సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శనివారంనాడు వేతనాలు అందనున్నాయి. వారం రోజుల ముందుగానే వారి చేతికి వేతనం లభించనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో... మే మాసం వేతనంతోపాటు, జూన్ ఒకటో తేదీ వేతనాన్ని కూడా కలిపి ఇవ్వనున్నారు. అలాగే పెన్షనర్లకు కూడా పెన్షన్ మొత్తాన్ని వారి అకౌంట్లలో పడనుంది. వేతనంతోపాటు ఈసారి కరువుభత్యం కలిపి చెల్లించనున్నారు. మే 24 తరువాత అపాయింటెడ్ డే జూన్ రెండో తేదీవరకు మరే రకమైన చెల్లింపులు చేయరాదని ఇదివరకు నిర్ణయించిన సంగతి విదితమే.
రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తరువాత.. ఏ రాష్ట్రంలో పనిచేసే సిబ్బందికి ఆ రాష్ట్రమే వేతన భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు కూడా చెల్లించాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను శనివారంనాడు చెల్లించాలని కూడా ఆర్థిక శాఖ నిర్ణయించిన విషయం విదితమే. కాగా.. ఉద్యోగులకు సంబంధించి సమాచారం అప్‌లోడ్ చేసిన దరిమిలా.. దాదాపు యాభైవేల మంది ఉద్యోగుల సమాచారం ఆర్థిక శాఖకు చేరని విషయం తెలిసిందే.
కేంద్రానికి ఉద్యోగుల వివరాలు...
స్థానికత ఆధారంగా ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపునకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడానికి అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు పనిచేశారు. ఈ కేటాయింపు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగులను జనాభా దామాషా ఆధారంగా 58.32 శాతం సీమాంధ్రకు, 41.68 శాతం ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించారా? లేదా? అన్న అంశాలను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం అధికారులు పరిశీలించిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేలా సదరు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం.