మూడు తగ్గడమో జరుగుతుంది తప్ప పెద్దగా తేడాలు ఏమీ ఉండవని తెలిపింది. మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే కనీసం 31 స్థానాలు మేజిక్ ఫిగర్‌ను అందుకోవాలి. అయితే కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చిన నేపథ్యంలో 24 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయనుకున్నా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కనీసం మరో ఏడు సీట్లు కావాల్సి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకు 30 సీట్లు దక్కించుకోగా ఇద్దరు స్వతంత్రులు, ఒక యూడీపీ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనేది ప్రధాన ప్రశ్న. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) జాతీయ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ అది ముఖ్యంగా గారో హిల్స్‌కు చెందిన పార్టీ అని, ఈ ఎన్నికల్లో చెప్పుకోదగిన పనితీరును అది కనబర్చలేదని సర్వే తెలిపింది. ఇక ఎక్కువ సీట్లు ఉన్న తురా ప్రాంతంలో కాంగ్రెస్‌కు 8, ఎన్పీపీకి 7, బీజేపీకి 3 ఇతరులకు మూడు, జీఎన్సీ, ఎన్సీపీ, యూడీపీలకు తలా ఓ సీటు వస్తుందని సర్వే వెల్లడించింది. బీజేపీ వెనుకబడటానికి కారణం మేఘాలయలో బీజేపీ వెనుకబాటుకు ప్రధాన కారణం భాగస్వామ్య పార్టీలు ముందుకు రావకపోవడమేనని సర్వే తేల్చింది. స్థానిక పార్టీలు ఏవీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అక్కడి 70శాతం ప్రజలకు ఇష్టం లేదట. ఎన్నికలకు ముందు బీజేపీ పొత్తుపెట్టుకునేందుకు ఏ పెద్ద ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రావడానికి ఇష్టపడలేదట. 74శాతం మంది ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఓటర్ల దృష్టి దేనిపై ఉంది? 2018 ఎన్నికల్లో స్థానిక ఓటర్లలో ఎక్కువశాతంమంది అభివృద్ధి అనే అంశంపైనే ఫోకస్ చేశారంట. అలాగే, తమ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పారదోలాలని 25శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది. ఇక 53శాతం ఓటర్లు తమకు పోటీకి దిగే అభ్యర్థి ముఖ్యం అని చెప్పగా 22శాతం, 15 శాతం ఓటర్లు తమకు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ముఖ్యం అని చెబుతున్నారు. ముకుల్ సంగ్మాకు ఎన్ని మార్కులు? ముకుల్ సంగ్మా ప్రభుత్వానికి మరోసారి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెబితే ఏమంటారని ప్రశ్నించగా 38శాతం మంది నో చెప్పగా 22శాతం మంది మాత్రం ఓకే చెప్పారని సర్వే తెలిపింది. 40శాతంమంది మాత్రం అనూహ్యంగా తాము ఏమీ చెప్పలేమని పేర్కొన్నట్లు సర్వే పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మళ్లీ ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా 38శాతంమంది నో అని, 34శాతంమంది తప్పకుండా అని చెప్పారు. అంతేకాకుండా ముకుల్ సంగ్మా పనితీరుకు ప్రజలు మంచి మార్కులే వేశారు. 50శాతం మంది ఆయన బాగా పనిచేస్తున్నారని, 17 శాతంమంది పర్వాలేదని, 37 శాతం మంది సరిగా పనిచేయట్లేదని బదులిచ్చినట్లు సర్వే తేల్చింది. -
మహిళల టాప్ ఐదు భయాలు తెలుసా?
