యూపీఏ నిర్లక్ష్యం వల్లే.. | Venkaiah Naidu lashes out against Congress president Sonia Gandhi | Sakshi
Sakshi News home page

యూపీఏ నిర్లక్ష్యం వల్లే..

Published Thu, Jun 5 2014 1:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

యూపీఏ నిర్లక్ష్యం వల్లే.. - Sakshi

యూపీఏ నిర్లక్ష్యం వల్లే..

  • కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శ
  •   రాష్ట్ర విభజనపై రెండు మూడేళ్ల ముందే నిర్ణయం తీసుకోవాల్సింది
  •   సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సింది
  •   పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలన్నీ మా ప్రభుత్వం నెరవేరుస్తుంది
  •  
     సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై రెండు మూడేళ్ల క్రితమే నిర్ణయం తీసుకుని, తద్వారా తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపేందుకు చొరవ చూపాల్సిందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చాలా ఆలస్యంగా చొరవ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడ తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అమలు కోరుతూ ఏఐసీసీ అధ్యక్షురాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. అభివృద్ధిలో కలసి పనిచేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆలస్యంగానైనా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్న సవాళ్లు, ఏర్పడిన ఇబ్బందులు గుర్తించినందుకు సంతోషం. ఈ మాత్రం ఆలోచన  ముందే ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఈ చొరవ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉండి ఉంటే బావుండేది. కాలయాపన చేసి చివరి క్షణంలో విభజన చేయకుండా ముందే ఈ ప్రక్రియ చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. కాంగ్రెస్‌కు కూడా ఏపీలో ఈ పరిస్థితి దాపురించేది కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయి. 
     
    రాష్ట్ర విభజనపై రెండు మూడేళ్ల ముందే స్పష్టమైన వైఖరి తీసుకుని, దాని ఫలితంగా ఏర్పడే పరిస్థితులను గుర్తించి సరిదిద్దేందుకు.. సీమాంధ్రలో సమాంతరంగా కొన్ని విద్య, వైద్య, విజ్ఞాన, సాంకేతిక సంస్థలు ఏర్పాటు చేసి ఉండాల్సింది. విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు, రెవెన్యూ లోటు లేకుండా, నీటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆగ్రహం ఉండేది కాదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పట్ల నిరాసక్తత ఉండేది కాదు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ముందు ఇప్పుడు పెద్ద ఎత్తున రెవెన్యూ లోటు ఉంది. అలాగే పారిశ్రామికీకరణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పన్నుల మినహాయింపు, ప్రత్యేక హోదా, ప్రత్యేక రాజధాని నిర్మాణం.. కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు. యూపీఏ ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందు చూపు లేని విధానం, అపరిపక్వ వ్యవహారం వల్ల ఈ పరిస్థితి సంభవించింది. అనేక సమస్యలు ఉన్నాయని అప్పుడే బీజేపీ చెప్పింది. 
     
    చట్టంలో అన్నీ పొందుపరచాలని కోరాం. ప్రణాళికా సంఘ ఆమోదం కూడా తీసుకోమన్నాం. ఆ పని చేయలేదు. అలాగే ప్రత్యేక రాష్ట్ర హోదా ముందే జారీచేసి ఉండాల్సింది. పోలవరంపై ఆర్డినెన్స్ తెస్తామన్నారు.. కానీ తేలేదు..’ అని వెంకయ్యనాయుడు విమర్శించారు. ‘కాంగ్రెస్ రెండు చోట్ల దెబ్బతినడానికి కారణం విశ్వసనీయత లేకపోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం. అందుకే రెంటికీ చె డ్డ రేవడి లా తయారైంది..’ అని ఎద్దేవా చేశారు.
     
     హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం..
     ‘కాంగ్రెస్ ఉత్తరం రాసినా రాయకపోయినా మా ప్రభుత్వానికి, మా ప్రధానికి బాధ్యత తెలుసు. ఈ విషయంలో మేం ఇప్పటికే చొరవ తీసుకున్నాం. నేను అన్ని మంత్రిత్వ శాఖలకు తగిన సూచనలు ఇచ్చాను. లేఖలు రాశాను. పాత ప్రధాని హామీలు ఇచ్చిన విషయం గుర్తుచేశాను. చట్టంలో ఉన్న అంశాలను గుర్తుచేశాం. వ్యక్తిగతంగా కూడా మాట్లాడాను. వీలైనంత త్వరలోనే మోడీ ప్రభుత్వం ఏపీ ప్రగతికి అన్ని చర్యలు తీసుకుంటుంది. అటు ఏపీలో గానీ, ఇటు తెలంగాణలో గానీ ఎలాంటి రాజకీయ వివక్ష చూపకుండా రెండు ప్రాంతాలు శ్రీఘ్రగతిన అభివృద్ధి చెందేందుకు, ఆయూ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.  చాలా సంతోషం..’ అని చెప్పారు. 
     
     అన్నీ రాత్రికి రాత్రే జరిగేవి కావు..
     ‘మా చిత్తశుద్ధికి నిదర్శనం పోలవరం ఆర్డినెన్స్‌ను మొదటి రోజే జారీచేయడం. మిగిలినవాటిపై కూడా వరుసగా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని హామీలు ఉన్నాయి. వాటన్నింటినీ మంత్రులకు గుర్తుచేశాం. ఇవన్నీ రాత్రికి రాత్రే జరిగేవి కావు. పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 11వ షెడ్యూలులో పేర్కొన్నట్టుగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగాలి. వీటికి రెండు ప్రాంతాల ఆమోదం ఉంది. దీన్ని ఆ రోజు నేను పట్టుబట్టి పెట్టించాను. 13వ షెడ్యూలులో 12, 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఐఐటీ, ఐఐఎం, తదితర విద్యాసంస్థలు, ఎయిమ్స్ తరహా వైద్య సంస్థ ఏర్పాటు, వివిధ అభివృద్ధి పనులు, వివిధ వసతుల ఏర్పాటుకు అధ్యయనం తదితర హామీలు ఉన్నాయి. 
     
    ఇవన్నీ ఆనాడే మొదలుపెట్టి ఉంటే ఆ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కేది. కానీ చొరవ చూపలేదు. బీజేపీ ప్రభుత్వం చట్టంలో నిర్దేశించిన సమయం కంటే ముందే వేగంగా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా వస్తుంది. ఎన్డీసీ ఆమోదం పొందుతుంది..’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 5 ఏళ్లకు వర్తించేలా వస్తుందా లేక 15 ఏళ్లకా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘అది కేబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయం..’ అని మంత్రి జవాబిచ్చారు. విశాఖ, విజయవాడ-గుంటూరు-తెనాలి నగరాలకు మెట్రో రైలు కచ్చితంగా వస్తుందని, వీటిపై తగిన అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement