Mukul Sangma
-
మేఘాలయలో కాంగ్రెస్‌కు ఝలక్!
న్యూఢిల్లీ: నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో తాజాగా తలబొప్పి కట్టింది. అసెంబ్లీలో పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం ముకుల్ సంగ్మాతోతో సహా ఏకంగా 12 మంది బుధవారం తృణమూల్ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ముకుల్ సంగ్మా కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. మేఘాలయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విన్సెంట్ హెచ్. పాలాను నియమించినప్పటి నుంచి ముకుల్ సంగ్మాకు ఆయనతో పొసగడం లేదు. తన అభిప్రాయానికి విలువివ్వకుండా విన్సెంట్ నియామకం జరిగిందనేది ఆయన కినుక. చివరకు సంగ్మా టీఎంసీ గూటికి చేరారు. 2023లో జరగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే టీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త, మమతా బెనర్జీకి సన్నిహితుడైన ప్రశాంత్ కిశోర్‌కు చెందిన బృందం కొంతకాలంగా షిల్లాంగ్‌లో మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తోంది. ఇప్పుడు ముకుల్ సంగ్మా చేరికతో టీఎంసీ ఒక్కసారిగా బలపడినట్లైంది. -
కర్ణాటక ఎఫెక్ట్: ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొన్ని నెలల కిందట ఎన్నికల అనంతరం అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తొలుత అతిపెద్ద పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గోవా కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను డిమాండ్ చేయగా... ఆపై మణిపూర్ మాజీ సీఎం ఇబోబి సింగ్, మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మాలు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిర్ణయంపై స్పందించారు. మాజీ సీఎంలు సైతం తమ రాష్ట్ర గవర్నర్లను కలుసుకుని ఈ విషయంపై చర్చించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మణిపూర్ గవర్నర్‌ను ఇబోబి సింగ్, మేఘాలయ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శుక్రవారం సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ల ఆధ్వర్యంలో రాజధానుల వద్ద, ఇతర నేతలు జిల్లా కలెక్టరెట్ల వద్ద ధర్నా చేసి తమ నిరసన తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నేతలను ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నేతలకు లేఖలు పంపిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా గవర్నర్ వజుభాయ్ వాలా నామినేట్ చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ నేత యడ్యూరప్ప బల నిరూపణ పూర్తవకుండా గవర్నర్ ఇలా ఎమ్మెల్యేను నామినేటెడ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గతేడాది మార్చిలో మణిపూర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకుగానూ కాంగ్రెస్ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 21 సీట్లు సాధించిన బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో పాటు ఒక లోక్ జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ బలం 32కి పెరిగింది. బీజేపీ నేత నాంగ్తోంబం బీరేన్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చింది. -
2 సీట్లు నెగ్గి అధికారంలోకా.. ఎలా..!
సాక్షి, షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండే స్థానాల్లో నెగ్గిన బీజేపీ అధికారాన్ని ఏ విధంగా కోరుకుంటుందని సీఎం ముకుల్ సంగ్మా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలే వారిని వద్దనుకున్న నేపథ్యంలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ పావులు కదుపుతుందన్నారు. ఇటీవల జరిగిన న్నికల్లో ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ బీజేపీ మాత్రం కొన్ని పార్టీలతో కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లీకులిస్తోంది. దీనిపై సీఎం ముకుల్ సంగ్మా రాజధాని షిల్లాంగ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 'ఈ ఎన్నికల్లో మేఘాలయ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించంతో.. ప్రభుత్వ ఏర్పాటు అంశాలను గవర్నర్‌ను కలిసి చర్చించాను. స్థానిక పార్టీల అభ్యర్థులు, కొందరు స్వత్రంత్రుల మద్ధతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని గవర్నర్ కు తెలిపాను. కానీ 47 స్థానాల్లో పోటీచేసి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రావడం ఏ విధంగా సాధ్యమవుతుంది. స్థానిక రాజకీయ పార్టీల నెగ్గిన అభ్యర్థులను మభ్యపెట్టి ఎలాగైనా సరే మేఘాలయలో అధికారంలోకి రావాలని బీజేపీ అత్యాశకు పోతుందంటూ' సీఎం ముకుల్ సంగ్మా విమర్శించారు. మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార కాంగ్రెస్ 21 స్థానాలు, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 19 సీట్లు సొంతం చేసుకుంది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) ఆరు చోట్ల, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నాలుగు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) రెండు చోట్ల గెలుపొందాయి. కేహెచ్ఎన్ఏఎం, ఎన్సీపీలు చెరొక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచాయి. యూడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. -
ఆ సీఎం రెండు చోట్లా ఘన విజయం
సాక్షి, షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంపాతి, సంగ్సక్ నియోజవర్గాల నుంచి బరిలోకి దిగిన సంగ్మా విజయకేతనం ఎగురవేశారు. సంగ్మా రెండు పర్యాయాలు సీఎంగా చేశారు. తొలిసారి 2010 ఏప్రిల్‌లో మేఘాలయ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ముకుల్ సంగ్మా 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. కానీ మేఘాలయలో హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ సూచనలు లేవు. మధ్యాహ్నం సమయానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 2 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్పీపీ 16 చోట్ల, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేఘాలయాలో ఫలితాలు బీజేపీకి మింగుడు పడటం లేదు. బీజేపీ ఇక్కడ కేవలం 4 స్థానాలు నెగ్గేలా కనిపిస్తోంది. కాగా, మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 47 మంది పోటీ చేసిన విషయం తెలిసిందే.