లండన్: గ్లామర్ మీద కామెంట్ చేస్తే మహిళలు అస్సలు తట్టుకోలేరనే విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. ఈ పని ఎందుకు సరిగా చేయలేదని కసురుకున్నా పెద్దగా పట్టించుకోరేమోగానీ మీరేందుకు ఈ మధ్య ఇలా అవుతున్నారు.. రోజురోజుకు గ్లామర్ తగ్గిపోతుందని కామెంట్ చేస్తే మాత్రం ఇక ఆ రోజంతా మధనపడతారు. ఇక అద్దం ముందు నిల్చుని తమను తాము ఎన్నిసార్లు చూసుకుంటారో చెప్పనక్కర్లేదు. అలాంటి మహిళలకు ఎవరూ ఎలాంటి కామెంట్ చేయకుండానే ఒక రోజుకు సరిగ్గా భయంపట్టుకుందట. అది కూడా గ్లామర్ భయమే.. అంతకుముందు ఏ ఒక్కసారో రెండుసార్లో తమను తాము చూసుకునే వారు ఆ రోజు వచ్చినప్పటి నుంచి వీలయినన్ని ఎక్కువసార్లు తమ ముఖాన్ని అద్దంలో చూసి సరిచేసుకుంటారంట. అదెప్పుడంటే వారు సరిగ్గా 29 ఏటకు అడుగుపెట్టినప్పుడు. అవును 2/3వంతు మహిళలకు 29 ఏళ్లలో అడుగుపెట్టి 30వ పుట్టిన రోజు కేక్‌ను కట్ చేసే సమయంలో ఈ భయంపట్టుకుందట. దీనికి అదనంగా జుట్టురాలిపోవడం, చర్మం ముడతలు పడిపోవడం, కళ్ల వద్ద కాకి పాదాల్లాగా ముడత రావడం వంటి ఆందోళలన చేరుతాయంట. ఇక పురుషులకయితే ఇలాంటి సమస్య తొందరగా రాదని, 36 ఏళ్ల తర్వాతనే వారికి కొద్దిగా ఆందోళన మొదలవుతుందని ఆ సర్వే తెలిపింది. మాంచెస్టర్‌లోని క్రౌన్ క్లిన్ అనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ దాదాపు వెయ్యిమందితో ఈ సర్వే చేయించి దాని వివరాలు విడుదల చేసింది. దీనిప్రకారం.. వయసుపైబడుతున్న మహిళలకు ఉండే టాప్ ఐదు భయాలు 1.జుట్టు నెరవడం 2.చర్మం ముడతలు 3.కళ్ల వద్ద కాకి పాదాల్లాంటి ముడతలు 4.డబుల్ చిన్ 5.లావుగా మారే చేతులు(బింగో వింగ్స్) వయసు పైబడుతున్న పురుషుల టాప్ ఐదు భయాలు 1.పురుషులకు వచ్చే వక్షాలు(మ్యాన్ బూబ్స్) 2.పలుచబడే జుట్టు 3.డబుల్ చిన్ 4.భారీ పొట్ట 5.జుట్టురంగు మారడం -
ఇండియాలో యువత ఎందుకు చనిపోతుందో తెలుసా?
న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముక రైతు అన్నట్లే.. యువత కూడా అంతకంటే ప్రాధాన్యం. ఏ దేశంలో యువజనులు అధికంగా ఉంటారో ఆ దేశం చాలా బలంగా ఉన్నట్లు ఒక అంచనా వేస్తారు. సహజ సిద్ధంగానే ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా భారత్‌లో యువత ఎక్కువ. అయితే, ఆ యువత అంత ఏమైపోతుంది? ముఖ్యంగా యువకులు ఎందుకు చనిపోతున్నారు? అలా చనిపోవడానికి గల కారణాలు ఏమిటి? గతంలో ఎన్ని మరణాలు ఉన్నాయి? ఇప్పుడెంతమంది చనిపోతున్నారు? వంటి పలు అంశాలపైన 2013నాటి సమాచారం ప్రకారం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ అవల్యూషన్ (ఐహెచ్ఎంఈ) అనే సంస్థ వెల్లడించింది. ఇది 15 నుంచి 24 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారి మరణాలను విశ్లేషించింది. దీని ప్రకారం భారతీయ యువత మరణాలు అన్ని కూడా తమకు తాము హానీ చేసుకోవడం మూలంగానే జరుగుతున్నాయి. ఒక్క 2013లోనే 60 వేల మంది భారతీయ యువత చనిపోయిందని, వీరంతా ఆత్మహత్యవంటి తమకు తమకు తాము హానీ చేసుకునే చర్యలకు పాల్పడటం వల్లే ఇన్ని మరణాలు సంభవించాయని పేర్కొంది. ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో దాదాపు 37 వేలమంది యువకులు ప్రాణాలు విడిచినట్లు తెలిపింది. గతంలో 1990లో ఇలా తమకు తాము హానీ చేసుకోవడం వల్ల 37,630మంది ప్రాణాలుకోల్పోయారని ఇది అనూహ్యంగా ఇప్పుడు 60 వేలకు పెరగడం ఆందోళనకరమని చెప్పారు. ఈ సంఖ్య ప్రస్తుతం ట్యూబర్ క్యులోసిస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను కూడా దాటేసిందని వెల్లడించారు. 'ఇంతమంది యువత చనిపోతున్నా ఇండియాలో వాటి నివారణకు పెద్దగా ఏమీ చేయడం లేదు. అదే చైనా, శ్రీలంక వంటి దేశాల్లో ఈ విషయం సీరియస్ గా తీసుకుంటున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం తీసుకురాకుంటే ఈ యువత గురించి పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అని ఆ నివేదిక పేర్కొంది. తమకు తాము హానీ చేసుకోవడం మూలంగా చైనాలో ఏడాదికి చనిపోతున్న 15-24 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత 11,074 ఉండగా.. బ్రెజిల్ లో ఇది 2,697 మాత్రమే ఉంది. -
60 శాతం ఆరుబయటే
హైదరాబాద్, రంగారెడ్డిని మినహాయిస్తే జిల్లాల్లో దారుణ పరిస్థితి 55 శాతం మందికి రక్షిత తాగునీరు కరువు తెలంగాణలో సెస్, యూనిసెఫ్ సంయుక్త సర్వే సమగ్ర నివేదికను ఆవిష్కరించిన అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: అమ్మాయి తలమీద ముసుగు తీసేందుకు వీల్లేదు కానీ.. ఆ అవసరాలకు మాత్రం ఆరుబయటకు వెళ్లాల్సిందే. ఇదేదో టీవీ చానళ్లలో వస్తున్న ప్రకటనలా ఉందనుకుంటున్నారా! అవును, నిజమే.. అయితే ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పరిస్థితులే ఉన్నాయన్నది వాస్తవమని తేలింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్), యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో కళ్లు తిరిగే విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో నియోజకవర్గాలవారీగా తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులపై క్షేత్రస్థాయిలో లోతైన విశ్లేషణ చేసిన ఈ సంస్థలు సమగ్ర వివరాలతో నివేదికను రూపొందించాయి. మొత్తంగా రాష్ట్రంలో 52.60 శాతం కుటుంబాల్లోనే మరుగుదొడ్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 80 శాతంకన్నా ఎక్కువ కుటుంబాలకు మరుగుదొడ్లు ఉండగా, ఈ రెండు జిల్లాలను మినహాయిస్తే మిగతా రాష్ట్రంలో 59.97 శాతం మంది ఈ సదుపాయం లేక ఆరుబయటే పని కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, అదిలాబాద్ జిల్లాలు మరుగుదొడ్ల లభ్యతలో బాగా వెనుకబడ్డాయి. ఈ జిల్లాల్లో 30 శాతం కన్నా తక్కువ కుటుంబాలకే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటికీ కరువే... ఇక రాష్ర్టంలో సగం మందికి కూడా సురక్షితమైన తాగునీరు అందడం లేదు. రా్రష్ట్రవ్యాప్తంగా 54.40 శాతం కుటుంబాలకే ఇంటివద్ద మంచినీటి సదుపాయం ఉన్నట్లు తేలింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం 72 శాతం ఇళ్లలో మంచినీటి సదుపాయం ఉంది. జంట జిల్లాలను మినహాయిస్తే గ్రామీణ తెలంగాణలో 54.50 శాత ం మందికి తాగునీటి సౌకర్యం లేదు. మంచినీటి లభ్యత విషయంలోనూ మహబూబ్‌నగర్, అదిలాబాద్ జిల్లాలే బాగా వెనుకబడి ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 33 శాతం, అదిలాబాద్‌లో 35 శాతం మందికే రక్షిత మంచినీరు అందుతున్నట్లు సర్వే గణాంకాల్లో వెల్లడైంది. ఆందోళనకరం: స్పీకర్ మధుసూదనాచారి రాష్ట్రంలో తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య పరిస్థితులపై తాజాగా వెల్లడైన వాస్తవాలను చూస్తే ఆందోళన కలుగుతోందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. యూనిసెఫ్, సెస్ సంయుక్త సర్వే నివేదికను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోవడం దురదృష్టకరమన్నారు. సదుపాయాలు కల్పించాలన్నా అందుకు అవసరమైన సమగ్ర సమాచారం ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద లేదన్నారు. తాజా నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి దిక్సూచిలాగా, శాసనసభ్యులకు పవిత్ర గ్రంధంలా ఉపకరిస్తుందన్నారు. త్వరలోనే శాసనసభ్యులను సమావేశపరచి వారి నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితులను వివరిస్తామన్నారు. ఏడాదిలోగా పరిస్థితులను కొంతమేరకైనా మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం, వాటర్‌గ్రిడ్ పథకం అమలు ద్వారా పరిస్థితి కొంత మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ చీఫ్ రూత్ లియానో, సెస్ డెరైక్టర్ గాలబ్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి లభ్యత(శాతాల్లో..) జిల్లా మరుగుదొడ్లు తాగునీటి లభ్యత హైదరాబాద్ 98కిపైగా 92కుపైగా రంగారెడ్డి 81 72 ఖమ్మం 51 50 కరీంనగర్ 46 64 మెదక్ 44 42 వరంగల్ 44 52 నిజామాబాద్ 42 41 నల్లగొండ 41 40 ఆదిలాబాద్ 29 35 మహబూబ్‌నగర్ 26 33 రాష్ట్ర సగటు 52.6 54.4 (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే.. రాష్ట్రంలో సగటున 40.3% గృహాల్లోనే మరుగుదొడ్లున్నాయి, 45.5% గృహాలకే తాగునీటి సౌకర్యం ఉంది) -
విలీన మండలాల్లో సమగ్ర సర్వే నిలిపివేత
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయిన ఏడు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేను నిలిపివేసింది. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించబడిన పోలవరం ముంపు మండలాలు చింతూరు, వీఆర్ పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో విలీనం అయిన గ్రామాల్లో సర్వేను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 19న సర్వే జరగనున్న విషయం విదితమే.