సాక్షి, షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండే స్థానాల్లో నెగ్గిన బీజేపీ అధికారాన్ని ఏ విధంగా కోరుకుంటుందని సీఎం ముకుల్ సంగ్మా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలే వారిని వద్దనుకున్న నేపథ్యంలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ పావులు కదుపుతుందన్నారు. ఇటీవల జరిగిన న్నికల్లో ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ బీజేపీ మాత్రం కొన్ని పార్టీలతో కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లీకులిస్తోంది. దీనిపై సీఎం ముకుల్ సంగ్మా రాజధాని షిల్లాంగ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.
'ఈ ఎన్నికల్లో మేఘాలయ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించంతో.. ప్రభుత్వ ఏర్పాటు అంశాలను గవర్నర్‌ను కలిసి చర్చించాను. స్థానిక పార్టీల అభ్యర్థులు, కొందరు స్వత్రంత్రుల మద్ధతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని గవర్నర్ కు తెలిపాను. కానీ 47 స్థానాల్లో పోటీచేసి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రావడం ఏ విధంగా సాధ్యమవుతుంది. స్థానిక రాజకీయ పార్టీల నెగ్గిన అభ్యర్థులను మభ్యపెట్టి ఎలాగైనా సరే మేఘాలయలో అధికారంలోకి రావాలని బీజేపీ అత్యాశకు పోతుందంటూ' సీఎం ముకుల్ సంగ్మా విమర్శించారు.
మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార కాంగ్రెస్ 21 స్థానాలు, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) 19 సీట్లు సొంతం చేసుకుంది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) ఆరు చోట్ల, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నాలుగు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్‌ఎస్‌పీడీపీ) రెండు చోట్ల గెలుపొందాయి. కేహెచ్‌ఎన్‌ఏఎం, ఎన్సీపీలు చెరొక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచాయి. యూడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment