విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత
ఇద్దరు సీమాంధ్ర అధికారుల అరెస్ట్.. బెయిల్
తెలంగాణ ఉద్యోగిపై దాడి చేశారంటూ డీఈలపై ఫిర్యాదు
అరెస్ట్ చేసిన పోలీసులు.. సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
కోర్టులో హాజరుపరిచాక బెయిల్‌పై విడుదలైన డీఈలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని సచివాలయం, విద్యుత్‌సౌధలు సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు శుక్రవారం కూడా పోటాపోటీగా నిరసనలు కొనసాగించారు. విద్యుత్‌సౌధలో ఇద్దరు సీమాంధ్ర అధికారులను అరెస్ట్ చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. జెన్‌కో డీఈలు సోమశేఖర్, ప్రభాకర్ తెలంగాణ ఉద్యోగిపై దాడి చేశారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిద్దరినీ శుక్రవారం అరెస్ట్ చేశారు. జెన్‌కో ఎండీ విజయానంద్‌తో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఎండీ అనుమతి లేకుండా కార్యాలయంలో ఉన్నప్పుడే అరెస్టు చేయటం ఏమిటని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది.
వారిద్దరి అరెస్ట్‌ను నిరసిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగటంతో విద్యుత్‌సౌధలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరెస్ట్ చేసిన ఇరువురిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్‌పై విడుదలై తిరిగి విద్యుత్‌సౌధకు చేరుకున్నారు. తాము నిరసన తెలిపే ప్రదేశానికి తెలంగాణ ఉద్యోగులు వచ్చి రెచ్చగొడుతున్నారని విద్యుత్‌సౌధ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ అనురాధ ఆరోపించారు. వారం కిందట ఇద్దరు వ్యక్తుల మధ్య ఘటన జరిగితే ఇరు ప్రాంతాల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారని తప్పుపట్టారు.
సచివాలయంలో పోటాపోటీ నిరసనలు: సచివాలయంలో శుక్రవారం కూడా సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. సీమాంధ్ర ఉద్యోగులు వరుసగా 30వ రోజూ నిరసన ప్రదర్శన చేపట్టారు. వచ్చే నెల 2 నుంచి సమ్మె తథ్యమని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యోగులు కూడా ఎల్ బ్లాక్ వద్ద ధర్నా చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దని కోరారు.
ఆర్ అండ్ బీ కార్యాలయంలో: ఎర్రమంజిల్ కాలనీలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు 30 మంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో జై తెలంగాణ నినాదాలతో నిరసన తెలిపారు. పంచాయితీరాజ్ కార్యాలయంలో పంచాయితీరాజ్ అండ్ ఆర్‌డబ్ల్యూఎస్ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించారు.