సాక్షి, షిల్లాంగ్ : మేఘాలయ హంగ్ ఏర్పడనుందా? ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదా? అటు ప్రాంతీయ పార్టీలుగానీ, జాతీయ పార్టీలుగానీ, మొత్తం ఓటు బ్యాంకును తమ ఖాతాల్లోకి వేసుకోలేకపోయాయా? ఈ విషయంలో కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ మేఘాలయలో వెనుకబడుతుందా? గతంలోకంటే కాంగ్రెస్ పార్టీ తన స్థానాలను పెంచుకోని మరోసారి అక్కడ అతిపెద్ద పార్టీగా మారనుందా? అంటే ఓ సర్వే ఫలితాలు అవునని చెబుతున్నాయి.
60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయలో మంగళవారం ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో కచ్చితంగా హంగ్ పరిస్థితి ఏర్పడుతుందని, సంకీర్ణాలతో కలిసి మెజార్టీ స్థానాలు లభించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొని ఐదేళ్లపాటు నడిపించాల్సిందేనని హైదరాబాద్‌కు చెందిన సర్వే సంస్థ 'పీపుల్స్ పల్స్' వెల్లడించింది. ఈ సంస్థ తెలిపిన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 19 నుంచి 24 సీట్లు లభించి అతిపెద్ద పార్టీగా మారనుందట.
ఇక ఎన్‌పీపీ 10 నుంచి 13 సీట్లు పొందుతుందని, యూడీపీకి 6 నుంచి 9 మాత్రం వస్తాయని, ఇక బీజేపీకి మాత్రం అతి తక్కువగా 2 నుంచి 5సీట్లు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చింది. ఇక ఇతరులు మాత్రం 7 నుంచి 12 సీట్లు పొందుతారని పేర్కొంది. తాము ఈ ప్రీపోల్ సర్వేను ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నిర్వహించామని, 20 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజక వర్గంలో మూడు పోలింగ్ కేంద్రాల ప్రాతిపదికన 1200 మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకొని సర్వే నిర్వహించినట్లు పీపుల్స్ పల్స్ వెల్లడించింది. తాము చెప్పిన అంచనాల్లో మూడుస్థానాలు పెరగడమో మూడు తగ్గడమో జరుగుతుంది తప్ప పెద్దగా తేడాలు ఏమీ ఉండవని తెలిపింది. మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే కనీసం 31 స్థానాలు మేజిక్ ఫిగర్‌ను అందుకోవాలి.
అయితే కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చిన నేపథ్యంలో 24 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయనుకున్నా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కనీసం మరో ఏడు సీట్లు కావాల్సి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకు 30 సీట్లు దక్కించుకోగా ఇద్దరు స్వతంత్రులు, ఒక యూడీపీ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనేది ప్రధాన ప్రశ్న. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) జాతీయ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ అది ముఖ్యంగా గారో హిల్స్‌కు చెందిన పార్టీ అని, ఈ ఎన్నికల్లో చెప్పుకోదగిన పనితీరును అది కనబర్చలేదని సర్వే తెలిపింది. ఇక ఎక్కువ సీట్లు ఉన్న తురా ప్రాంతంలో కాంగ్రెస్‌కు 8, ఎన్‌పీపీకి 7, బీజేపీకి 3 ఇతరులకు మూడు, జీఎన్‌సీ, ఎన్‌సీపీ, యూడీపీలకు తలా ఓ సీటు వస్తుందని సర్వే వెల్లడించింది.
బీజేపీ వెనుకబడటానికి కారణం
మేఘాలయలో బీజేపీ వెనుకబాటుకు ప్రధాన కారణం భాగస్వామ్య పార్టీలు ముందుకు రావకపోవడమేనని సర్వే తేల్చింది. స్థానిక పార్టీలు ఏవీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అక్కడి 70శాతం ప్రజలకు ఇష్టం లేదట. ఎన్నికలకు ముందు బీజేపీ పొత్తుపెట్టుకునేందుకు ఏ పెద్ద ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రావడానికి ఇష్టపడలేదట. 74శాతం మంది ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఓటర్ల దృష్టి దేనిపై ఉంది?
2018 ఎన్నికల్లో స్థానిక ఓటర్లలో ఎక్కువశాతంమంది అభివృద్ధి అనే అంశంపైనే ఫోకస్ చేశారంట. అలాగే, తమ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పారదోలాలని 25శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది. ఇక 53శాతం ఓటర్లు తమకు పోటీకి దిగే అభ్యర్థి ముఖ్యం అని చెప్పగా 22శాతం, 15 శాతం ఓటర్లు తమకు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ముఖ్యం అని చెబుతున్నారు.
ముకుల్ సంగ్మాకు ఎన్ని మార్కులు?
ముకుల్ సంగ్మా ప్రభుత్వానికి మరోసారి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెబితే ఏమంటారని ప్రశ్నించగా 38శాతం మంది నో చెప్పగా 22శాతం మంది మాత్రం ఓకే చెప్పారని సర్వే తెలిపింది. 40శాతంమంది మాత్రం అనూహ్యంగా తాము ఏమీ చెప్పలేమని పేర్కొన్నట్లు సర్వే పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మళ్లీ ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా 38శాతంమంది నో అని, 34శాతంమంది తప్పకుండా అని చెప్పారు. అంతేకాకుండా ముకుల్ సంగ్మా పనితీరుకు ప్రజలు మంచి మార్కులే వేశారు. 50శాతం మంది ఆయన బాగా పనిచేస్తున్నారని, 17 శాతంమంది పర్వాలేదని, 37 శాతం మంది సరిగా పనిచేయట్లేదని బదులిచ్చినట్లు సర్వే తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment