సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సమ్మె జరుగుతున్న సీమాంధ్ర జిల్ల్లాల్లోని మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ 2వ తేదీన జీతాలు రావు. చిరుద్యోగులు వినాయక చవితికి ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సీమాంధ్ర జిల్లాల్లో అటెండర్ల నుంచి అధికారుల స్థాయి వరకు సమ్మెలో ఉన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి అధికారులే పనిచేస్తున్నారు. జీతాలకు సంబంధించి, ఖజానా కార్యాలయాలకు బిల్లులు రాలేదు. ఖజానా కార్యాలయాలు, 92 ఉప ఖజానా కార్యాలయాలు ఆగస్టు 13 నుంచి మూతబడడంతో ఈ పరిస్థితి నెలకొంది.
జీతాలకోసం ఒకవేళ ఎవరైనా బిల్లులు సమర్పించినా వాటిని పాస్ చేసి బ్యాంకులకు పంపించే వారు కూడా లేరు. సమ్మె కారణంగా, ఆగస్టు 13 నుంచి -నో వర్క్ నో పే- నిబంధన అమలవుతున్నా, 13వ తేదీకంటే ముందు పనిచేసిన 12 రోజుల కాలానికి కూడా ఉద్యోగులకు జీతాలు అందే పరిస్థితి లేదు. అయితే ఈ జిల్లాల్లో పెన్షనర్లకు మాత్రం ఎప్పటిలా నెలసరి పెన్షన్ అందనుంది. గత నెలలో ఇచ్చినంత పెన్షన్‌ను, పెన్షనర్ల అకౌంట్లకు జమ చేయాలని, ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులను ఆదేశించింది. ఇక సీమాంధ్ర జిల్లాల్లో పోలీసులకు, న్యాయ విభాగాల సిబ్బందికి, అధికారులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సోమవారం జీతాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఖజానా ప్రధాన కార్యాలయం ద్వారా బిల్లులు పాస్ చేయించి సోమవారం అకౌంట్లలో జీతాలు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
సీమాంధ్రలో సిబ్బందికి రేపు జీతాలు రావు
Published Sun, Sep 1 2013 3:40 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement