వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌కే ఇండియన్ అమెరికన్లు జై కొడతారని ఇండియాస్పొరా అండ్ ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐల్యాండర్స్ (ఏఏపీఐ) డేటా సర్వేలో తేలింది. 77 ఏళ్ల వయసున్న బైడెన్ ఇండియన్ అమెరికన్ ఓటర్లతో గత కొన్నేళ్లుగా మంచి సంబంధ బా«ంధవ్యాలు కలిగి ఉన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడం కూడా ఆయనకి కొంత వరకు కలిసి వచ్చినట్టుగా మంగళవారం విడుదలైన సర్వే నివేదిక పేర్కొంది. ఏఏపీఐ డేటా సర్వే ప్రకారం బైడెన్‌కు 66 శాతం మంది ఇండియన్ అమెరికన్లు మద్దతుగా ఉంటే, ట్రంప్‌కి 28శాతంఅనుకూలంగా ఉన్నారు. మరో 6 శాతం మంది ఎవరికి ఓటు వెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయినప్పటికీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే ట్రంప్ మద్దతుదారులు పెరగడం డెమోక్రాట్లలో ఆందోళన పెంచుతోంది.
పట్టు పెంచుకుంటున్న ట్రంప్
ఏఏపీఐ డేటా సర్వేకి నేతృత్వం వహించిన డాక్టర్ కార్తీక్ రామకృష్ణన్ ఎన్నికల సమయానికి ఓటర్ల మూడ్ మారి ట్రంప్‌కి 30 శాతం మంది వరకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో ట్రంప్‌కి ఇండియన్ అమెరికన్లు 16శాతం మంది ఓటు వేశారు. ఈ సారి 30 శాతం మంది మద్దతిస్తే భారీ పెరుగుదలగానే చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రవాస భారతీయుల్ని ఆకర్షించే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, దక్షిణాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ మిలాన్ వైష్ణవ్ అన్నారు. జో బైడెన్‌కే ఇండియన్ అమెరికన్లు అత్యధికులు అండగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఆందోళన నెలకొంది.
2016 అధ్యక్ష ఎన్నికల్లో 77శాతం మంది హిల్లరీ క్లింటన్‌కి అనుకూలంగా ఓటు వేస్తే, అంతకు ముందు 2012 ఎన్నికల్లో బరాక్ ఒబామాకు 84శాతం మంది ఇండియన్ అమెరికన్లు ఓట్లు వేశారు. వారితో పోల్చి చూస్తే బైడెన్ వెనుకబడి ఉండడం డెమొక్రాట్లలో కాస్త ఆందోళన పెంచుతోంది. స్వింగ్ స్టేట్స్‌లో ప్రతీ ఓటు అత్యంత కీలకం కాబట్టి డెమొక్రాట్లు వివిధ ప్రవాస భారతీయ సంస్థల్ని తమ వైపు తిప్పుకునేలా చర్యలు చేపట్టాలని సర్వే నివేదిక రచయిత డా. కార్తీక్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తారో చివరి నిముషం వరకు తేల్చుకోలేని స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిషిగావ్, ఫ్లోరిడా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment