సీమాంధ్ర నేతల అభిప్రాయాలు వినడానికే కమిటీ పరిమితం
సీమాంధ్ర నేతల అభిప్రాయాలు వినడానికే కమిటీ పరిమితం
Published Thu, Aug 8 2013 1:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంత నేతలతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నలుగురు సభ్యులతో వేసిన కమిటీ కేవలం కంటితుడుపు చర్య అనడంలో సందేహం లేదు. ఈ కమిటీ ఏర్పాటు వెనుక కూడా కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి కసరత్తుకానీ, మేధోమథనంకానీ చేయలేదు. కేవలం సీమాంధ్ర నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసేందుకే దీన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కట్టుబడి ఉన్నారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని పార్టీ నాయకత్వం కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది.
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు, ఆ ప్రాంత నేతల ఆందోళనను కాస్త శాంతపరిచే ఉద్దేశంతోనే మాత్రమే కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాదు రోజూ ఢిల్లీ యాత్రలు చేస్తున్న సీమాంధ్ర నేతలు ఇక సోనియాను, ప్రధానిని కలుసుకునే వీలు లేకుండా ఈ కమిటీ ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ‘‘వారు ఏ సమస్య చెప్పుకోవాలన్నా, ఎలాంటి విజ్ఞప్తి చేయాలనుకున్నా కమిటీకే నివేదించాల్సి ఉంటుంది. అంటే వారు సోనియా, మన్మోహన్‌సింగ్‌లను పదేపదే కలుస్తూ తమ డిమాండ్లను వినిపించే ప్రక్రియకు చెక్ పెట్టే దిశగా ఈ కమిటీ ఏర్పాటైంది. వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కమిటీ సభ్యులు అవసరమైతే వాటిని సోనియాగాంధీకి నివేదిస్తారు...’’ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంటే ఇక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ కమిటీ ముందే తమ గోడు వెళ్లబోసుకోవాల్సి ఉంటుందన్నమాట!
తమ రాజకీయ భవిష్యత్తుకే పెద్దపీట..
సీమాంధ్ర నేతల ఆందోళనను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా పట్టించుకోకపోవడం వెనుక కూడా కారణం ఉంది. వారు తమ ప్రాంత ప్రజల ఆశలు, ఆకాంక్షలనుగాకుండా తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతోందన్న ఆందోళనతోనే హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారని, దీన్ని పార్టీ పెద్దలు గమనించారని సమాచారం. నిరసనలు వెల్లువెత్తుతుండటంతో తమ నియోజకవర్గాల్లోకి వెళ్లలేకపోతున్నామని ఏదో ఒక ప్రకటన ద్వారా వారిని శాంతపరచాలన్న విజ్ఞప్తులే ఆ ప్రాంత నేతలు చేస్తున్నారు. దీంతో అధిష్టానం వారి వాదనను తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే హైకమాండ్ పెద్దలు కూడా.. సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని, న్యాయం జరిగేలా చూస్తామని మాత్రమే చెబుతున్నారే తప్ప ‘విభజన’ నిర్ణయంపై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ‘‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. మా వాదన, సీమాంధ్ర ప్రాంత నేతల వాదనలో ఉన్న మౌలికమైన తేడాను అధిష్టానం గమనించింది. మేం మా ప్రజల అజెండాను, వారి గొంతును వినిపించాం. అలాగే తెలంగాణ ఏర్పాటు చేస్తే కచ్చితంగా ఆ ప్రాంతంలో నెగ్గుతామని చెప్పాం. కానీ సీమంధ్ర నేతలు ఎంపీలు, మంత్రులు ప్రజల మనోభీష్టాన్నిగాకుండా తమ రాజకీయ భవిష్యత్తును గురించే ప్రస్తావిస్తున్నారు. అందుకే వారి అభ్యర్థనల పట్ల అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించడం లేదు..’’ అని తెలంగాణవాదులు చెబుతున్నారు. సీమాంధ్ర నేతల ప్రయత్నాల పట్ల వారు పెద్దగా ఆందోళన చెందడం లేదు.
విభజన నిర్ణయం ముందే తెలుసు..
రాష్ట్ర విభజన తథ్యమన్న సంగతి కాంగ్రెస్ హైకమాండ్‌కు సన్నిహితంగా మెలిగే సీమాంధ్ర నేతలకు ముందుగానే తెలుసునని పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఆ ప్రాంత నేతలను సంప్రదించిన తర్వాతే విభజనపై పార్టీ అడుగు ముందుకేసింద ని పేర్కొంటున్నాయి. అందుకే వారు పార్టీ ద్వారా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటన ఇప్పించారని తెలుస్తుంది. తద్వారా సీమాంధ్రలో తమపై అంతగా వ్యతిరేకత రాదని భావించారు.
నలుగురు సభ్యులతో కమిటీ
రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలు, విభ జన సందర్భంగా పరిష్కారం కావాల్సిన పలు కీలక అంశాలపై ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, నేతల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పనిచేయనున్న ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. అయితే ఆంటోనీ కమిటీ ఎవరెవరితో సంప్రదిస్తుందన్న విషయంగానీ, ఎప్పటిలోగా అధిష్టానానికి నివేదిక సమర్పిస్తుందనే అంశాన్ని గానీ ఆ ప్రకటనలో ఎక్కడా పేర్కొనలేదు.
Advertisement