60 శాతం ఆరుబయటే
- హైదరాబాద్, రంగారెడ్డిని మినహాయిస్తే జిల్లాల్లో దారుణ పరిస్థితి
- 55 శాతం మందికి రక్షిత తాగునీరు కరువు
- తెలంగాణలో సెస్, యూనిసెఫ్ సంయుక్త సర్వే
- సమగ్ర నివేదికను ఆవిష్కరించిన అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్: అమ్మాయి తలమీద ముసుగు తీసేందుకు వీల్లేదు కానీ.. ఆ అవసరాలకు మాత్రం ఆరుబయటకు వెళ్లాల్సిందే. ఇదేదో టీవీ చానళ్లలో వస్తున్న ప్రకటనలా ఉందనుకుంటున్నారా! అవును, నిజమే.. అయితే ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పరిస్థితులే ఉన్నాయన్నది వాస్తవమని తేలింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్), యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో కళ్లు తిరిగే విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో నియోజకవర్గాలవారీగా తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులపై క్షేత్రస్థాయిలో లోతైన విశ్లేషణ చేసిన ఈ సంస్థలు సమగ్ర వివరాలతో నివేదికను రూపొందించాయి. మొత్తంగా రాష్ట్రంలో 52.60 శాతం కుటుంబాల్లోనే మరుగుదొడ్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 80 శాతంకన్నా ఎక్కువ కుటుంబాలకు మరుగుదొడ్లు ఉండగా, ఈ రెండు జిల్లాలను మినహాయిస్తే మిగతా రాష్ట్రంలో 59.97 శాతం మంది ఈ సదుపాయం లేక ఆరుబయటే పని కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, అదిలాబాద్ జిల్లాలు మరుగుదొడ్ల లభ్యతలో బాగా వెనుకబడ్డాయి. ఈ జిల్లాల్లో 30 శాతం కన్నా తక్కువ కుటుంబాలకే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
తాగునీటికీ కరువే...
ఇక రాష్ర్టంలో సగం మందికి కూడా సురక్షితమైన తాగునీరు అందడం లేదు. రా్రష్ట్రవ్యాప్తంగా 54.40 శాతం కుటుంబాలకే ఇంటివద్ద మంచినీటి సదుపాయం ఉన్నట్లు తేలింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం 72 శాతం ఇళ్లలో మంచినీటి సదుపాయం ఉంది. జంట జిల్లాలను మినహాయిస్తే గ్రామీణ తెలంగాణలో 54.50 శాత ం మందికి తాగునీటి సౌకర్యం లేదు. మంచినీటి లభ్యత విషయంలోనూ మహబూబ్‌నగర్, అదిలాబాద్ జిల్లాలే బాగా వెనుకబడి ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 33 శాతం, అదిలాబాద్‌లో 35 శాతం మందికే రక్షిత మంచినీరు అందుతున్నట్లు సర్వే గణాంకాల్లో వెల్లడైంది.
ఆందోళనకరం: స్పీకర్ మధుసూదనాచారి
రాష్ట్రంలో తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య పరిస్థితులపై తాజాగా వెల్లడైన వాస్తవాలను చూస్తే ఆందోళన కలుగుతోందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. యూనిసెఫ్, సెస్ సంయుక్త సర్వే నివేదికను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోవడం దురదృష్టకరమన్నారు. సదుపాయాలు కల్పించాలన్నా అందుకు అవసరమైన సమగ్ర సమాచారం ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద లేదన్నారు. తాజా నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి దిక్సూచిలాగా, శాసనసభ్యులకు పవిత్ర గ్రంధంలా ఉపకరిస్తుందన్నారు. త్వరలోనే శాసనసభ్యులను సమావేశపరచి వారి నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితులను వివరిస్తామన్నారు. ఏడాదిలోగా పరిస్థితులను కొంతమేరకైనా మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం, వాటర్‌గ్రిడ్ పథకం అమలు ద్వారా పరిస్థితి కొంత మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ చీఫ్ రూత్ లియానో, సెస్ డెరైక్టర్ గాలబ్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి లభ్యత(శాతాల్లో..)
జిల్లా మరుగుదొడ్లు తాగునీటి లభ్యత
హైదరాబాద్ 98కిపైగా 92కుపైగా
రంగారెడ్డి 81 72
ఖమ్మం 51 50
కరీంనగర్ 46 64
మెదక్ 44 42
వరంగల్ 44 52
నిజామాబాద్ 42 41
నల్లగొండ 41 40
ఆదిలాబాద్ 29 35
మహబూబ్‌నగర్ 26 33
రాష్ట్ర సగటు 52.6 54.4
(హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే.. రాష్ట్రంలో సగటున 40.3% గృహాల్లోనే మరుగుదొడ్లున్నాయి, 45.5% గృహాలకే తాగునీటి సౌకర్యం ఉంది)