గరో హిల్స్‌లో ఓటేశాక సిరా గుర్తు చూపిస్తున్న మేఘాలయ సీఎం సంగ్మా, కుటుంబసభ్యులు
న్యూఢిల్లీ: దేశంలో కమ్యూనిస్టుల చివరి కంచుకోట కూడా కూలిపోబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. త్రిపురలో 1993 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 25 ఏళ్లుగా సీపీఎం ఒక్కటే అధికారంలో ఉంది. దేశంలో ప్రస్తుతం కమ్యూనిస్టులు ఇతరులతో పొత్తులేకుండా పాలిస్తున్న ఏకైక రాష్ట్రం త్రిపుర మాత్రమే. అయితే ఈసారి అక్కడ బీజేపీ పీఠమెక్కనుందని న్యూస్ ఎక్స్, మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. నాగాలాండ్‌లో కూడా బీజేపీయే స్వల్ప ఆధిక్యంతో గెలవచ్చని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి.
అయితే సీ–ఓటర్ సర్వే మాత్రం వీటికి భిన్నంగా ఉంది. త్రిపురలో కమ్యూనిస్టులు తమ అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉందంటోంది. త్రిపురలో ఈ నెల 18న, మేఘాలయ, నాగాలాండ్‌లలో మంగళవారం పోలింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల ఫలితాలూ ఈ శనివారం వెలువడనున్నాయి. మూడు రాష్ట్రాల శాసనసభల్లోనూ సమానంగా 60 సీట్లే ఉన్నాయి. అయితే త్రిపుర, మేఘాలయల్లో ఇద్దరు అభ్యర్థులు మృతి చెందడంతో, నాగాలాండ్‌లో ఒక స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నిక జరగడంతో మూడు రాష్ట్రాల్లో 59 సీట్లకే పోలింగ్ జరిగింది.
మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లను సాధిస్తుందనీ, కాంగ్రెస్ మాత్రం నాగాలాండ్, త్రిపురల్లో ఖాతానే తెరవక పోవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలోనూ త్రిపుర, మేఘాలయలకు సంబంధించి దాదాపుగా ఇవే ఫలితాలు వచ్చాయి.
త్రిపురలో...: త్రిపురలో న్యూస్ ఎక్స్ ప్రకారం బీజేపీ–ఐపీఎఫ్‌టీ (ఇండిజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమికి 35 నుంచి 45 సీట్లు, 51 శాతం ఓట్లు రానున్నాయి. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం బీజేపీ–ఐపీఎఫ్‌టీ కూటమికి 44–50 సీట్లు, 49 శాతం ఓట్లు వస్తాయి. అయితే సీ–ఓటర్ మాత్రం త్రిపురలో సీపీఎం, బీజేపీ కూటమిల మధ్య సీట్ల తేడా స్వల్పంగా ఉం టుందనీ, సీపీఎంకు 26–34, బీజేపీ కూట మికి 24–32 సీట్లు వస్తాయని చెబుతోంది.
మేఘాలయలో...: కాంగ్రెస్ అధికారంలో ఉన్న మేఘాలయలోనూ న్యూస్ ఎక్స్ ప్రకారం అత్యధికంగా ఎన్‌పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ)కి 23–27 సీట్లు రానున్నాయి. సీ–ఓటర్ ప్రకారం ఎన్‌పీపీకి 17 నుంచి 23 దక్కనున్నాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 30 సీట్లు వస్తాయంటోంది.
నాగాలాండ్‌లో...: నాగాలాండ్‌లో బీజేపీ–ఎన్‌డీపీపీ కూటమికి 27 నుంచి 32 సీట్లు వస్తాయని న్యూస్ ఎక్స్ చెబుతోంది. సీ–ఓటర్ ప్రకారం బీజేపీ కూటమికి 25 నుంచి 31 సీట్లు దక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment