ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా జరిగిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం మేఘాలయలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం చేజారుతున్నట్టే కనిపిస్తోంది. త్రిపురలో పాతికేళ్లుగా పెట్టనికోటగా ఉన్న కమ్యూనిస్టు కంచుకోటను కూల్చి.. నాగాలాండ్‌లోని బలమైన ఉనికితో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న బీజేపీ.. మేఘాలయ కూడా కాంగ్రెస్‌కు చిక్కకుండా మంత్రాంగం నడుపుతోంది. హంగ్ ఫలితాలు వెలువడ్డ మేఘాలయలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఆ పార్టీ ఇంకా పది స్థానాల దూరంలో నిలిచింది. 60 స్థానాలు ఉన్న మేఘాలయాలో కాంగ్రెస్ 21 స్థానాలు గెలుపొందగా, ఎన్పీపీ 19 స్థానాలు సాధించింది. ఈ క్రమంలో కేవలం రెండు స్థానాలు గెలిచి.. తొలిసారి మేఘాలయ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న బీజేపీ.. ఇక్కడ తన పాచిక విసిరి.. కాంగ్రెస్ అధికారం దక్కకుండా తెరవెనుక చక్రం తిప్పుతోంది.
19 స్థానాలు గెలిచిన ఎన్‌పీపీ నేతృత్వంలో ఇతర పార్టీలనకు ఒకచోటకు చేర్చి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఎనిమిది స్థానాలు గెలిచిన యూడీపీ-హెచ్‌ఎస్‌డీపీ బీజేపీ ఏర్పాటుచేస్తున్న కూటమిలో చేరేందుకు ముందుకొచ్చింది. కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఆదివారం యూడీపీ చీఫ్ డాక్టర్ దొంకుపర్ రాయ్‌తో భేటీ అయి ఈమేరకు మంతనాలు సాగించారు. ఎన్‌పీపీ-యూడీపీ చేతులు కలుపడంతో బీజేపీ ఆకాంక్ష మేరకు మేఘాలయలో కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఎన్‌పీపీ కి చెందిన కోనార్డ్ సంగ్మా తదుపరి మేఘాలయ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నట్టు సమాచారం. గోవా, మణిపూర్ తరహాలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినప్పటికీ మరోసారి మేఘాలయాలో ఆ పార్టీకి అధికారపీఠం దూరం కానుండటం షాక్‌కు గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment