ఆంటోనీ కమిటీ అటకెక్కిందా!?
రాష్ట్ర విభజనకు సంబంధించి సీమాంధ్ర ప్రజల భయాందోళనలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ప్రస్తుతం ఏం చేస్తోంది? తాజా పరిణామాలు గమనిస్తుంటే ఆ కమిటీ ‘పని’ ముగిసినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రుల సమస్యల్ని తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు పార్టీ సీనియర్ నేత, రక్షణ మంత్రి ఆంటోనీ నేతృత్వంలో పార్టీ స్థాయిలో ఒక కమిటీని కాంగ్రెస్ నియమించింది. అందులో పార్టీ సీనియర్ నేతలు వీరప్పమొయిలీ, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్‌లను సభ్యులుగా నియమించింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
దాంతో సీమాంధ్రుల సమస్యలపై స్పందించేందుకు ప్రభుత్వ స్థాయిలో మంత్రుల బృందాన్ని (జీఓఎం) నియమించారు. జీఓఎంలో ఆంటోనీ, వీరప్పమొయిలీలకూ చోటిచ్చారు. దాంతో ప్రస్తుతం ఆంటోనీ కమిటీ పరిస్థితి ప్రశ్నార్థకమైంది. నిజానికి ఆంటోనీ కమిటీ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కొందరు నేతలతో పలుసార్లు సమావేశమైంది. కానీ ఆ తరువాత ఆంటోనీ ఆరోగ్యం క్షీణించడంతో కమిటీ పని కుంటుపడింది. దాదాపు నెలరోజులు ఆంటోనీ ఆస్పత్రిలో ఉన్నారు. ఇటీవలే మళ్లీ విధుల్లో చేరారు. ఈ లోపు జీఓఎం ఏర్పాటైంది. ‘ప్రస్తుతం ఆంటోనీ కమిటీ పరిస్థితేంటో నాకు తెలియదు. అందులో సభ్యులమైన నేను, ఆంటోనీ ఇప్పుడు జీఓఎంలో ఉన్నాం’ అని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. ఆంటోనీ కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదికేమీ ఇవ్వలేదని మొయిలీ స్పష్టంచేశారు.