బీజేపీ అసెంబ్లీ జాబితాలో చోటుదక్కని సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి, పరిపూర్ణానంద
పొత్తులో బీజేపీ పోటీచేసే పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు
వలస నేతలకే సీట్లు ఇచ్చారంటున్న పార్టీ అసలైన సీనియర్లు
తనకు నచ్చిన వారికి అనుకూలంగా పురందేశ్వరి నివేదికలు పంపారని ఆరోపణ
చంద్రబాబుకు అనుకూలురైన వ్యక్తులకే బీజేపీ టికెట్లు దక్కాయని మండిపాటు
ఒకరోజు ముందు పార్టీలో చేరిన టీడీపీ వ్యక్తికి బద్వేలు టికెట్
చంద్రబాబు నమ్మినబంట్లు సుజనాచౌదరి, కామినేనికి విజయవాడ పశ్చిమ.. కైకలూరు
సత్యకుమార్‌కు ధర్మవరం.. విష్ణుకుమార్‌రాజుకు విశాఖ నార్త్
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : పొత్తులో భాగంగా రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక మాజీ ఎంపీ, ఇద్దరు మాజీమంత్రులు, ఒక జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటుదక్కింది. కానీ, రెండు మూడు దశాబ్దాలకు పైగా పార్టీనే నమ్ముకున్న కొందరు ముఖ్యమైన సీనియర్లకు మాత్రం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తీవ్ర నిరాశే మిగిలింది.
మొన్న పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలోనూ టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి, పరిపూర్ణానంద స్వామికి కూడా ఈ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో రిక్తహస్తమే మిగిలింది. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలమన్న వ్యక్తులుగా పేరున్న నాయకులకు మాత్రం సీట్లు దక్కాయని అసలైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
నచ్చిన వారికి అనుకూలంగా పురందేశ్వరి నివేదికలు..
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తనకు నచ్చిన వలస నేతలకు.. నిన్న మొన్నటి వరకు పార్టీతో సంబంధంలేని వారికి టికెట్లు ఇప్పించుకున్నారని ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న అసలైన బీజేపీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాను అనుకున్న వారికి అనుకూలంగానే ఆమె జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపి వారికి టికెట్లు దక్కేలా చేసుకున్నారని వారు మండిపడుతున్నారు. నిజానికి.. బీజేపీ జాబితాలో బద్వేలు అభ్యర్థిగా ప్రకటించిన రోశన్న అభ్యర్థుల ప్రకటనకు ఒకరోజు ముందే పార్టీలో చేరారని వారు చెప్పారు.
అలాగే, రెండు మూడ్రోజుల క్రితం వరకు ఆయన టీడీపీ నియోజకవర్గ ప్రధాన నాయకుడిగా కొనసాగారని.. అసలు పొత్తులో బద్వేలు స్థానాన్ని బీజేపీ ఎందుకు కోరుకోవాల్సి వచ్చిందో.. టీడీపీ నేతను హడావుడిగా పార్టీలో చేర్చుకుని అతనికెందుకు సీటు ఇవ్వాల్సి వచ్చిందో రాష్ట్ర పార్టీలో చాలామందికి అంతుబట్టడంలేదు. ఇప్పుడు బీజేపీలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
నిజానికి.. చాలా నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బీజేపీ నాయకులు రెండు మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కష్టపడిన వారి స్థానాలను పట్టించుకోకుండా.. చంద్రబాబు ఇస్తామన్న స్థానాల్లో తనకు అనుకూలమైన వారి పేర్లను పురందేశ్వరి జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపారని వారు ఆరోపిస్తున్నారు.
పదిలో ఆరుగురు వలస నేతలే..
ఇక 2019 ఎన్నికలు వరకు తెలుగుదేశంలో ఉండి, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే తాత్కాలిక పునరావాసం కోసం బీజేపీలో చేరిన చంద్రబాబు సొంత మనుషులు సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి వంటి నాయకులు పొత్తులో బీజేపీకి దక్కిన స్థానాల్లో సీట్లు ఎగరేసుకెళ్లారని ఆ నాయకులు ఆవేదన చెందుతున్నారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు మరో నమ్మినబంటు కామినేని శ్రీనివాస్ సైతం 2014 ఎన్నికల సమయంలో బీజేపీ–టీడీపీ పొత్తు ఖాయమని తెలిశాక కమల దళంలో చేరి ఆ ఎన్నికల్లో గెలుపొందాక ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించారన్నారు.
అలాగే.. 2019లో టీడీపీ–బీజేపీ మధ్య పొత్తులేకపోవడంతో ఆయన తిరిగి బీజేపీ తరఫున పోటీచేసేందుకు విముఖత వ్యక్తంచేసి ఎన్నికలకు దూరంగా ఉన్నారని తాజాగా సీట్లు దక్కని బీజేపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఇక పార్టీ ప్రకటించిన పది స్థానాల్లో అరకు, అనపర్తి, విశాఖ పశ్చిమ స్థానాల అభ్యర్థులు మినహా మిగిలిన ఏడు స్థానాల అభ్యర్థులు కేంద్రంలో బీజేపీ అధికారం ఖాయమని స్పష్టంగా తెలిసిన తర్వాత పదేళ్ల క్రితం పార్టీలో చేరిన నాయకులని చెబుతున్నారు.
ధర్మవరం అభ్యర్థిగా ప్రకటించిన సత్యకుమార్ మొదట నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తి. అప్పట్లో ఆయన అసలు పార్టీ నాయకుడిగా పనిచేయలేదని, ఒకవేళ అతణ్ణి మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వ్యక్తిగా పరిగణించినా మిగిలిన ఆరుగురు వలస నేతలేనని బీజేపీలో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment