అంధకారంలో గ్రామాలు
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె కారణంగా సీమాంధ్ర జిల్లాలోని అనేకగ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అనంతపురం జిల్లాలోని 1200 గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 24 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో 150 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఈ గ్రామాల ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 250 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి.
వాటిలో 80 గ్రామాలు 36 గంటలకు పైగా అంధకారంలోనే ఉన్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఈ జిల్లాల పరిధిలో 12,500 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. చాలా మటుకు విద్యుత్ ఫీడర్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని మరమ్మతు చేసే దిక్కులేక వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఒక్క కృష్ణాజిల్లాలో 120కి పైగా బ్రేక్ డౌన్ (అంతరాయం) ఏర్పడి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 90 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరు జిల్లాల్లోని డిస్కంలకు మరో రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వైఎస్సార్ జిల్లా కడపలో 220 కేవీ ప్రధాన సబ్‌స్టేషన్ దెబ్బతినడంతో విద్యుత్‌ను పునరుద్ధరించలేక పోయినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని యూనిట్లు పునరద్దరణకు నోచుకోలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయం సబ్‌స్టేషన్ నుంచి చీలకలడోణకు వెళ్లే 33/11కేవీ ఫీడర్ లైనులో బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తింది. దీంతో పలు గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. జిల్లాలోని ఆరు ఫీ డర్లలో 60 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ సత్యనారాయణతెలిపారు. ఆదివారం సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడతామన్నారు.
అంధకారంలో శ్రీశైలం
జెన్‌కో, ట్రాన్స్‌కో ఉద్యోగులు మూడు గంటల పాటు విధులు బహిష్కరించడంతో శ్రీశైలంలో అంధకారం నెలకొంది. శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి 9గంటల వరకు శ్రీ శైలం క్షేత్రం, ప్రాజెక్టు కాలనీలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వారంతపు రోజులు కావడంతో శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.