సాక్షి, తిరుపతి: ‘పరిషత్’ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించడమంటే తమ గొయ్యి తాము తవ్వుకున్నట్టేనని పనబాక తన అనుచరుల వ ద్ద వాపోతున్నారని సమాచారం. చంద్రబాబు నిర్ణ యం వల్ల ఈ నెల 17న జరగనున్న తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీకి పడే సానుభూతిపరుల ఓట్లు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలోనూ పనబాక లక్ష్మి నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘మీరు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించినట్టే.. నన్ను కూడా పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికను బహిష్కరించమంటారా సార్’ అని పనబాక లక్ష్మి చంద్రబాబును కడిగేశారని సమాచారం. చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మి ఉప ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో పనబాక లక్ష్మి ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు, ఓ మాజీ ఎమ్మెల్యే సైతం ఎంపీ అభ్యర్థి పనబాకను సమర్ధించినట్టు భోగట్టా. అనేక మంది నాయకులు చంద్రబాబుకు ఫోన్‌చేసి పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంపై నిలదీయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కమల దళంలోనూ ఆందోళన
మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల రాజకీయ తెరపై రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీనీ కలవరపెడుతున్నాయి. ఇక్కడ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రత్నప్రభ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నవతరం పార్టీ అభ్యర్ధికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఇది జనసేన పార్టీ గుర్తు కావడంతో జనసేన, బీజేపీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పోలింగ్ రోజున జనసేన అభిమానులు గాజు గ్లాస్ గుర్తును చూసి దానికి ఓటేస్తారేమోనని భయపడుతున్నారు. మరోవైపు తాజాగా చోటు చేసుకున్న మరో పరిణామం టీడీపీ నేతలనూ కలవరపెడుతోంది. జనసేన నేతలు కొందరు ఉప ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేలా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తరుణంలో టీడీపీకి పడే ఓట్లు కూడా గాజు గ్లాస్ గుర్తుకు పడే అవకాశముందనే ఆందోళన ఆ పార్టీని వెంటాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment