టీడీపీ రెండో జాబితా ప్రకటన వెలువడగానే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం
జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుపై సర్వత్రా ఆగ్రహావేశాలు
భగ్గుమన్న విభేదాలు...రోడ్డుకెక్కిన అసమ్మతి
పోటాపోటీగా టీడీపీ, జనసేన నాయకుల నిరసన జ్వాలలు
పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతానన్న పదినిమిషాలకే రచ్చరచ్చ
టీడీపీకి గండి బాబ్జీ రాజీనామా..!
భాష్యం ప్రవీణ్‌కు సీటు కేటాయించడంతో నిరాశలో కొమ్మాలపాటి.. బోడె ప్రసాద్‌కు సీటు లేదని తేల్చిచెప్పిన అధిష్టానం
మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్న బోడె మద్దతుదారులు
రంపచోడవరంలో శిరీషకు టికెట్ ఇవ్వడంపై నిరసన సెగలు.. కోసిగిలో నిరసన తెలిపిన తిక్కారెడ్డి అనుచరులు.. తిరుపతిలో ఆరణికి వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలు
కొవ్వూరులో ‘ముప్పిడి’ ఫ్లెక్సీలు చించేసిన ‘జవహర్’ వర్గీయులు
సాక్షి నెట్‌వర్క్: పొత్తులతో ఎన్నికల గోదారి ఈదాలన్న చంద్రబాబు ఎత్తుగడ టీడీపీ పుట్టి ముంచుతోంది. ఇప్పటికే మూడు గ్రూపులు ఆరు కుంపట్లుగా రచ్చ రచ్చగా ఉన్న టీడీపీ పరిస్థితి తాజాగా మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుతో పూర్తిగా రోడ్డున పడింది. చంద్రబాబు గురువారం తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ తమ్ముళ్లు అధినేతపై నిప్పులు చెరిగారు.
పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి డబ్బు మూటలతో దిగిన ప్యారాచూట్ నాయకులకు టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. పార్టీకోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కేవలం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై దుమ్మెత్తిపోశారు. టికెట్ల కేటాయింపులో మరోసారి పునరాలోచించాలని లేనిపక్షంలో పార్టీని ఓడించేందుకైనా వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్లెక్సీలు చించివేసి ర్యాలీలు నిరసనలు తెలిపారు. కొందరు నాయకులు రాజీనామాలు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్లపై టైర్లను కాల్చి ఆందోళనలు నిర్వహించారు. మొత్తంగా టీడీపీ రెండో జాబితా ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది.
పిఠాపురంలో అసమ్మతి సెగ
కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించిన పది నిమిషాలకే అక్కడ టీడీపీలో అసమ్మతి అగ్గి రగిలింది. మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు టికెట్టు నిరాకరించడంపై ఆ పార్టీ వర్గాలు పిఠాపురంలో గురువారం తీవ్ర స్థాయి ఆందోళనకు దిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద వర్మ అనుచరులు, ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ జెండాలు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పత్రికలు తగులబెట్టారు.
వర్మకు టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి, రెబల్‌గా పోటీ చేయిస్తామని గతంలోనే వారు ప్రకటించారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోపోతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలు సైతం పట్టుకోబోమని ఇటీవల చెప్పారు. తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామంటూ సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకటనతో భగ్గుమన్న టీడీపీ నేతలు చంద్రబాబును, పవన్ కళ్యాణ్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు.
ఇప్పటి వరకూ సీటు వర్మదే అంటూ నమ్మబలికిన చేతకాని లోకేశ్ ఇప్పుడు మాట మార్చి తమను మోసం చేశాడంటూ పలువురు మహిళా నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల్లో క్యాడర్‌తో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు. పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకూ సేవ చేస్తే తనకు కాకుండా ఎవరో స్థానికేతరుడికి సీటు కేటాయించడం దారుణమంటూ పవన్ కల్యాణ్‌ను స్థానికేతరుడని పరోక్షంగా విమర్శించారు. తాను స్థానికుడినని పవన్ స్థానికేతరుడని చెబుతూ ఎవరి కోసమో తన సీటును బదలాయించడం చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు.
కొవ్వూరులో జవ‘హరీ’
టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు అధిష్టానం మొండిచెయ్యి చూపించింది. కొవ్వూరు టికెట్టు తనకే కేటాయిస్తారని ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న ఆయనకు పరాభవం తప్పలేదు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్టు ఖరారు చేయడం ఆయన కంగు తిన్నారు. కొవ్వూరులోని జవహర్ నివాసానికి ఆయన వర్గీయులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నారు. చంద్రబాబుతో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేసి నిరసన తెలిపారు. కొవ్వూరు సహా 175 స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమంటూ పలువురు టీడీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. సీటు దక్కకపోవడంతో జవహర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. కనీసం జిల్లాలో ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తారన్న ఆశ కూడా పోయింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. టికెట్‌పై ఎటువంటి సానుకూల స్పందనా రాకపోవడంతో జవహర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అనంతరం జవహర్ మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించడం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. గత ఎన్నికల్లో గోపాలపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు చేతిలో ఘోర ఓటమి పాలైన ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్టు ఖరారు చేసిన అధిష్టానంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రకటించిన తొలి రోజే గ్రూపు రాజకీయాలు భగ్గుమనడం, జవహర్ వర్గీయులు నిరసనలకు దిగడంతో టీడీపీ శ్రేణుల్లో అయోమయంలో పడ్డారు. టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబు, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకష్ణలు చంద్రబాబును మంగళవారం రాత్రి కలిసి, అభ్యర్థిని ఖరారు చేశారు. డబ్బు మూటలకు అధిష్టానం అమ్ముడుపోయిందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు నాయకులు ఇప్పటికే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు.
భగ్గుమన్న కొమ్మాలపాటి వర్గం
పల్నాడు జిల్లా పెదకూరపాడు స్థానం భాష్యం ప్రవీణ్‌కు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. టికెట్ కొమ్మాలపాటికే కేటాయిస్తారని ముందుగా గుంటూరులోని ఆయన నివాసానికి గురువారం ఉదయం అనుచరులు భారీగా చేరుకుని స్వీట్లు, బాణసంచా సిద్ధం చేసుకున్నారు. చివరికి టికెట్ భాష్యం ప్రవీణ్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కొమ్మాలపాటి శ్రీధర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు.
ఈ సమయంలో భాష్యం ప్రవీణ్ కొమ్మాలపాటి ఇంటికి చేరుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అచ్చంపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రవీణ్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించకముందే నియోజకవర్గంలో ప్లెక్సీలు, వాల్‌పోస్టర్లుతో హడావుడి ఎందుకు చేశారు అని ప్రశ్నించారు? స్థానికేతరుడు అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రవీణ్ కూడా టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మీకెందుకు ఏమైనా ఉంటే మేము మేము చూసుకుంటాం..
మీరెవ్వరు అంటూ గట్టిగా అరవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. టికెట్ దక్కకపోవడం పట్ల కొమ్మాలపాటి తన ముఖ్య అనుచరుల వద్ద జరిగిన అన్యాయంపై వాపోయారట. వరుసగా నాలుగు పర్యాయాలు పెదకూరపాడులో టీడీపీ ఓడిపోతూ అభ్యర్థులు కరువైన సమయంలో 2009లో అభ్యర్థిగా పోటీ చేసి గెలిచానని, పార్టీ కోసం 18 సంవత్సరాలు కష్టపడితే ఇదేనా నాకు దక్కిన గౌరవం అంటూ ఆవేదన చెందారట. పార్టీ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసినా చంద్రబాబు కనీసం పిలిచి మాట్లాడకపోవడం అన్యాయమన్నారట. నియోజకవర్గ ప్రజలకు కతజ్ఞతలు తెలిపి శ్రీధర్ హైదరాబాద్ వెళ్లిపోయారు.
పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ
కష్ణా జిల్లా పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ తార స్థాయికి చేరింది. అక్కడ టీడీపీ ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌కు సీటు నిరాకరించడంపై ఆ పార్టీ శ్రేణులు అధిష్టానాన్ని దుమ్మెత్తి పోశాయి. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల పార్టీ అధ్యక్షులు నుంచి బూత్ కన్వినర్ల వరకూ రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశాడు. సీటు బోడెకు కాని పక్షంలో స్థానికులకు ఇవ్వాలని, దిగుమతి నేతలను ఒప్పుకునేది లేదంటున్నారు. చంద్రబాబు కుటుంబం మినహా వేరెవరు పోటీ చేసినా తాను కూడా పోటీ చేస్తానని కరాఖండీగా చెప్పారు.
ఈ విషయంపై అధిష్టానంతో తేల్చుకుందామని శ్రేణులకు సూచించారు. తాను టీడీపీ పార్టీకి ఎనలేని కషి చేశానని, తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వనందున టీడీపీ బీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఐవీఆర్‌ఎస్ సర్వేలో తనకు అనుకూలంగా ఉన్న టికెట్ ఇవ్వకుండా ఎందుకు నిరాకరించారో తెలియటం లేదన్నారు. నాలుగున్నర ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలు అన్ని విజయవంతం చేశానని, తనను మేకను బలిచ్చినట్లు బలిస్తే ఊరుకునేది లేదన్నారు.
తనను టీడీపీ బహిష్కరించినా చంద్రబాబునాయుడు ఫోటో పెట్టుకోని టీడీపీ బీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. చివరి వరకు చంద్రబాబు, లోకేశ్ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని అన్నారు. సీటు తనకే వస్తుందన్న ధీమాతో ఉన్న బోడెకు సీటు లేదని అధిష్టానం తేల్చిచెప్పేసింది. బోడె ఇసుక అక్రమ తవ్వకాలు, మట్టి విక్రయాలను ప్రోత్సహించారనే అభియోగాలున్నాయి. దొంగ పరీక్ష కేసులు, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ విమర్శలు బురదలా అంటుకున్నాయి. వీటికి తోడు కార్యకర్తలను కలుపుకుని వెళ్లటంలో వైఫల్యం చెందారన్నది మరో కారణం. ప్రధానంగా పార్టీలో నెలకొన్న వర్గపోరు గెలుపు ఓటములపై ప్రభావం పడుతుందని టీడీపీ అధిష్టానం గుర్తించింది. మిత్రపక్షమైన జనసేనలోని వర్గాలతోనూ సఖ్యత లేదన్న ప్రచారం లేకపోలేదు.
పెందుర్తిలో కార్యకర్తల తీవ్ర నిరసన
పెందుర్తిలో బండారుకు టీడీపీ టికెట్ కేటాయించకపోవడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో వెన్నలపాలెంలోని బండారు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తామని ప్రకటించారు.
తీవ్ర మనస్తాపంలో గండి బాబ్జీ
విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బాబ్జీ విశాఖ దక్షిణ లేదా మాడుగుల నుంచి టికెట్ ఆశించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం, మాడుగుల టికెట్‌ను తెలుగుదేశం పార్టీ పైల ప్రసాద్‌కు కేటాయించడంతో గండి బాబ్జీకి అవకాశం దక్కలేదు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం.
రంపచోడవరంలో ఆగ్రహ జ్వాలలు
రంపచోడవరం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీషాదేవి పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా పైరవీలు చేసిన వారికి టికెట్ ఇవ్వడం అన్యాయమని వారంతా ధ్వజమెత్తారు. గురువారం రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నివాసంలో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. అనంతరం వంతల రాజేశ్వరికి టీడీపీ టికెట్ ఇవ్వాలని రోడ్డుపై నిరసనకు దిగారు.
టికెట్ విషయంలో నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా ఆమెకు టికెట్ ఏవిధంగా ఇచ్చారని మండిపడ్డారు. ఐదేళ్లపాటు కష్టపడి తిరిగిన వంతల రాజేశ్వరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థి ఎంపికలో టీడీపీతో సంబంధం లేని మాజీ ఎంపీ పెత్తనమేంటని వారు ధ్వజమెత్తారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి న్యాయం జరగదు అనడానికి ఈ పరిణామమే ఒక ఉదాహరణ అన్నారు. పార్టీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు వంతల రాజేశ్వరి నాయకత్వంలో పార్టీ శ్రేణులు శుక్రవారం విజయవాడ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
టికెట్ విషయంలో మార్పు లేకపోతే పార్టీ కోసం పనిచేసేది లేదని వారు బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు శిరీషా దేవి పేరు ప్రకటించిన వెంటనే రంపచోడవరం నుంచి గెద్దాడ వరకు ఉన్న ఆమె ఫ్లెక్సీలను కొంతమంది చింపేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్ స్తబ్ధతగా ఉన్నారు. వీరు టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
బీసీలకు చంద్రబాబు ద్రోహం
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయుల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంటోంది. పదిరోజులుగా ఆందోళనలతో నిరసనలు వ్యక్తం చేస్తున్న శంకర్ వర్గం టీడీపీ శ్రేణులు గురువారం చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో గళమెత్తారు. నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట, పెద్దమండ్యం మండలాల్లో రోడ్లపైకి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై మండిపడ్డారు. రోడ్లపై రాస్తారోకోలు నిర్వహించి అభ్యర్థి జయచంద్రారెడ్డిని తప్పించాలని, శంకర్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.
బీసీలపై మాటలకే పరిమితమని చంద్రబాబు నిర్ణయం బట్టి స్పష్టమైందని నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు పార్టీకోసం శ్రమించిన శంకర్‌ను నమ్మించి నట్టేట ముంచేసిన చంద్రబాబు తప్పును సరిదిద్దుకోవాలని కోరారు. లేనిప„ýక్షంలో తంబళ్లపల్లెలో టీడీపీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడిచిత్తూరుజిల్లాలో ఉన్న ఏకైక బీసీ నాయకుడు శంకర్‌కు టికెట్ లేకుండా చేయడం బీసీలకు ద్రోహం చేయడమేనని ప్రశ్నించారు.
సర్వేల్లో పదిశాతానికి మించి మద్దతు పొందని జయచంద్రారెడ్డిని ఎలా ఎంపిక చేసారని నిలదీశారు. బీసీలకు న్యాయం చేసేలా శంకర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోతే పార్టీని ఓడించి సత్తా చాటుతామని హెచ్చరించారు. పోల్ మేనేజ్‌మెంట్ కన్వినర్ కుడుం శ్రీనివాసులు, పెద్దమండ్యం మండల కన్వినర్ జిట్టా వెంకటరమణ, పెద్దతిప్పసముద్రంలో కట్టా సురేంద్రనాయుడు, ఈశ్వరప్ప, కురబలకోటలో లక్ష్మణ్, తిమ్మయ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి.
రగులుతున్న మంత్రాలయం
మంత్రాలయం టికెట్ తిక్కారెడ్డికి కాకుండా ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఎన్.రాఘవేంద్రరెడ్డికి ప్రకటించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోసిగి మండల కేంద్రంలో తిక్కారెడ్డి అనుచరులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. పన్నెండేళ్లు శ్రమించినా తిక్కారెడ్డికి టిక్కెట్ కేటాయించలేదని వారు వాపోతున్నారు. టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. చంద్రబాబు నిర్ణయంపై అనుచరవర్గం మండిపడుతున్నారు.
బాలనాగిరెడ్డి టీడీపీని వీడిన తర్వాత పార్టీకి నాయకత్వం కరువైన సమయంలో తిక్కారెడ్డి పార్టీ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ క్యాడర్, కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ కోసం శక్తివంచన లేకుండా శ్రమించారు. దాదాపు 12 ఏళ్లుగా పార్టీ మనుగడకు తనవంతు కృషి చేశారు. 2019 ఎన్నికల్లోనూ ఖగ్గల్ గ్రామంలో ప్రవేశించగా సొంత గన్‌మెన్ల కాల్పుల్లో కాలితొడ భాగంలో బుల్లెట్లు దిగి గాయపడ్డారు. స్ట్రెచర్ పైనే ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు మొండి చేయి ఎదురవడంతో పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు.
తిరుపతిలో లోకల్.. నాన్ లోకల్ వార్!
రెండు రోజుల క్రితం తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్లు పవన్ కళ్యాణ్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ పరిణామాన్ని తిరుపతి టీడీపీ, జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరుకు చెందిన నాన్ లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సీటు ఇవ్వడానికి వీల్లేదంటున్నారు.
ఆరు నెలల కిందటే జనసేనతో పొత్తు ఉంటుందన్న సమాచారంతో తిరుపతి సీటును జనసేనకే కేటాయిస్తారనే అంచనాలు మొదలయ్యాయి. అయితే తిరుపతిలో అధికార పార్టీ అభ్యర్థిని జనసేన నాయకులు ఢీ కొనలేరన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ పరిస్థితుల్లో తిరుపతి సీటు టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఈలోపు సీట్ల సర్దుబాటు జరగడంతో తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు.
ఎలాగైనా చిత్తూరు నుంచే పోటీ చేయాలని భావించిన ఆరణి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ టికెట్ నిరాకరించడంతో జనసేన కండువా కప్పుకుని తిరుపతి టికెట్ కోసం భారీగా ముడుపులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పవన్ ఆరణిని తిరుపతి జనసేన అభ్యర్థిగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ, జనసేన నాయకులు ఏకమై జనసేన అధినేతకు హెచ్చరికలు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment