వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ప్రధానంగా స్వింగ్ స్టేట్స్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ట్రంప్‌కి, ప్రధాని మోదీకి మధ్యనున్న స్నేహ బంధం వల్లే ప్రవాస భారతీయులు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నట్టుగా ఆ సర్వే పేర్కొంది. ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ నిర్వాహకుడు అల్ మసన్ ఈ సర్వే నిర్వహించారు.
స్వింగ్ స్టేట్స్‌లోట్రంప్‌కే మద్దతు
ఫ్లోరిడా, మిషిగావ్, పెన్సిల్వేనియా, జార్జియా, ఉత్తర కరోలినా వర్జీనియా వంటి స్వింగ్ స్టేట్స్‌లో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతునిచ్చే ఇండియన్ అమెరికన్లు ఈసారి ట్రంప్‌వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా సర్వేలో తేలింది. ట్రంప్ చైనా పట్ల అత్యంత కఠినంగా ఉండడం వల్లే డ్రాగన్ దేశం భారత్‌పైకి యుద్ధానికి దిగలేదని ఇండియన్ అమెరికన్ల అభిప్రాయంగా ఉంది. ట్రంప్, మోదీ మధ్య స్నేహంతో ప్రపంచ పటంలో భారత్ స్థానం ఎదిగిందన్న అభిప్రాయమూ ఉంది. ముఖ్యంగా చైనాపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత వల్ల ప్రవాస భారతీయులు ట్రంప్ వైపు తిరిగారని శ్రీధర్ చిట్యాల అనే పారిశ్రామికవేత్త తెలిపారు. ఇండియన్ అమెరికన్లు ట్రంప్‌కి భారీగా ఎన్నికల నిధులు ఇస్తున్నారని చెప్పారు.
సీటు దిగుతారా?
వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ఓటమి సంభవిస్తే ట్రంప్ సీటు దిగేందుకు అడ్డం తిరుగుతాడా? అంటే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇందుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలను ట్రంప్ దాటవేయడం, నర్మగర్భంగా సమాధానాలివ్వడం చూస్తే ఫలితాలు తేడాకొడితే ట్రంప్ సీటు దిగేందుకు ససేమిరా అనవచ్చని భావిస్తున్నారు. పోస్టల్ ఓటింగ్‌పై తనకు సందేహాలున్నాయని, ఈ సారి ఎన్నికల ఫలితాలు చివరకు సుప్రీంకోర్టులో తేలతాయని వ్యాఖ్యానించడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. నవంబర్ ఎన్నికల అనంతరం ఓటమి సంభవిస్తే ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా పదవి బాధ్యతలను ప్రత్యర్ధికి అప్పగిస్తారా? అని మీడియా సమావేశంలో ట్రంప్‌ను ప్రశ్నించారు. అయితే దీనికి ట్రంప్ ‘ ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నారు.
వాషింగ్టన్‌లోని సుప్రీంకోర్టు భవనంలో జస్టిస్ రూత్ బాడర్‌కు నివాళులర్పిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ దంపతులు
Comments
Please login to add a commentAdd a comment