సమ్మెలోనే ఉద్యోగులు.. రెండో నెలా జీతాల్లేవు
సీమాంధ్ర జిల్లాల్లో మూడున్నర లక్షల మంది ఉద్యోగులు సమ్మెలోనే
జీతాల బిల్లులు సమర్పించని ఉద్యోగులు.. దృష్టంతా ఉద్యమంపైనే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె చేస్తున్న మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రెండోనెల కూడా వేతనాలు రాలేదు. దీంతో చిరు, మధ్యతరగతి ఉద్యోగుల కుంటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఈనెల దసరా పండుగ కూడా ఉండడంతో జీతాల అకౌంట్ ఉన్న బ్యాంకులను ఆశ్రయించి వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చిన్న, మధ్య తరగతికి చెందిన లక్షన్నర మంది ఉద్యోగులు తమ వేతనాల అకౌంట్ ఉన్న బ్యాంకులను ఆశ్రయించి 18 శాతం వడ్డీపై ఒక నెల వేతనాలను వ్యక్తిగత రుణంగా తీసుకున్నట్లు సీమాంధ్ర ఉద్యోగƒ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాల అకౌంట్లు తమ వద్ద ఉండటంతో బ్యాంకులు కూడా నెల వేతనాన్ని వ్యక్తిగత రుణంగా మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని ఉద్యోగులు చె బుతున్నారు.
పది లేదా 12 వాయిదాల్లో తిరిగి చెల్లించేలా ఈ రుణాలను ఉద్యోగులు పొందుతున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ఉద్యోగులు జీతాలు తీసుకోకుండా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని ఉద్యోగులందరూ సమ్మెలో పాలుపంచుకుంటున్నారు. జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా ట్రెజరీ డిప్యుటీ డెరైక్టర్లు కూడా గతనెల 23 నుంచి సమ్మెలోకి వెళ్లడంతో 13 జిల్లాల ఖజానా కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
జీతాల కోసం ఖజానా కార్యాలయాలకు బిల్లులను కూడా సమర్పించలేదు. ఆగస్టు 13 నుంచి సమ్మెలో ఉన్నందున నో వర్‌క నో పే అమలుచేసినప్పటికీ అంతకుముందు పనిచేసిన 12 రోజులకు కూడా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఇందుకు కారణం ఉద్యోగులెవరూ బిల్లులను సమర్పించకపోవడమే. అయితే, ఈ జిల్లాల్లో పెన్షనర్లకు మాత్రం పింఛన్ సొమ్ములు అందేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ జిల్లాల్లోని పెన్షనర్లకు ఒకట్రెండు రోజుల్లో పింఛన్ సొమ్ము అందనుంది. ఇక విధుల్లో ఉన్న సీమాంధ్ర జిల్లాల్లోని పోలీసు, న్యాయ విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులకు హైదరాబాద్‌లోని ప్రధాన ఖజానా కార్యాలయం ద్వారా జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.