సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళనలు, అనుమానాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కోరారు. వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్థాయి అధికారి ఇరు ప్రాంతాల ఉద్యోగులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరెన్ని చెప్పినా విభజన నిర్ణయం జరిగిపోయిందని, ఇక వెనక్కు తిరిగే పరిస్థితి లేనేలేదని ఉద్ఘాటించారు. విభజన ఆగుతుందని ఎవరైనా అనుకుంటే పగటి కల కన్నట్లేనని చెప్పారు.
ఆయన మంగళవారం సాయంత్రం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈనెల 7న ఏపీఎన్జీవోలు ఎల్బీస్టేడియంలో సభ పెడతామని నోటీస్ ఇచ్చారు. దానికి ఎదురుగా నిజాం కళాశాల మైదానంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని టీఎన్జీవోలు చెబుతున్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని వాళ్ల ఆందోళనలో నిజమెంత? వాటిని అధిగమించేందుకు చేపట్టే చర్యలను వివరించాల్సిన అవసరం ఉంది’’అని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి రాష్ట్ర విభజన అంశం ఏ వర్గాలకు సంబంధించిన అంశమే కాదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కొంతవరకు దీనితో సంబంధం ఉందన్నారు.
విడిపోతే నిబంధనల మేరకు సీమాంధ్ర ఉద్యోగులు కొత్త రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుందని, అయితే పదేళ్లు ఉమ్మడి రాజధానిలోనే కొనసాగే అవకాశమున్నందున అప్పటికి చాలా మంది రిటైర్ అవుతారని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనలను నివృత్తి చేసేందుకు హోంశాఖ జోక్యం చేసుకుంటేనే మేలని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు, వర్గాలతో మాట్లాడిన తరువాతే హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఇతర పార్టీలు లేఖలు ఉపసంహరించుకున్నా విభజన ఆగే ప్రసక్తే లేదని చెప్పారు. విభజన నిర్ణయం జరిగినప్పటికీ సోనియాగాంధీ, కాంగ్రె స్ పార్టీ పెద్దలు సీమాంధ్ర ప్రాంతానికి చాలా గొప్ప ప్యాకేజీ ఇస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం, పీసీసీ చీఫ్ విభజనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందా? అని ప్రశ్నించగా... ‘‘విభజన నిర్ణయం అమలులో ఎక్కడైనా ఆటంకం కలిగిందా? ఇక రాష్ట్రపతి పాలనకు ఆస్కారమెక్కడిది? ఒకవేళ మీరు చె ప్పినవాళ్లకు బాధ్యతను అప్పగిస్తే... దానిని అమలు చేయనప్పుడు కదా, మనం మాట్లాడుకోవాల్సింది. కేంద్రం క్లియర్‌గా ఉంది. రోడ్‌మ్యాప్‌ను అమలు చేస్తోంది. ఎక్కడా ఆటంకం లేదు’’అని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలను నివృత్తి చేయాలి
Published Wed, Sep 4 2013 6:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement