విభజనపై స్పష్టతనివ్వండి: రాజీవ్‌శర్మ
విభజనపై స్పష్టతనివ్వండి: రాజీవ్‌శర్మ
Published Sat, Nov 8 2014 2:18 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
కేంద్రానికి తెలంగాణ సీఎస్ విజ్ఞప్తి
ఢిల్లీలో ఉన్నతాధికారులతో భేటీ
ప్రభుత్వరంగ సంస్థల విభజన, ఉమ్మడి నిధుల పంపిణీపై చర్చ
చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు
ఢిల్లీలోనే ఏపీ సీఎస్, కేంద్రం
దృష్టికి పలు అంశాలు.. తెలంగాణ పోలీసుల తీరుపైనా ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థల విభజనపై స్పష్టత ఇవ్వాలని, ఉమ్మడి నిధుల పంపిణీకి విధి విధానాలను సూచించాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రాన్ని కోరారు. రాష్ర్ట విభజన చట్టంలోని అంశాలను ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోం దని ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, కేంద్ర హోం కార్యదర్శి అనిల్ గోస్వామితో శుక్రవారం ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లోని ఉమ్మడి ప్రభుత్వరంగ సంస్థలు, ఫిక్స్‌డ్ మొత్తాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో వివాదాలు తలెత్తుతున్నాయని వారి దృష్టికితెచ్చారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. ఉమ్మడి రాష్ట్ర నిధులను ఏపీలోని బ్యాంకులకు ఆ రాష్ర్ట ప్రభుత్వం బదలాయిస్తోందని ఫిర్యాదు చేశారు. ఏపీ చర్యలతో ఫిక్స్‌డ్ మొత్తాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కడం లేదని చెప్పినట్టు సమాచారం. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నిధులను ఏపీ అధికారులు తరలించిన వివరాలకు సంబంధించిన నివేదికను కూడా అందచేసినట్టు తెలుస్తోంది. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ కేటాయింపులు రావడం లేదని, శ్రీశైలంలో విద్యుదుత్పత్తినీ ఏపీ అడ్డుకుంటోందని వివరించారు.
కృష్ణపట్నం, సీలేరు నుంచి కూడా వాటా ఇవ్వడం లేదని, దీంతో తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రమైందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అఖిలభారత సర్వీసు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, వివిధ శాఖలకు అధిపతులు లేకపోవడం వల్ల పాలనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజీవ్ శర్మ వివరించారు. మరోవైపు ఏపీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు కూడా కేంద్ర అధికారులను కలిసి పలు అంశాలపై చర్చించారు. విభజన చట్టాన్ని తెలంగాణ సర్కారు ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో పోలీసుల తీరుపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement